Yuvagalam: యువగళం.. నవశకం

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం ‘యువగళం- నవశకం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

Updated : 20 Dec 2023 05:55 IST

లోకేశ్‌ పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధం
హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌
పదేళ్ల తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపైకి తెదేపా, జనసేన అధినేతలు
రాష్ట్ర భవిష్యత్తుకు ఈ సభ కీలక మలుపు అవుతుందంటున్న పార్టీ వర్గాలు

ఈనాడు, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం ‘యువగళం- నవశకం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధికార పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఏ మాత్రం సహకరించకున్నా, ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వాహనాలు పెట్టుకుని తరలివస్తున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపై కలిసి కనిపించనున్నారు. పొత్తులో భాగంగా తెదేపా, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైన నేపథ్యంలో వీరందరూ ఒకే వేదికపైకి వచ్చి ప్రసంగించనుండటం ఇరు పార్టీలకు, రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు కానుందని ఆయా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ వేదికపై నుంచి ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.

200 ఎకరాల్లో ప్రాంగణం.. 6 లక్షల మందికి ఏర్పాట్లు

యువగళం విజయోత్సవ సభ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. సభకు 6 లక్షల మందికి పైగా వస్తారని తెదేపా అంచనా వేస్తోంది. పోలిపల్లిలోని ఓ ప్రైవేటు లేఅవుట్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 600 మందికి పైగా ముఖ్య నాయకులు ఆసీనులయ్యేందుకు వీలుగా 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల పొడవుతో భారీ సభా వేదికను నిర్మించారు. దూరంగా ఉన్నవారికి సైతం కనిపించేలా పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వచ్చేవారంతా కూర్చునేందుకు వీలుగా కుర్చీలు సిద్ధం చేశారు. తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మొత్తంగా 16 కమిటీలు వేసుకుని, ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సభకు హాజరయ్యేవారికి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు దాదాపు రెండు వేల మంది వాలంటీర్లుగా సేవలందించనున్నారు. సభకు హాజరయ్యేవారికి బుధవారం మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.

క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన పాస్‌లు

సభా వేదికపై తెదేపా, జనసేన పార్టీలకు చెందిన అత్యంత ముఖ్యమైన, ముఖ్యమైన నాయకులకు ప్రొటోకాల్‌ ప్రకారం స్థానాలు కేటాయించారు. తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, తెదేపా, జనసేన ముఖ్యనాయకులు వేదికపై అగ్రభాగాన ఆసీనులు కానున్నారు. వీరితో పాటు ఇతర ఆహ్వానితులు క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన పాస్‌లు ఇచ్చారు. ఆ కోడ్‌ను స్కాన్‌ చేసి వారిని సంబంధిత గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. వేదికకు కుడివైపు తొలి వరుసలో నందమూరి, నారా కుటుంబసభ్యులు, వీవీఐపీలు, వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. రెండో వరుసలో యూనిట్‌ ఇన్‌ఛార్జులతోపాటు ప్రజలు కూర్చునేలా ప్రణాళిక రూపొందించారు. ఎడమవైపున యూనిట్‌ ఇన్‌ఛార్జులు, పోలింగ్‌ కేంద్రాల ఇన్‌ఛార్జులు, కుటుంబ సాధికార సమితి సభ్యులు తదితరులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు.

భోగాపురం నుంచి విశాఖ వరకు పసుపుమయం

భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు పసుపు జెండాలు, కటౌట్లతో ఆ మార్గమంతా పసుపుమయమైంది. విశాఖనగరంతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ భారీ స్థాయిలో హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సభా ప్రాంగణంలో భారీగా పసుపు బెలూన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబసభ్యులు ఇప్పటికే పోలిపల్లి సమీపంలోని రిసార్ట్స్‌కు చేరుకున్నారు.

స్థలానికి అనుమతి నిరాకరించినా..

విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతివ్వాలని తెదేపా నాయకులు తొలుత దరఖాస్తు చేయగా పోలీసులు నిరాకరించారు. ప్రైవేటు స్థలంలో సభ ఏర్పాటు చేసుకున్నా ఆంక్షలు పెట్టారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. ప్రైవేటు బస్సులూ ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. సభకు లక్షల మంది వస్తున్నారని తెలిసినా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయలేదు. దీంతో పార్టీయే వాలంటీర్లను సిద్ధం చేసింది.

250 ఎకరాల్లో పార్కింగ్‌కు ఏర్పాట్లు

పార్కింగ్‌ కోసం 250 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. అనంతపురం, చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి రాజాపులోవ వద్ద, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే వారికి వేదిక వెనుక వైపు కేటాయించారు.


ప్రత్యేక విమానాల్లో రానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 1.30కి భోగాపురం మండల పరిధిలోని సన్‌రే రిసార్ట్సుకు చేరుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.15కు బయలుదేరి 3.30 గంటలకు పోలిపల్లిలోని సభాస్థలికి వస్తారు. సభ అనంతరం సాయంత్రం 6.15కు బయలుదేరి 7.30కు విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.40కు ప్రత్యేక విమానంలో బయలుదేరి విజయవాడ వెళ్లనున్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ రానున్నారు. బీచ్‌రోడ్డులోని నోవోటెల్‌ హోటల్‌కు వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి పోలిపల్లి వెళ్లనున్నారు. సభ ముగిసిన తర్వాత రాత్రికి విజయవాడ తిరిగి వెళతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు