NDA: బిహార్‌లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ

బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. భాజపా అత్యధికంగా 17 స్థానాల్లో పోటీ చేయనుంది.

Published : 18 Mar 2024 18:46 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు బిహార్‌లో ఎన్డీయే(NDA) భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా భాజపా 17 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇకపోతే సీఎం నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ 16, చిరాగ్‌ పాసవాన్‌కు చెందిన ఎల్‌జేపీ (రాంవిలాస్‌) పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. మిగతా రెండు ఎన్డీయే భాగస్వామి పార్టీలైన హిందుస్థానీ అవామ్‌ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌ మంచ్‌ పార్టీ చెరో ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తాయని భాజపా బిహార్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి  వినోద్‌ తాడ్వే వెల్లడించారు. ఈమేరకు ఆయన ఎన్డీయే భాగస్వామి పార్టీల నేతలతో కలిసి దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

చిరాగ్‌ పాసవాన్‌ హాజీపూర్‌ సీటు నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నేత రాజు తివారీ వెల్లడించారు. ఎల్జేపీలో మరో వర్గం నేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్‌ వర్గానికి ఈ సీట్ల పంపకంలో ఎలాంటి ప్రాధాన్యం కల్పించకపోవడం గమనార్హం. అయితే, ఆయనతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్‌ చౌదరి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని