గుడివాడ రణరంగం

అడుగడుగునా పోలీసుల అడ్డంకులు.. అధికార పార్టీ కార్యకర్తల దాడులు.. వాహనాల ధ్వంసం.. కార్యకర్తలకు గాయాలు.. పార్టీ కార్యాలయంపై దాడి... ఇదీ ఏపీలోని కృష్ణా జిల్లా

Published : 22 Jan 2022 04:57 IST

న్యూస్‌టుడే-గుడివాడ: అడుగడుగునా పోలీసుల అడ్డంకులు.. అధికార పార్టీ కార్యకర్తల దాడులు.. వాహనాల ధ్వంసం.. కార్యకర్తలకు గాయాలు.. పార్టీ కార్యాలయంపై దాడి... ఇదీ ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనలో శుక్రవారం తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీకి ఎదురైన పరిస్థితి. వైకాపా కార్యకర్తల రాళ్ల దాడుల్లో తెదేపా కార్యకర్త రమేష్‌చౌదరి గాయపడ్డారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు కారు ధ్వంసమైంది. కమిటీ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. పోలీసులు కమిటీ సభ్యులను అరెస్టుచేసి పామర్రు పోలీసుస్టేషన్‌కు తరలించారు. తమపై హత్యాయత్నం చేశారని తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్‌ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా గోవా తరహాలో క్యాసినో నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించాలని నిర్ణయించింది. పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  మంగళగిరి నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరారు. అనుమతి లేదని వీరిని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత 10 వాహనాలను అనుమతించారు.  చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ఒకే ఒక్క వాహనాన్ని పార్టీ కార్యాలయానికి అనుమతించారు. అప్పటికే కె-కన్వెన్షన్‌ వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కె-కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలిస్తామని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెదేపా కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేరారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు.  భారీగా ఉన్న వైకాపా కార్యకర్తలు పోలీసుల వలయం ఛేదించుకుని తెదేపా కార్యాలయంపై రాళ్లు విసిరారు. బారికేడ్ల వద్ద ఉన్న బొండా ఉమా కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ కారును చూసి.. ఇది వాడి కారేరా అంటూ బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో రాళ్లతో అద్దాలను పగలగొట్టడం కనిపించింది. వైకాపా కార్యకర్తల దాడిలో ముళ్లపూడి రమేష్‌ చౌదరి  గాయపడ్డారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు రాళ్లదాడులతో పాటు పిడిగుద్దులు గుద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని