Nitish Kumar: బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆమోదం

బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన అభ్యర్థనకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. 

Updated : 28 Jan 2024 14:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్రను  కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. దీంతో గవర్నర్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించారు.నీతీశ్‌ వెంట భాజపా శాసనసభా పక్ష నేత  సామ్రాట్‌ చౌధరీ, ఇతర నేతలు ఉన్నారు.  

నేటి సాయంత్రం 5 గంటలకు కొత్త కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సాయంత్రం 4.15కు పట్నాకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రిగా నీతీశ్‌తోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ జాబితాలో భాజపా నుంచి సామ్రాట్‌ చౌధరీ, విజయ్‌ సిన్హా, డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, జేడీయూ నుంచి శ్రవణ్‌ కుమార్‌, హెచ్‌ఏఎం తరఫున సంతోష్‌ సుమన్‌, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌ సింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది. 

ముగిసిన జేడీయూ-ఆర్జేడీ బంధం.. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ రాజీనామా..

మరోవైపు కాంగ్రెస్‌ తీరును జేడీయూ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ ‘‘ డిసెంబర్‌ 19న అశోకా హోటల్‌లో జరిగిన సమావేశంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఇండియా కూటమిని హైజాక్‌ చేయడానికి ప్రయత్నించారు. దీనిలో భాగంగానే నాయకత్వ బాధ్యతలను ఖర్గేకు కట్టబెట్టారు. వాస్తవానికి అంతకు ముందు ముంబయిలో జరిగిన సమావేశంలో కూటమి నాయకత్వం ఎవరికీ ఇవ్వకుండానే సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. కానీ, అశోకా హోటల్‌లో టీఎంసీ నేత మమతా బెనర్జీతో కలిసి ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలని ప్రయత్నించారు’’ అని ఆరోపించారు. ఇక నీతీశ్‌ రాజీనామాపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య స్పందించారు. చెత్త తిరిగి చెత్తకుండీలోకి చేరిందని విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని