Jonty Rhodes: అభిమానితో నెట్టింట వార్.. క్షమించమంటూనే క్లారిటీ ఇచ్చేసిన జాంటీ రోడ్స్‌

సోషల్ మీడియా వేదికగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే?

Published : 10 Apr 2024 17:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లఖ్‌నవూ ఫీల్డింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో రోడ్స్‌ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని ఓ క్రికెట్‌ అభిమాని ఆరోపణలు గుప్పించడం సంచనలంగా మారింది. చివరికి తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. అలా అనిపిస్తే క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధమేనని రోడ్స్‌ వెల్లడించాడు. ఈ వివాదంపై వివరణ ఇస్తూ పోస్టు పెట్టాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే? 

‘‘డే 10. లఖ్‌నవూ మేనేజ్‌మెంట్ స్పందించేవరకూ ట్వీట్లు చేస్తూనే ఉంటా’’ అని సదరు అభిమాని తొలుత పోస్టు పెట్టాడు.

‘‘బ్రదర్, జీవితం ఎంతో ఉంది. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. అందుకు అభినందనలు. అయితే.. ’’ అంటూ రోడ్స్‌ సమాధానం ఇచ్చాడు. 

రోడ్స్ పోస్టుకు సదరు అభిమాని స్పందిస్తూ.. ‘‘అతడు (రోడ్స్) మామూలుగా సమాధానం ఇచ్చి ఉండొచ్చు. ఒక అభిమానిగా ట్వీట్ చేశా. నేను ఎక్కడా దుర్భాషలాడలేదు. ద్వేషం వ్యాప్తి చేసేలా కామెంట్ చేయలేదు. నా జట్టు నుంచి సమాధానం రావాలని ఆశిస్తూ ట్వీట్ చేయలేకపోతే ఇంకెందుకు? వారిని ఆనందంగా ఉంచడానికి మేం ప్రయత్నిస్తే పనీపాటా (జాబ్‌లెస్) లేనివాళ్లుగా మమ్మల్ని కోచ్‌ పరిగణించడం సరైంది కాదు. ఇప్పటివరకు ఉన్న గౌరవమంతా పోయింది. ఇకపై లఖ్‌నవూకు మద్దతుగా ఉండను’’ అంటూ పోస్టు పెట్టడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు జాంటీ రోడ్స్‌కు అనుకూలంగా పోస్టులు పెడుతుంటే.. మరికొందరు మాజీ క్రికెటర్‌ తీరును తప్పుబట్టారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రోడ్స్‌ వివరణ ఇస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. 

అలా అనలేదు: రోడ్స్‌

‘‘నిన్ను ఎప్పుడు ‘జాబ్‌లెస్’ అని అన్నానో దయచేసి చెప్పు. నీవు నిజాయతీగా స్పందించకూడదనుకుంటే మాత్రం నీ కౌంట్‌డౌన్‌లో నన్ను ట్యాగ్‌ చేయకుండా ఉండాల్సింది. ఇటీవల నేను లఖ్‌నవూలో యాసిడ్‌ బాధితులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ బాధిత యువతులు దాదాపు ఏడేళ్ల నుంచి న్యాయం కోసం పోరాడి నేరస్థులపై విజయం సాధించారు. వారికి, నాకు చాలా సమయం ఉంది. వారేమీ మనల్ని పెద్దవేం అడగలేదు. తోటి మనుషులుగా చూడమని మాత్రమే కోరుతున్నారు. ఇప్పటికే సమాజం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు 1500 మంది ఉన్నారు. ఇంకా కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇలాంటి వారి గురించి ఆలోచించాలి. నీ (సదరు అభిమాని) ట్వీట్‌ కౌంట్‌డౌన్‌ను సమస్యగా మార్చడం కాదు. ఏదిఏమైనప్పటికీ నువ్వు బాధపడితే నన్ను క్షమించు’’ అని జాంటీ రోడ్స్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని