పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!

పేదరికం వెనక్కి లాగాలనుకుంది... సామాజిక రుగ్మతలు శాసించాలనుకున్నాయి. అయినా ఈ యువతుల పట్టుదల చెదరలేదు. సంకల్పం సడలిపోలేదు. తమ జీవితాలు బాగుండాలంటే చదువే మార్గం అనుకున్నారు.

Updated : 27 Apr 2024 08:02 IST

పేదరికం వెనక్కి లాగాలనుకుంది... సామాజిక రుగ్మతలు శాసించాలనుకున్నాయి. అయినా ఈ యువతుల పట్టుదల చెదరలేదు. సంకల్పం సడలిపోలేదు. తమ జీవితాలు బాగుండాలంటే చదువే మార్గం అనుకున్నారు. అడుగడుగునా ఎదురైన సవాళ్లను దాటి మేటిగా నిలిచారు. తాజాగా విడుదలైన తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన పేదింటి ప్రతిభావనులతో ‘వసుంధర’ ముచ్చటించింది.


అడవి బిడ్డ ఫస్టు ర్యాంకుతో...

సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు... శ్రమే ఆయుధమవుతుంది. లక్ష్యం చేరువవుతుంది. ఇందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరారం గ్రామానికి చెందిన బానోతు అంజలి చక్కటి ఉదాహరణ. కష్టపడి చదివిన ఈ గిరిజన యువతి ఎంపీసీ విభాగంలో తెలంగాణలో మొదటి స్థానం అందుకుంది.

మారుమూల అటవీ ప్రాంతం మాది. పేదరికంలో పుట్టి పెరిగాను. మా ప్రాంతంలో నా వయసు పిల్లల్లో చాలామంది కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కూలి పనులకు వెళ్తుంటారు. ‘నిరుపేదల జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటే’ అని నాన్న నరసింహరావు భావన. నేనూ అన్నయ్య బాగా చదువుకోవాలని భావించేవారాయన. అమ్మానాన్నలు కుటుంబాన్ని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకునేవారు. ఆ కష్టాన్ని మాకు తెలియనివ్వకూడదని తాపత్రయ పడేవారు. కానీ, ఎంతైనా కూతుర్ని కదా... చిన్నప్పుడే ఆ విషయాన్ని అర్థం చేసుకున్నా. బాగా చదివి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడి మా కుటుంబానికి ఆసరాగా నిలవాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఐదు వరకూ మా ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివా... అప్పుడే నా ఆకాంక్షను గుర్తించిన ఇంగ్లిష్‌ టీచర్‌ యుగంధర్‌...మహాత్మా జ్యోతిబా ఫులే బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష రాయించారు. భద్రాచలంలో సీటు రావటంతో పదోతరగతి వరకూ అక్కడే చదువుకున్నా. టెన్త్‌లో 9.8 జీపీఏ సాధించా. ప్రతిభ కలిగిన విద్యార్థులకు డీఆర్‌డీఏ కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తుందని తెలిసి దరఖాస్తు చేసుకున్నా. అలా ఖమ్మంలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఎంపీసీలో చేరా. మొదటి ఏడాది పరీక్షల్లో 470కి 466 మార్కులు సాధించా. ఒక్క మార్కుతో స్టేట్‌ ర్యాంకుని కోల్పోవడంతో నాన్న బాధపడ్డారు. ఆయన సంతోషం కోసమే ఈ ఏడాది రెట్టింపు శ్రమించి చదివా. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించగలిగా. ఎంపీసీ విభాగంలో 1000కి 993 మార్కులు సాధించా. ఈ గెలుపు... అమ్మానాన్నలకు నేనిచ్చే బహుమతి. ఇప్పుడు వారి కళ్లల్లో సంతోషం చూస్తే ఎంత బాగుందో! 

 షేక్‌ లాలా, ఖమ్మం


చిన్నారి పెళ్లికూతురు నాలుగో ర్యాంకుతో

బాలికల విద్యకు చిన్నపాటి తోడ్పాటును అందిస్తే చాలు... ఉన్నతస్థాయిలో రాణిస్తారనేందుకు నిదర్శనమే ఈ చిన్నారి పెళ్లికూతురు. ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన్‌ 1098 సహకారంతో బాల్య వివాహం నుంచి తప్పించుకున్న బానోతు కుసుమ కుమారి ఇప్పుడు ఇంటర్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించుకుంటోంది.

ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల పల్లెమాది. ఆడపిల్లలంటే చిన్న చూపు ఉన్న సమాజంలో పుట్టిపెరిగా. అది అర్థమయ్యాక బాగా చదువుకుని నా కాళ్లమీద నేను నిలబడాలనుకున్నా. కష్టపడి చదివి, మంచి మార్కులూ తెచ్చుకునేదాన్ని. అయితే, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు నా ఆశలకు అడ్డుపడ్డాయి. పద్నాలుగేళ్లకే నాకు పెళ్లి చేయడానికి ఇంట్లోవాళ్లు నిర్ణయించేశారు. కానీ, నా మనసు మాత్రం... అందుకు ఒప్పుకోలేదు. ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలనుకున్నా. చైల్డ్‌లైన్‌ 1098కు ఫిర్యాదు చేేశా. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన్‌ సభ్యులు ఆ పెళ్లిని ఆపేశారు. నేను బాగా చదువుకుని నర్సుని అవ్వాలనుకుంటున్నా అని వారికి చెప్పడంతో మణుగూరులోని చిల్డ్రన్స్‌ హోమ్‌కు పంపించారు. ఆపై ములకలపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాసంస్థ (కేజీబీవీ)ల్లో చేర్పించారు. వేసవి సెలవుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని చిల్డ్రన్స్‌హోమ్‌లో, పని దినాల్లో కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ పూర్తిచేశా. ఇంటర్‌ మొదటి ఏడాది ఎంపీహెచ్‌డబ్ల్యూ (మల్టీపర్పస్‌ హెల్త్‌వర్కర్‌) చదివా. కేజీబీవీ కళాశాలల పరిధిలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం అందుకున్నా. రెండో ఏడాది 978 మార్కులతో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచా. ఈ గెలుపు బాల్యవివాహాలు చేయాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పునీ, ఆడపిల్లల్లో చైతన్యాన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నా. 

 విద్యాసాగర్‌, ములకలపల్లి


సౌకర్యాలు లేకున్నా... మంచి మార్కులతో

జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు... దాన్ని అందుకోవాలంటే చదువే సరైన మార్గం అంటోంది దుంప శ్రావణి. ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేసే అమ్మానాన్నలకు అండగా నిలవడమే లక్ష్యం... అంటూ చదువుల్లో ముందుకు దూసుకుపోతోంది.

మా స్వస్థలం... యాదాద్రి భువనగిరి జిల్లాలోని రహీంఖాన్‌పేట. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక మా కుటుంబం కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తికి వలసొచ్చింది. నాన్న రవి, అమ్మ విజయ... ఇద్దరూ మట్టి కార్మికులు. వ్యవసాయ బావుల తవ్వకాలు, పూడికతీత పనులు చేస్తుంటారు. నిత్యం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చేసే పనులు ఇవి. ఇంత చేసినా వచ్చే ఆదాయం అరకొరే. అద్దె ఇంట్లో జీవనం. ఒళ్లు హూనమయ్యేలా పనిచేసేది మాకోసమే అని గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో బాధ కలిగేది. ముగ్గురు పిల్లల్లో నేను చివరిదాన్ని. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయగలిగితేనే వాళ్ల శ్రమను తగ్గించగలిగేది. దీనికి తోడు పల్లెల్లో వైద్య సౌకర్యాలు లేకపోవడంతో వైద్య విద్య చదవాలనుకున్నా. స్థానికంగా పదో తరగతి  చదివి 9.5 గ్రేడ్‌ అందుకున్నా. ఇంటర్‌ న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో చదివా. బైపీసీలో 1000కి 973 మార్కులు సాధించా. తరగతిలో పాఠాలు శ్రద్ధగా వినడం, నోట్స్‌ రాసుకుని ఇంటి దగ్గర రివిజన్‌ చేసుకోవడం వల్లే నేను సాధించగలిగా. నీట్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ వైద్యురాలిగా పేదలకు వైద్యం చేయాలనుకుంటున్నా.

 జనగాం గోపాల్‌రెడ్డి, గంగాధర 


ప్రభుత్వ సంస్థల్లో చదివి...

ఏదైనా సాధించాలనుకునేవారికి పేదరికం అడ్డుకాదని నిరూపిస్తోంది కాపెర్ల సాయి శ్వేత. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని ప్రభుత్వ కళాశాలలో చేర్పిస్తే... కార్పొరేట్‌ విద్యార్థులకు పోటీనిస్తూ 968 మార్కులు సాధించింది. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

మాది అన్నమయ్య జిల్లాలోని మారుమూల గ్రామం మిట్ట కమ్మపల్లి. నాన్న కాపెర్ల సుబ్బరాయుడు రైతు. అమ్మ అంజనమ్మ. ఏడోతరగతి వరకు మా ఊళ్లోని ప్రైవేటు పాఠశాలలోనే చదివా. తరవాత ఆర్థిక సమస్యల కారణంగా తమ్ముడిని కొనసాగించి... నన్ను మా ఊరికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. చదువుపై నాకున్న శ్రద్ధను చూసి, మా హిందీ టీచర్‌ సత్తార్‌ హుస్సేన్‌ పుస్తకాలనూ ఉచితంగా ఇచ్చారు. ఆ ప్రోత్సాహానికి మరింత పట్టుదలగా చదివి పదో తరగతిలో 530 మార్కులు సాధించా. కానీ వ్యవసాయం కలిసి రాక ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. మమ్మల్ని సరిగా చూసుకోలేకపోతున్నామని అమ్మానాన్న బాధపడేవారు. ఇలాగే కొనసాగితే అప్పుల భారం పెరుగుతుందని సమీప పట్టణం రాజంపేటకి చేరుకున్నాం. నాన్నకి ఎలక్ట్రిక్‌ పనులపై అనుభవం ఉంది. ఆ పనులు చేస్తూ సంపాదన మొదలుపెట్టారు. అంతా బాగుంది అనుకునేంతలో కరోనా. మూడు పూటలా తిండికీ ఇబ్బంది పడ్డ రోజులున్నాయి. ఈ కష్టాలన్నీ బాగా చదవాలన్న కసిని నింపాయి. రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీలో చేరా. తొలిరోజు నుంచీ కష్టపడి చదివేదాన్ని. మా ప్రిన్సిపల్‌, మ్యాథ్స్‌ లెక్చరర్ల ప్రోత్సాహం తోడైంది. దీనికితోడు ఉదయం స్టడీ అవర్‌, సాయంత్రాలు ఆరోజు పాఠాలపై పరీక్షలు, ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహించేవారు. ఇవన్నీ సబ్జెక్టులన్నింటిపై పట్టు సాధించడానికి కారణమయ్యాయి. 968 మార్కులతోపాటు కాలేజీ టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. కళాశాలలో ఉచితంగా ఎంసెట్‌ కోచింగ్‌కి హాజరవుతున్నా. ఇంజినీరింగ్‌ చేయాలనుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యి అమ్మానాన్నలను బాగా చూసుకోవాలన్నది నా కల.

 బోగెం శ్రీనివాసులు, కడప

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్