Ashutosh Sharma: ఆ ప్రముఖ కోచ్‌ వల్ల కెరీర్‌లో కుంగుబాటుకు గురయ్యా: అషుతోష్ సంచలన వ్యాఖ్యలు

ఏ క్రికెటర్‌ కెరీర్‌లోనైనా కోచ్‌ పాత్ర అత్యంత కీలకం. టాలెంట్ ఉండి.. అద్భుతమైన ప్రదర్శన చేసినా అవకాశాలు కల్పించకపోతే మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. అలాంటి పరిస్థితే పంజాబ్‌ యువ క్రికెటర్‌కు ఎదురైంది.

Published : 06 Apr 2024 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గుజరాత్‌పై భారీ లక్ష్య ఛేదనలో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన పంజాబ్ యువ క్రికెటర్ అషుతోష్ సంచలన విషయం వెలుగులోకి తెచ్చాడు.  2020-22 సీజన్‌లో ఓ కోచ్‌ వల్ల కెరీర్‌లో తీవ్ర కుంగుబాటుకు గురయ్యానని.. అందుకే మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఇష్టపడలేదని వ్యాఖ్యానించాడు. అదే తన జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా పేర్కొన్నాడు. గుజరాత్‌పై కేవలం 17 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అషుతోష్ పంజాబ్‌ను గెలిపించాడు. దీంతో అతడి పేరు అభిమానుల్లో మారుమోగుతోంది. 

‘‘2020 సీజన్‌లో మంచి ప్రదర్శనే చేశా. కానీ, మధ్యప్రదేశ్‌కు అప్పుడే కొత్త కోచ్‌ వచ్చారు. జట్టు సభ్యుల్లోని కొందరిపై అతడికి బలమైన నమ్మకం ఉంది. మరికొందరు పెద్దగా నచ్చలేదు. నేను సన్నాహక మ్యాచ్‌లో 45 బంతుల్లోనే 90 పరుగులు చేశా. ఆ తర్వాత జిమ్‌కు వెళ్లి హోటల్‌ రూమ్‌కు వచ్చా. కానీ, జట్టులో నుంచి నన్ను తప్పించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యా. నేను చేసిన తప్పేంటో కూడా ఎవరూ చెప్పలేదు. అంతకుముందు సీజన్‌లో ముస్తాక్ అలీ ట్రోఫీలో నేను ఆరు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేశా. తర్వాత నన్ను కనీసం మైదానంలోకి కూడా అనుమతించలేదు. ఆ నిర్ణయంతో కుంగిపోయా’’ అని వ్యాఖ్యానించాడు. అషుతోష్ ఉటంకించిన కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌గా క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత క్రికెట్‌లో పండిత్‌కు అద్భుతమైన కోచ్‌గా పేరుంది. అయితే, గతంలో నమీబియా ఆటగాడు డేవిడ్ వీజ్‌, మధ్యప్రదేశ్ మాజీ పేసర్ గౌరవ్‌యాదవ్‌ కూడా పండిత్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. 

అమయ్‌ సర్‌ వల్లే మళ్లీ క్రికెట్‌లోకి..

‘‘నేను 12 ఏళ్ల నుంచి ఎంపీసీఏ అకాడమీలో శిక్షణ పొందా. కోచ్‌ అమయ్‌ ఖురాసియా నా నైపుణ్యాలు మెరుగయ్యేందుకు చాలా కృషి చేశారు. మానసికంగా ఇబ్బంది పడినప్పుడు ఆయన సలహాలు తీసుకొనేవాడిని. ప్రతీ మ్యాచ్‌కు ముందు అమయ్‌ సర్‌తో మాట్లాడతా. గుజరాత్‌ మ్యాచ్‌కు ముందూ సంభాషించా. శిఖర్ ధావన్‌ నుంచి టిప్స్‌ అడిగి తెలుసుకున్నా. సంజయ్‌ బంగర్ షాట్ల ఎంపికలో సాయంగా నిలిచారు’’ అని అషుతోష్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని