సంక్షిప్త వార్తలు

భారత స్టార్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ ఎఫ్‌ఐహెచ్‌ ‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో సవితా పునియా ‘గోల్‌ కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచింది. ఉత్తమ గోల్‌కీపర్లుగా నిలవడం వీరికిది వరుసగా రెండో ఏడాది. నిపుణులు, జట్లు, అభిమానులు, మీడియా పాల్గొన్న ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా వీళ్లను అవార్డులకు ఎంపిక చేశారు.

Published : 07 Oct 2022 03:02 IST

ఉత్తమ గోల్‌కీపర్లు శ్రీజేశ్‌, సవిత

దిల్లీ: భారత స్టార్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ ఎఫ్‌ఐహెచ్‌ ‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో సవితా పునియా ‘గోల్‌ కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచింది. ఉత్తమ గోల్‌కీపర్లుగా నిలవడం వీరికిది వరుసగా రెండో ఏడాది. నిపుణులు, జట్లు, అభిమానులు, మీడియా పాల్గొన్న ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా వీళ్లను అవార్డులకు ఎంపిక చేశారు. శ్రీజేశ్‌ 39.3 పాయింట్లతో అగ్రస్థానంలో సాధించగా.. సవిత 37.6 పాయింట్లతో ముందు నిలిచింది.
భారత కోచ్‌లకూ అవార్డులు: భారత పురుషులు, మహిళల జట్ల కోచ్‌లు గ్రాహం రీడ్‌, జెనెకె చాప్‌మాన్‌లనూ అవార్డులు వరించాయి. తమ తమ విభాగాల్లో రీడ్‌, చాప్‌మాన్‌ ‘కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచారు. ఓటింగ్‌లో వారికి ఎక్కువ ఓట్లు లభించాయి.

 


భారత జట్ల నిష్క్రమణ
ప్రపంచ టీమ్‌ టేబుల్‌ టెన్నిస్‌

చెంగ్‌డు: ప్రపంచ టీమ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి భారత జట్లు నిష్క్రమించాయి. భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో భారత్‌ 0-3తో చైనా చేతిలో పరాజయం చవిచూసింది. హర్మీత్‌ దేశాయ్‌ 2-11, 9-11, 5-11తో ఫాన్‌ జెన్‌డాంగ్‌ చేతిలో, సత్యన్‌ 12-14, 5-11, 0-11తో మా లాంగ్‌ చేతిలో, మానుష్‌ షా 4-11, 5-11, 6-11తో వాంగ్‌ చుకిన్‌ చేతిలో ఓడారు. బుధవారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్‌లో భారత్‌ 0-3తో చైనా చేతిలో ఓటమి పాలయింది. మనిక బాత్రా 7-11, 9-11, 3-11తో చెన్‌ యు చేతిలో, ఆకుల శ్రీజ 8-11, 11-5, 6-11, 9-11తో చింగ్‌ చింగ్‌ చేతిలో, దియా చితాలె 6-11, 11-9, 11-9, 8-11, 7-11తో ల్యూ యిన్‌ చేతిలో పరాజయం చవిచూశారు.


విండీస్‌పై ఆసీస్‌ విజయం

గోల్డ్‌కోస్ట్‌: వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో మొదలెట్టింది. హోరాహోరీగా సాగిన తొలి టీ20లో కంగారూ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఆ జట్టులో మేయర్స్‌ (39), ఒడియన్‌ స్మిత్‌ (27) రాణించారు. ఆసీస్‌ బౌలర్లు హేజిల్‌వుడ్‌ (3/35), కమిన్స్‌ (2/22), స్టార్క్‌ (2/40) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌  ద మ్యాచ్‌’ కెప్టెన్‌ ఫించ్‌ (58; 53 బంతుల్లో 6×4) అర్ధశతకం చేశాడు. ఓ దశలో    58/5తో కష్టాల్లో పడ్డ ఆ జట్టును వేడ్‌ (39 నాటౌట్‌)తో కలిపి ఫించ్‌ ఆదుకున్నాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును లక్ష్యం దిశగా నడిపించింది. స్వల్ప వ్యవధిలో ఫించ్‌, కమిన్స్‌ (4) వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ విజయం కోసం ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ ఓవర్లో వేడ్‌, స్టార్క్‌ ఆసీస్‌ను గెలిపించారు.


2026 సీడబ్ల్యూజీలో షూటింగ్‌ ఉంది కానీ..

మెల్‌బోర్న్‌: విక్టోరియా (ఆస్ట్రేలియా)లో 2026లో జరిగే క్రీడలతో కామన్వెల్త్‌ క్రీడల్లో షూటింగ్‌ పునరాగమనం చేయనుంది. షూటింగ్‌లో బలంగా ఉన్న భారత్‌కు ఇది శుభవార్తే. కానీ భారత్‌కు కలిసొచ్చిన రెజ్లింగ్‌ను వచ్చే సీడబ్ల్యూజీ గేమ్స్‌ నుంచి తప్పించారు. ఆర్చరీ కూడా చోటు కోల్పోయింది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో షూటింగ్‌ లేని సంగతి తెలిసిందే. కామన్వెల్త్‌ క్రీడల షూటింగ్‌లో భారత్‌ ఇప్పటివరకు 63 స్వర్ణాలు సహా 135 పతకాలు గెలుచుకోవడం విశేషం. రెజ్లింగ్‌లో 49 స్వర్ణాలు సహా 114 పతకాలు సాధించింది. ఈ నేపథ్యంలో క్రీడల నుంచి రెజ్లింగ్‌ను తొలగించడం భారత్‌కు నష్టమే. అయితే రెజ్లింగ్‌ చోటు కోల్పోవడం మరీ ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. ఆతిథ్య దేశం ఆస్ట్రేలియాలో రెజ్లింగ్‌ పెద్దగా ప్రజాదరణ లేని క్రీడ. ఆతిథ్య దేశాలు సాధారణంగా తమ అథ్లెట్లు బాగా రాణిస్తారనుకున్న క్రీడలను ఎంచుకుంటాయి.  వచ్చే సీడబ్ల్యూజీ క్రీడలు 2026 మార్చి 17 నుంచి 29 వరకు జరుగుతాయి.  

 


హైదరాబాద్‌ కెప్టెన్‌గా తన్మయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టుకు తన్మయ్‌ అగర్వాల్‌ సారథ్యం వహిస్తాడు. ఈ నెల 11న ఆరంభమయ్యే ఈ టోర్నీలో పోటీపడే 20 మంది సభ్యుల హైదరాబాద్‌ జట్టును గురువారం హెచ్‌సీఏ ప్రకటించింది. టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కూ జట్టులో చోటు కల్పించారు.
జట్టు: తన్మయ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), రవితేజ, రాహుల్‌ బుద్ధి, ప్రతీక్‌, సీవీ మిలింద్‌, మిఖిల్‌ జైస్వాల్‌, తనయ్‌ త్యాగరాజన్‌, సాయి ప్రజ్ఞయ్‌, రక్షణ్‌, సిరాజ్‌, చరణ్‌, భగత్‌, అలంకృత్‌, జయరామ్‌, పున్నయ్య, త్రిశాంక్‌, సంకేత్‌, శ్రేయస్‌, నితేష్‌; కోచ్‌: మిలాప్‌.


అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌కు భారత జట్టిదే

భువనేశ్వర్‌: స్వదేశంలో జరిగే అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టును ప్రకటించారు. ప్రధాన కోచ్‌ థామస్‌ డెనెర్బీ 21 మంది సభ్యుల బృందాన్ని వెల్లడించాడు. ఆతిథ్య భారత్‌.. అమెరికా, మొరాకో, బ్రెజిల్‌లతో కలిసి గ్రూప్‌-ఎ లో ఉంది.  భారత్‌ తన తొలి మ్యాచ్‌లో అక్టోబరు 11న అమెరికాతో, 14న మొరాకోతో, 17న బ్రెజిల్‌తో తలపడుతుంది. తాము ఫేవరెట్లుగా టోర్నీలో అడుగుపెట్టట్లేదని, ప్రత్యర్థులపైనే ఒత్తిడి ఉంటుందని డెనెర్బీ చెప్పాడు. ప్రపంచకప్‌ ఈనెల 11 నుంచి 30 వరకు జరుగుతుంది.
భారత జట్టు: మోనాలిషా దేవి, మెలొడీ చాను కీషమ్‌, అంజలి ముండా, అస్తమ్‌ ఒరాన్‌, కాజల్‌, నకేత, పూర్ణిమ, వంశిక, శిల్కీ దేవి, బబినా దేవి, నీతూ లిండా, శైలజ, శుభాంగి సింగ్‌, అనిత, లిండా కోమ్‌ సెట్రో, నేహా, రజియా ఏవి, షీలా దేవి, కాజోల్‌ డిసౌజా, లావణ్య ఉపాధ్యాయ్‌, సుధా అంకిత టిర్కీ.


నేపాల్‌ క్రికెటర్‌ లమిచానె అరెస్ట్‌

కాఠ్‌మాండూ: మైనర్‌ బాలికను రేప్‌ చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లమిచానె గురువారం అరెస్టయ్యాడు. త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో 22 ఏళ్ల లమిచానెపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. ఆ సమయంలో అతడు కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. కాఠ్‌మాండూలోని ఓ హోటల్లో లమిచానె తనపై అత్యాచారం చేశాడని ఓ 17 ఏళ్ల బాలిక ఆరోపించింది.


నంబర్‌వన్‌గా బ్రెజిల్‌

జురిచ్‌: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో బ్రెజిల్‌ నంబర్‌వన్‌ జట్టుగా బరిలో దిగనుంది. గురువారం ఫిఫా విడుదల చేసిన జాబితాలో బ్రెజిల్‌ అగ్రస్థానం సాధించింది. బెల్జియం రెండో ర్యాంకులో నిలిచింది. సెప్టెంబరులో ఘనా, ట్యునీసియాలతో జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో బ్రెజిల్‌ విజయాలు నమోదు చేసింది. అర్జెంటీనా 3, ఫ్రాన్స్‌ 4, ఇంగ్లాండ్‌ 5, ఇటలీ 6, స్పెయిన్‌ 7, నెదర్లాండ్స్‌ 8, పోర్చుగల్‌ 9, డెన్మార్క్‌ 10వ ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నవంబరు 20న ఖతార్‌లో ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది.
 


ఐపీఎల్‌తో సమాచార సేకరణ సులువు: రబాడ

లఖ్‌నవూ: భారత క్రికెటర్ల ఆటతీరు విశ్లేషణకు ఐపీఎల్‌ దోహద పడుతుందని దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ అన్నాడు. ఐపీఎల్‌లో ఆడటం వల్ల భారత ఆటగాళ్ల సమాచారాన్ని సులువుగా సేకరించొచ్చని తెలిపాడు. ‘‘టీమ్‌ఇండియాతో సిరీస్‌కు వెళ్లేముందు అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. అదృష్టవశాత్తు ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లతో కలిసి ఆడటంతో పాటు వాళ్లకు వ్యతిరేకంగా కూడా తలపడతాం. కాబట్టి ఆటగాళ్ల సమాచారాన్ని సులువుగా సేకరించి పంపొచ్చు. ఇప్పటికే ఆటగాళ్ల విశ్లేషణ జరిగింది. ఇంకా చేయాల్సి ఉంది’’ అని రబాడ చెప్పాడు.


టీ20 ప్రపంచకప్‌ నుంచి ప్రిటోరియస్‌ ఔట్‌

లఖ్‌నవూ: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ ప్రిటోరియస్‌ గాయం కారణంగా ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. భారత్‌తో మూడో టీ20 సందర్భంగా ప్రిటోరియస్‌ ఎడమ బొటన వేలికి గాయమైంది. అతడి వేలికి శస్త్రచికిత్స అవసరమని దక్షిణాఫ్రికా బోర్డు తెలిపింది. టీ20 ప్రపంచకప్‌కు రిజర్వ్‌ జాబితాలో ఉన్న మార్కో జాన్సన్‌ను దక్షిణాఫ్రికా వన్డే జట్టులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని