Yuvagalam: దాడులను ప్రతిఘటిస్తూ, కవ్వింపు చర్యలను ఎదుర్కొంటూ.. సాగుతోన్న ‘యువగళం’

దాడులను ప్రతిఘటిస్తూ.. కవ్వింపు చర్యలను ఎదుర్కొంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోంది. 

Published : 25 Aug 2023 17:59 IST

నూజివీడు: దాడులను ప్రతిఘటిస్తూ.. కవ్వింపు చర్యలను ఎదుర్కొంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోంది. వైకాపా శ్రేణులు ముందస్తు వ్యూహాలతో దాడులకు తెగబడతారని పోలీసులకు ముందుగానే సమాచారం ఇస్తున్నా.. పోలీసులు వారి వెంటే ఉండటం విమర్శలకు తావిస్తోంది. బాధ్యులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేయడం పోలీసులకు పరిపాటిగా మారింది. యువగళం పాదయాత్ర 194వ రోజు నూజివీడు వద్ద వైకాపా శ్రేణులు.. తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడితే డీఎస్పీ అక్కడే ఉండి చోద్యం చూస్తూ తెలుగుదేశం శ్రేణులపైకి పోలీసులను ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది.

జననీరాజనాల మధ్య 194వ రోజు పాదయాత్ర

ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నారా లోకేశ్‌ 194వ రోజు పాదయాత్ర జన నీరాజనాల మధ్య ప్రారంభమైంది. మీర్జాపురం నుంచి గొల్లపల్లి, మొరసపూడి, తుక్కులూరు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. జెండాలు పట్టుకొచ్చిన వైకాపా కార్యకర్తలను పోలీసులు నియంత్రించలేదు. వైకాపా శ్రేణుల్ని ప్రతిఘటించేందుకు యత్నించిన తెలుగుదేశం శ్రేణులపై పోలీసులు జులం ప్రదర్శింంచారు. తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించిన పోలీసులు.. వైకాపా శ్రేణులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపారు. తుక్కులూరు వద్ద ఘర్షణకు అవకాశం ఉందని తెదేపా శ్రేణులు మందుగానే డీఎస్పీకి సమాచారం ఇచ్చినా.. డీఎస్పీ అక్కడే ఉండి వైకాపా కవ్వింపు చర్యలను పర్యవేక్షించారే తప్ప అక్కడి నుంచి వారిని పంపే ప్రయత్నం చేయలేదు.

పోలీసుల సమక్షంలోనే దాడులు...

నూజివీడు ఘర్షణపై పోలీసులకు తెదేపా నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించారు. పోలీసులకు జవహర్‌ తనయుడు కొత్తపల్లి ఆశిష్‌, గిరిజన నేత వెంకటప్ప ఫిర్యాదు చేశారు. నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు బైపాస్ జంక్షన్ వద్ద వైకాపా నేతలు పాలడుగు విజయ్ కుమార్, యలమర్తి చిట్టిబాటు, కొండాలి వెంకటేశ్వరరావు, రాజా మరికొందరు ఉద్దేశపూర్వకంగా పాదయాత్రలోకి చొరబడి బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా జెండాలతో కూడిన పదునైన ఇనుపరాడ్లు పట్టుకుని వచ్చిన పాలడుగు విజయ్ కుమార్, కొడాలి వెంకటేశ్వరరావులు లోకేష్, చంద్రబాబు లను బూతులు తిట్టారని ఫిర్యాదులో తెలిపారు. ఎస్సీ ఎస్టీలమైన తమను కులం పేరుతో బూతులు తిట్టి దాడి చేశారని వాపోయారు. చంపండ్రా అంటూ హత్యాయత్నానికి యత్నించి కింద పడేసి తమపై పిడిగుద్దులు గుద్దారని తెదేపా నేతలు పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రతులను తెలుగుదేశం నేతలు జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు పంపారు.

అయ్యన్న, బుద్దా వెంకన్నపై కేసులు..

మరో వైపు పోలీసులు గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం ఘర్షణ, గన్నవరం యువగళం బహిరంగసభకు సంబంధించి కేసుల పరంపర కొనసాగించారు. యువగళం బహిరంగసభ వేదిక నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు తెదేపా సీనియర్‌ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడివిడిగా కేసులు నమోదు చేశారు. అయ్యన్నపై 153A, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, బుద్దా వెంకన్న పై 153, 153A, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అక్రమ కేసులపై నారా లోకేశ్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవ‌స్థలో ప్రజాకంట‌క పాల‌కుల‌ను ప్రశ్నించే బాధ్యత ప్రతిప‌క్ష తెదేపా నిర్వర్తించ‌డం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ప్రతిప‌క్షనేత‌గా ఉన్న జ‌గ‌న్ రెడ్డి చేసిన‌వని మండిపడ్డారు. అపోజిష‌న్ లీడ‌ర్‌లా కాకుండా ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి, ఉరి వేయండి, చెప్పుల‌తో కొట్టండి, చీపుర్లతో త‌ర‌మండి అని విధ్వేషం నింపే ప్రసంగాలు చేశారని ధ్వజమెత్తారు. ప్రతిప‌క్షనేత‌గా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోకేష్ ఓ వీడియోను విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు