Jagan and Chandrababu: పలకరించుకోని జగన్‌, చంద్రబాబు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5.30 నుంచి

Updated : 16 Aug 2022 07:57 IST

‘ఎట్‌ హోం’లో పాల్గొన్నా ఎవరి సీటుకు వారే పరిమితం
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విందు

ఈనాడు, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు జరిగిన ఎట్‌ హోంలో పాల్గొన్న వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు.  గవర్నర్‌ దంపతులతో కలిసి వేదిక ఎదురుగా తమకు కేటాయించిన స్థానాల్లో ఆసీనులయ్యారు. అప్పటికే చంద్రబాబు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి వేదికకు మరోవైపు కూర్చున్నారు. జాతీయ గీతాలాపన తర్వాత గవర్నర్‌ హరిచందన్‌ స్వయంగా ప్రముఖుల వద్దకు వెళ్లి పలకరించారు. చంద్రబాబు వద్దకు వచ్చి కరచాలనం చేశారు. చంద్రబాబు తన పక్కనున్న అచ్చెన్నాయుడు, నాని తదితరుల్ని గవర్నర్‌కు పరిచయం చేశారు. అనంతరం గవర్నర్‌, సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర దంపతులు కలిసి విందు స్వీకరించారు. కార్యక్రమంలో ఆద్యంతం జగన్‌, చంద్రబాబు ఇద్దరూ తమ సీట్లకే పరిమితమయ్యారు. శాసనమండలి ఛైర్మన్‌ కె.మోషేన్‌రాజు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పోలీసు పతక గ్రహీతలను గవర్నర్‌ అభినందించారు. ‘ఎట్‌ హోం’ ముగిశాక సీఎం కాన్వాయ్‌ అప్పటికే బయల్దేరుతుందనే సమాచారం రావడంతో చంద్రబాబు కొద్ది నిమిషాలు వేచి ఉన్నారు. రాజ్‌భవన్‌ నుంచి సీఎం కాన్వాయ్‌ వెళ్లిపోయాక.. చంద్రబాబు తన వాహనంలో బయల్దేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని