క్రికెట్‌కు మోర్గాన్‌ వీడ్కోలు!

ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ కానున్నాడు. మోర్గాన్‌ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకనున్నాడు. ఈ మేరకు అతను మంగళవారం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. అతడు ఏడున్నరేళ్ల పాటు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

Published : 28 Jun 2022 01:29 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ కానున్నాడు. మోర్గాన్‌ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకనున్నాడు. ఈ మేరకు అతను మంగళవారం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. అతడు ఏడున్నరేళ్ల పాటు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో కూడా జట్టును నడిపించాలని మోర్గాన్‌ భావించాడు. కానీ పేలవ ఫామ్‌, ఫిట్‌నెస్‌తో సతమతమవుతున్న నేపథ్యంలో రిటైర్‌కావాలని నిర్ణయించుకున్నాడు. గత 28 ఇన్నింగ్స్‌ల్లో అతడు రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. మోర్గాన్‌ 2015లో కుక్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో ఇంగ్లాండ్‌ బలమైన వన్డే, టీ20 జట్టుగా ఎదిగింది. 2019లో వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. 35 ఏళ్ల మోర్గాన్‌ 126 వన్డేల్లో, 72 టీ20ల్లో ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడు 248 వన్డేల్లో 39.29 సగటుతో 7701 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 28.58 సగటుతో 2458 పరుగులు సాధించాడు. మోర్గాన్‌ 16 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారి 2012లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. మోర్గాన్‌ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ బట్లర్‌ ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడయ్యే అవకాశముంది. మోర్గాన్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును కూడా నడిపించాడు. కానీ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతుండడంతో గత సీజన్‌ తర్వాత కేకేఆర్‌ అతణ్ని వదులుకుంది. ఈ సీజన్‌కు ముందు వేలంలో అతణ్ని ఎవరూ కొనలేదు. అతడి ఐపీఎల్‌ కెరీర్‌ కూడా దాదాపు ముగిసినట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని