మహారాజా పేరు తొలగించడం తుగ్లక్‌ చర్య

విజయనగరంలోని మహారాజా జిల్లా ఆసుపత్రి పేరు మార్పు మరో తుగ్లక్‌ చర్య అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 08 Oct 2022 04:17 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విజయనగరంలోని మహారాజా జిల్లా ఆసుపత్రి పేరు మార్పు మరో తుగ్లక్‌ చర్య అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎం జగన్‌ వెనక్కి తగ్గాల్సిందే అని ట్విటర్‌ వేదికగా శుక్రవారం డిమాండ్‌ చేశారు. ‘విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించి ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలైంది. నాడు మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌ పోస్టుల నుంచి అశోక్‌గజపతిరాజును తప్పించి న్యాయస్థానంతో చీవాట్లు తిన్నారు. అయినా వైకాపా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు.


జగన్‌ పిచ్చి పరాకాష్ఠకు చేరింది: లోకేశ్‌

విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు, నేడు విజయనగరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి మహారాజా పేరు తొలగింపుతో జగన్‌ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. విజయనగరం నడిబొడ్డున విలువైన భూమిని ఆసుపత్రి కోసం ఇచ్చిన మహారాజా పేరు తొలగింపు ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘‘అశోక్‌గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించి, అత్యాధునిక వసతులు కల్పించారు. రాత్రికి రాత్రి మహారాజా పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహనీయులను అవమానించి జగన్‌ రాక్షసానందం పొందుతున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి...’’ అని నారా లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని