ఓటర్ల నమోదులో వాలంటీర్ల సేవలపై తెదేపా అభ్యంతరం

తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియలో వాలంటీర్లను వినియోగించుకునేలా అధికారులు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు ఫిర్యాదు చేశామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు వెల్లడించారు.

Published : 08 Oct 2022 04:17 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు

ఈనాడు-అమరావతి: తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియలో వాలంటీర్లను వినియోగించుకునేలా అధికారులు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు ఫిర్యాదు చేశామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్ల వ్యవస్థ దూరంగా ఉండాలని గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఇవేమీ పట్టించుకోకుండా పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఈ వ్యవస్థను ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. దీనికి సంబంధించి అధికారులు టెలిఫోన్‌ ద్వారా ఇచ్చిన ఆదేశాల సంభాషణల రికార్డింగ్‌, ఇతర ఆధారాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సాక్ష్యంగా అందించాం. ఇక్కడ న్యాయం జరగకపోతే దిల్లీ వెళ్లి కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. తెదేపా మద్దతుదారులు ఓటర్లుగా నమోదు కోసం అందించిన దరఖాస్తులపై ఎన్నికల సంఘం గుర్తు లేదన్న సాకుతో అధికారులు తిరస్కరిస్తూ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామంగా గుర్తింపు ఉన్న మాచర్ల నియోజకవర్గం పరిధిలోని జంగమేశ్వరపురానికి పోలింగ్‌ బూత్‌లను తరలించాలన్న ప్రతిపాదనను అధికారులు విరమించుకోవాలి...’’ అని ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని