Nitish Kumar ముగిసిన జేడీయూ-ఆర్జేడీ బంధం.. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ రాజీనామా..

బిహార్‌లో మహా కూటమి ప్రభుత్వం పతనమైంది. సీఎం పదవికి నీతీశ్‌ కుమార్‌ రాజీనామా సమర్పించారు.

Updated : 28 Jan 2024 13:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు లేఖ సమర్పించారు. దీంతో ఆర్జేడీతో కలిసి జేడీయూ ఏర్పాటు చేసిన మహాకూటమి ప్రభుత్వం పతనమైంది. తాజాగా నీతీశ్‌ భాజపాతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

అంతకు ముందు పట్నాలో జరిగిన జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని నీతీశ్‌ వెల్లడించారు. పార్టీ నేతలు కూడా ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాజ్‌భవన్‌ వద్ద నీతీశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను. మహా కూటమి ప్రభుత్వం ముగిసింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు.. కొత్త బంధం కోసం ప్రస్తుత కూటమిని వీడాను. దానిలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. మా పూర్వ భాగస్వామి (భాజపా) కలిస్తే ముందుకు సాగుతాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను. గతంలో మాకు పొత్తు కుదిరింది (ఇండియా కూటమిని ఉద్దేశించి). కానీ, ఎవరూ ఏమీ చేయలేదు. నేను ఇండియా కూటమి నుంచి కూడా బయటకు వచ్చేశాను’’ అని  ప్రకటించారు. మరోవైపు గవర్నర్‌ ఆయన రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని కోరారు. రాజ్‌భవన్‌కు బయల్దేరే ముందు నీతీశ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేసి అభినందించినట్లు తెలుస్తోంది.

నీతీశ్‌ నిర్ణయంపై ఆర్జేడీ ప్రతినిధి శక్తి యాదవ్‌ స్పందిస్తూ ‘‘నిర్ణయం తీసుకుంటే వారికి అభినందనలు. బిహార్‌ ప్రజలు అంతా గమనిస్తున్నారు. గతంలో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది నీతీశ్‌ ఆలోచనే.  తాజాగా దీన్ని పడగొట్టాలనేది కూడా ఆయన నిర్ణయమే. మేం తేజస్వీ యాదవ్‌ హామీని అమలు చేశాం’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు