Bhuvneshwar Kumar: భువీకి ఏమైంది..? ఇన్‌స్టా బయోలో ‘క్రికెటర్‌’ అని తీసేసి..!

టీమిండియా కింగ్ ఆఫ్‌ స్వింగ్‌ భువీ (Bhuvneshwar Kumar) ఇక ఆటకు వీడ్కోలు పలుకుతున్నాడా? తన ఇన్‌స్టా బయో నుంచి క్రికెటర్‌ పదాన్ని తొలగించడంతో నెట్టింట ఈ చర్చ మొదలైంది. 

Published : 28 Jul 2023 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా (Team India) సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvneshwar Kumar) మరోసారి వార్తల్లో నిలిచాడు. గత కొంతకాలంగా కీలక టోర్నీలకు దూరంగా ఉన్న భువీ.. తాజాగా క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో ‘క్రికెటర్‌ (Cricketer)’ అనే పదాన్ని తొలగించాడు. దీంతో అతడు ‘రిటైర్మెంట్ (Retirement)’ తీసుకుంటాడా? అనే సందేహాలు మొదలయ్యాయి.

అంతకుముందు భువీ ఇన్‌స్టా ఖాతా బయోలో ‘ఇండియన్‌ క్రికెటర్‌’ అని రాసి ఉండగా.. ఇప్పుడు కేవలం ‘ఇండియన్‌’ అని మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ట్విటర్‌లో మాత్రం క్రికెటర్‌ అనే పదం ఉంది. భువీ ఇన్‌స్టా బయోలో మార్పును గుర్తించిన కొందరు నెటిజన్లు ఆ స్క్రీన్‌షాట్లను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ అతడి రిటైర్మెంట్‌పై కామెంట్లు చేస్తున్నారు.

ఆటకు వీడ్కోలు పలకడానికి ముందు భువీ ఇలా హింట్‌ ఇచ్చాడంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అతడి కంటే గొప్ప ఇన్‌స్వింగర్‌ మరొకరు టీమ్‌ఇండియాలో లేరని, భువీ (Bhuvneshwar Kumar) అప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించొద్దని అభిమానులు కోరుతున్నారు.

నేను జట్టులోకి తిరిగి రావాలంటే ఆ కండీషన్‌ పెట్టా: హార్దిక్‌ పాండ్య

భువి పేరు వినగానే అతడి స్వింగ్‌ బౌలింగే గుర్తొస్తుంది. 2012లో పాక్‌తో సిరీస్‌లో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ ‘కింగ్ ఆఫ్ స్వింగ్’.. అరంగేట్ర మ్యాచ్‌ల్లో మొదటి బంతికే వికెట్ తీసిన ఏకైక బౌలర్‌గా అరుదైన గుర్తింపు సాధించాడు. లార్డ్స్‌లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌ (2014)లో 82 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో మెరిశాడు. మొత్తంగా 21 టెస్టుల్లో 63... 121 వన్డేల్లో 141... 87 టీ20 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు. 29 ఇన్నింగ్స్‌లో 552 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలున్నాయి. వ్యక్తిగతంగా అతడి ఉత్తమ స్కోరు 63 (నాటౌట్‌).

అయితే గత కొంతకాలంగా భువీ కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న వెస్టిండీస్‌ పర్యటనకు భువీని ఎంపిక చేయకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని