Asia Cup 2023: సూపర్‌-4 మ్యాచ్‌ల వేదికల్లో మార్పు?నేపాల్‌తో మ్యాచ్‌కు బుమ్రా దూరం

టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సెప్టెంబరు 4న నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా అతడు శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చాడు.

Updated : 03 Sep 2023 22:27 IST

దిల్లీ: ఆసియా కప్‌లో ప్రస్తుతం గ్రూప్‌ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే జరుగుతున్నా శ్రీలంకలోని మ్యాచ్‌లకు వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇప్పటికే పల్లెకెలెలో జరిగిన భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అప్రమత్తమైంది. కొలంబోలో నిర్వహించాల్సిన ఐదు సూపర్‌-4, ఫైనల్‌ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని యోచిస్తోంది. ప్రస్తుతం కొలంబోలో భారీ వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. 

ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్‌ వరల్డ్‌కప్‌ రేసులో ముందుకొచ్చాడు: రవిశాస్త్రి

మరికొన్ని రోజులపాటు కొలంబోలో కుండపోత వర్షాలు కురుస్తాయని శ్రీలంక వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ మ్యాచ్‌లను పల్లెకెలె లేదా దంబుల్లాకు తరలించాలని ఏసీసీ భావిస్తోంది. హంబన్‌తోట కూడా ఏసీసీ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతోంది. రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. కొలంబోలో సెప్టెంబరు నుంచి సూపర్‌-4 మ్యాచ్‌లు ప్రారంభం కావాల్సి ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌ (సెప్టెంబరు 17న) కూడా కొలంబోలోనే జరగాల్సి ఉంది. 


నేపాల్‌తో మ్యాచ్‌కు బుమ్రా దూరం

టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సెప్టెంబరు 4న నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా అతడు శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చాడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేసిన బుమ్రా అక్కడి నుంచి నేరుగా శ్రీలంక చేరుకున్నాడు. అయితే, బుమ్రా భారత్‌కు వచ్చిన విషయం గురించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అక్టోబరు, నవంబరులో ప్రపంచకప్‌ ఉన్నందున ఆసియా కప్‌లో బుమ్రాను పెద్ద జట్లతో జరిగే మ్యాచ్‌ల్లోనే ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నేపాల్‌తో మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినా లేదా మ్యాచ్‌ రద్దయినా.. టీమ్‌ఇండియా సూపర్-4కు అర్హత సాధిస్తుంది. సూపర్‌-4 మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. సూపర్‌-4లో భాగంగా సెప్టెంబరు 10న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ మరోసారి తలపడతాయి. గ్రూప్‌ దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని