Andhra News: ముద్రిత వాహన బీమాలు చెల్లవిక

నకిలీ వాహన బీమా పాలసీలను అరికట్టేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. మాన్యువల్‌గా ఇచ్చే బీమా పాలసీ పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించింది. మూడు వారాల్లో

Published : 29 Jun 2022 09:36 IST

మూడు వారాల్లో కంప్యూటరైజ్డ్‌ పాలసీలు ఇవ్వాలి

ఇన్సూరెన్స్‌ కంపెనీలకు రవాణా శాఖ లేఖ

ఈనాడు, అమరావతి: నకిలీ వాహన బీమా పాలసీలను అరికట్టేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. మాన్యువల్‌గా ఇచ్చే బీమా పాలసీ పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించింది. మూడు వారాల్లో కంప్యూటరైజ్డ్‌ బీమా పాలసీలు మాత్రమే జారీచేయాలని, వాటి వివరాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉంచాలంటూ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ అన్ని బీమా సంస్థలు, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ)కు లేఖలు రాశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున నకిలీ వాహనబీమా పత్రాలు జారీ అవుతున్నాయి. మధ్యవర్తులు ఇతర బీమా పాలసీ పత్రంలోని తేదీలు, వాహన నంబరు మార్చి నకిలీవి సృష్టిస్తున్నారు. సంబంధిత బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో పరిశీలిస్తేగానీ అది అసలుదో, నకిలీదో తెలియని విధంగా వీటిని తయారుచేస్తున్నారు. ఉదాహరణకు, ప్రయాణికుల ఆటోకి థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రూ.7,800 ఉండగా, పూర్తిస్థాయి బీమా ప్రీమియం రూ.8,300 వరకు ఉంటుంది. గూడ్స్‌ ఆటోకి థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం 5,400, ద్విచక్ర వాహనానికి రూ.1,250, లారీలు, బస్సులకు సామర్థ్యాన్ని బట్టి రూ.40 వేల నుంచి ఉంటుంది. ఆటోకి కేవలం రూ.2 వేలు చెల్లిస్తే థర్డ్‌పార్టీ పాలసీ పుట్టించే దళారులున్నారు. వీరి అక్రమాలను అడ్డుకునేందుకు కొత్త విధివిధానాలు రూపొందించారు. వాహన బీమా అందించే సంస్థలు 27 ఉండగా, వీటిలో 23 ప్రైవేటువే. కొన్ని సంస్థలు ఇప్పటికీ ముద్రిత బీమా పాలసీలు ఇస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. సాధారణంగా కంప్యూటరైజ్డ్‌ బీమా పాలసీ జారీచేశాక, వివరాలు 24 గంటల్లో ఆన్‌లైన్‌లో కనిపించాలి. కానీ కొన్నింటికి అవి చూపడంలేదు. దీంతో ఇకపై ఆన్‌లైన్‌లో వివరాలు ఉంటేనే ఆ పాలసీని పరిగణనలోకి తీసుకుంటామని రవాణాశాఖ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని