IPL 2021: చెన్నైపై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం..

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 137 పరుగుల  లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో ఛేదించింది. 

Updated : 07 Dec 2021 14:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దిల్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్ (39: 35 బంతుల్లో 3x4, 2x6) రాణించాడు. పృథ్వీ షా (18), రిషభ్‌ పంత్ (15), రిపాల్ పటేల్ (18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (2), అక్షర్‌ పటేల్‌ (5) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (28), రబాడ (4) పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు, శార్దూల్‌ ఠాకూర్ రెండు, దీపక్‌ చాహర్, జోష్‌ హేజిల్ వుడ్, డ్వేన్‌ బ్రావో తలో వికెట్ తీశారు. 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (55: 43 బంతుల్లో 5x4, 2x6) అర్ధ శతకంతో రాణించాడు. చివరి ఓవర్లలో రాయుడు వేగం పెంచడంతో దిల్లీ ముందు చెన్నై మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. రాబిన్‌ ఉతప్ప (19), కెప్టెన్‌ ధోని (18) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13), డు ప్లెసిస్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. మొయిన్‌ అలీ (5) విఫలమయ్యాడు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు, రవిచంద్రన్‌ అశ్విన్, అన్రిచ్‌ నోర్జే, అవేశ్‌ ఖాన్‌ తలో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని