Hardik Pandya: నేను జట్టులోకి తిరిగి రావాలంటే ఆ కండీషన్‌ పెట్టా: హార్దిక్‌ పాండ్య

గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా టీ20ల్లోనే మెరుస్తున్న హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) వన్డేల్లోనూ పెద్దగా ఆడటం లేదు. గాయం కారణంగా బౌలింగ్‌లో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు.

Updated : 28 Jul 2023 14:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత భారత క్రికెట్‌లో పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్‌ పాండ్య గాయాల బెడదతో అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడలేకపోతున్నాడు. ఒక వేళ ఆడినా ఏదొక విభాగానికే పరిమితమవుతూ వస్తున్నాడు. గత ఐపీఎల్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను వేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అయితే, బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు వరల్డ్‌ కప్‌ సన్నాహాల్లో ఉన్న టీమ్ఇండియాకు హార్దిక్‌ తిరిగి రావడం ఎంతో ఉపశమనం కలిగించనుంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో హార్దిక్‌ ఆడాడు. మూడు ఓవర్లు వేసిన హార్దిక్‌ 17 పరుగులు ఇచ్చి కీలకమైన కేల్ మేయర్స్‌ను ఔట్ చేశాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా హార్దిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఆ రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి..: రోహిత్ శర్మ

‘‘గాయం తిరగబెట్టడంతో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుని ఇంటికే పరిమితమయ్యా. అయినా, వ్యాయామాలు చేస్తూనే సన్నద్ధమవుదామని ప్రయత్నించా. ఈ సందర్భంగా భారత జట్టులోని సహచరులకు ఒకటే చెప్పా. నేను తిరిగి జట్టులోకి వచ్చానంటే ఆల్‌రౌండర్‌ బాధ్యతలను నిర్వర్తిస్తా. లేకపోతే జట్టు తరఫున ఆడనని చెప్పేశా. అది నాకు ఛాలెంజింగ్‌ టైమ్. అలాంటి పరిస్థితుల్లో ఆడకుండా ఉంటేనే హ్యాపీ. అనవసరంగా జట్టులోకి వచ్చి మరొక ఆటగాడి స్థానాన్ని ఆక్రమించినట్లు అవుతుంది’’ అని పాండ్య వ్యాఖ్యానించాడు.

వెంటాడిన దురదృష్టం..

విండీస్‌తో తొలి వన్డేలో బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన హార్దిక్‌ (5) బ్యాటింగ్‌లో ఏడు బంతులను ఎదుర్కొన్నాడు. దురదృష్టవశాత్తూ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ కొట్టిన బంతి బౌలర్‌ చేతిని తాకుతూ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లోని వికెట్లను తాకింది. దీంతో హార్దిక్‌ పాండ్య రనౌట్‌ అవ్వక తప్పలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని