IPL 2023: ఈసారి 200+... అస్సలు సరిపోవడం లేదు.. ఇలా అయితే కష్టమే!

టీ20 క్రికెట్‌లో 200పైగా పరుగుల చేసినా టీమ్‌ ఓడిపోతోంది. ఒక్కోసారి ప్రత్యర్థి టీమ్‌ దగ్గర వరకు వచ్చి భయపెడుతోంది. ఐపీఎల్‌ (IPL)లో ఈ ఏడాది ఇలాంటి సీన్స్‌ చాలా జరిగాయి.

Updated : 09 May 2023 15:06 IST

టీ20 క్రికెట్‌లో మినిమం గ్యారెంటీ స్కోరెంత. దీనికి సమాధానం 200+ అనేవారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ (IPL 2023) చూశాక కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ భారీ టార్గెట్‌ను ఈ ఏడాది చాలా జట్లు కొట్టేశాయి. మరికొన్నిసార్లు ఛేజింగ్‌లో 200 దాటేసి భయపెట్టాయి. దీంతో 200+ కూడా సేఫ్‌ కాదు అంటున్నారు. మరి ఆ మ్యాచ్‌ల సంగతేంటో చూద్దామా!


రింకూ రప్ఫాడిస్తే...

బ్యాటర్లు విజృంభించి 204 పరుగులు చేయడంతో విజయం పక్కా అనుకుని ఫీల్డింగ్‌కి వచ్చింది గుజరాత్‌ (Gujarat Titans) టీమ్‌. అనుకున్నట్లుగా విజయం అంచువరకు వెళ్లారు కానీ.. రింకూ సింగ్‌ ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా (Kolkata Knight Riders)ను గెలిపించాడు. అలా 200+ కొట్టిన గుజరాత్‌ ధైర్యానికి చెక్‌ పెట్టాడు. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


తొమ్మిది పడినా..

సిక్స్‌లు, ఫోర్లు కొట్టడం అంత ఈజీనా అన్నట్లు టాప్‌ ఆర్డర్‌ విజృంభించడంతో బెంగళూరు (Royal Challengers Bangalore) 212 పరుగులు చేసింది. దీంతో కాస్త ధీమాగా ఫీల్డింగ్‌కి వచ్చారు బెంగళూరు బాయ్స్‌. కానీ లఖ్‌నవూ (Lucknow Super Giants) వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఆఖరికి బంతికి అవసరమైన పరుగును తీసేసి గెలిచేశారు. ఇక్కడ వరుస సిక్స్‌లు లేవు కానీ..  ఇది కూడా ఫుల్‌ థ్రిల్లరే. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


గెలవలేదు కానీ... 

ఛేజింగ్‌లో 205 పరుగులు కొట్టినా జట్టు గెలవలేదు అంటే ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఇంకెంత కొట్టి ఉండొచ్చు చెప్పండి. ఈ పరిస్థితి హైదరాబాద్‌, కోల్‌కతా మ్యాచ్‌ మధ్యలో జరిగింది. తొలుత సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) 228/4 చేస్తే.. రిటర్న్‌లో కోల్‌కతా 205/7 చేసి దాదాపు గెలిచినంత పని చేసింది. ఈ మ్యాచ్‌లో థ్రిల్‌ లేకపోయినా.. భారీ షాట్లు అయితే అలరించాయి. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


ఆఖర్లో టైట్‌ చేసి...

బెంగళూరు వర్సెస్‌ చెన్నై మ్యాచ్‌ అంటేనే ఆసక్తి. అలాంటి మ్యాచ్‌లో రెండు జట్లూ 200+ చేస్తే ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌. అయితే ఆఖరికి విజయానందం మాత్రం చెన్నై (Chennai Super Kings)కే దక్కింది. తొలుత బ్యాటింగ్‌ చేసి ధోనీ సేన 226/6 చేస్తే.. రిప్లైగా బెంగళూరు 218/8 దగ్గర ఆగిపోయింది. మ్యాచ్‌ బెంగళూరుదే అని పక్కాగా అనుకుంటున్న సమయంలో మహేష్‌ పతిరాణ వేసిన ఓవర్లు చెన్నైని గెలిపించేశాయి అని చెప్పాలి. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


వికెట్లు విరిగిపోయాయ్‌...

క్రీజులో భారీ హిట్టర్లు.. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులే కావాలి. ముంబయి విజయం పక్కా అనుకుంటుండగా.. పంజాబ్‌ (Punjab Kings) బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అదరగొట్టి.. వికెట్లు విరగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి (Mumbai Indians) గెలిచేలా కనిపించినా.. 201 పరుగులు మాత్రమే చేసి విజయానికి 13 పరుగుల దూరంలో ఉండిపోయింది. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


రికార్డు దగ్గరకు వెళ్లి... 

ఐపీఎల్‌లో టీమ్‌ అత్యధిక స్కోరు అంటే..  బెంగళూరు 2013లో కొట్టిన 263 పరుగులే. ఈ ఏడాది ఆ రికార్డుకు దగ్గరగా వచ్చింది లఖ్‌నవూ. తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసింది. ఇంత భారీ లక్ష్యం ఉన్నా ప్రత్యర్థి పంజాబ్‌ ధైర్యంగా పోరాడింది. 201 పరుగులు చేసి 200+ క్లబ్‌లో ఈ మ్యాచ్‌ను పెట్టింది. ఓపెనర్ల నుంచి సరైన దాడి వచ్చి ఉంటే మ్యాచ్‌లో ఇంకాస్త క్లోజ్‌గా పంజాబ్‌ వెళ్లేది. ఇంత భారీ స్కోర్లు వచ్చినా ఈ మ్యాచ్‌లో సెంచరీలు లేవంటే నమ్ముతారా?మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


అంత ఒత్తిడిలోనూ..

విజయానికి ఆఖరి బంతికి మూడు పరుగులు కావాలి.. అటువైపు పతిరాణ అదిరిపోయే బౌలింగ్‌ వేస్తున్నాడు. కానీ జాగ్రత్తగా షాట్‌ కొట్టి మూడు రన్స్‌ పరిగెత్తి గెలిచారు పంజాబ్‌. బెస్ట్ ఛేజ్‌ అనదగ్గ ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ 200+ పరుగులు చేశాయి. ఆఖరి దాకా గెలుపు చెన్నైదే అనుకున్నా.. సికిందర్‌ రజా ‘పరుగు’ పంజాబ్‌ను గెలిపించింది.  ఇందులో చెన్నై సరిగ్గా 200 పరుగులు చేయగా.. 201 లక్ష్యం పంజాబ్‌ ఛేజ్‌ చేసేసింది. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


మూడు సిక్స్‌లు కొట్టి...

ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కొట్టాలి అంటే.. మ్యాచ్‌ ఆఖరి బంతివరకు వెళ్తుంది అనుకుంటాం. కానీ ముంబయి కుర్రాళ్లు మూడు బంతుల్లోనే ముగించారు. టిమ్‌ డేవిడ్‌ భీకరమైన మూడు సిక్స్‌లు కొట్టి ‘మ్యాచ్‌ మాదే ’ అనుకుంటున్న రాజస్థాన్‌ (Rajasthan Royals)కు చెక్‌ పెట్టాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ టీమ్‌ 212/7 చేయగా.. ముంబయి మరో మూడు బంతులు ఉండగానే బాదేసి.. విజయం వారి నుంచి లాగేసుకుంది. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


మనసులు విరిగాయి...

వికెట్లు విరిచి మరీ పంజాబ్‌ గెలిచిన మ్యాచ్‌ గుర్తుందా? ముంబయి విజయానందాన్ని ఆఖరి ఓవర్‌లో కింగ్స్‌ లాగేసుకున్న మ్యాచ్‌ అది. దానికి రివెంజ్‌ అన్నట్లుగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ సేమ్‌ టార్గెట్‌ (215) ఇచ్చింది. అయితే ఈసారి ముంబయి కుర్రాళ్లు పంజాబ్‌కు ఛాన్స్‌ ఇవ్వలేదు. ఏడు బంతులు మిగిలి ఉండగానే కావాల్సిన రన్స్‌ కొట్టేసి ప్రతీకారం తీర్చుకున్నారు. అప్పుడు వికెట్లు పగిలితే.. ఇప్పుడు మనసులు విరిగాయి. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


నోబాల్‌ తెచ్చిన కష్టం

హైదరాబాద్‌ మ్యాచ్‌లో సందీప్‌ శర్మకు ఆఖరి ఓవర్‌ ఇచ్చి గతంలో చెన్నై మీద వచ్చిన ఫలితాన్ని ఆశించాడు రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌. మహేంద్ర సింగ్‌ ధోనీ లాంటి బ్యాటర్‌ను సందీప్‌ ఆఖరి ఓవర్‌లో కట్టడి చేసి విజయం సాధించిపెట్టాడు మరి. అయితే ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. సంజూ బాయ్స్‌ విజయం పక్కా అనుకుంటుండగా నోబాల్‌ వేసి, ఆ తర్వాత ఫ్రీ హిట్‌కి సిక్స్‌ ఇచ్చి జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. తొలుత రాజస్థాన్‌ 214 చేయగా... హైదరాబాద్‌ 217 చేసి రాయల్స్‌కి షాక్‌ ఇచ్చింది. మ్యాచ్‌ పూర్తి వివరాలు కోసం క్లిక్‌ చేయండి


ఇలా 200+ స్కోర్లు ఈ ఐపీఎల్‌లో సేఫ్‌ అనే పరిస్థితి కనిపించడం లేదు. ఇలానే కొనసాగితే బౌలర్లకు బ్యాటర్ల ఊచకోత తప్పదు అనిపిస్తోంది. ఇంకా సుమారు 20 మ్యాచ్‌లున్న ఈ సీజన్‌లో ఇలాంటి మ్యాచ్‌లు ఇంకెన్ని చూస్తామో. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని