IPL 2024: ఈసారి ఐపీఎల్‌లో ఆడకపోవడానికి చాలా కారణాలున్నాయ్‌: ఆసీస్ స్టార్ స్పిన్నర్

ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్ ఆడమ్‌ జంపా ప్రదర్శనను ఈసారి ఐపీఎల్‌లో చూసే అవకాశం లేకుండా పోయింది. వ్యక్తిగత కారణాలతో మెగా లీగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Updated : 11 Apr 2024 16:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2024 సీజన్‌ నుంచి వైదొలగడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా (Adam Zampa) వ్యాఖ్యానించాడు. గత ఎడిషన్‌లో రాజస్థాన్‌ జట్టుకు జంపా ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి మాత్రం వ్యక్తిగత కారణాలతో ఆడటం లేదని సీజన్‌కు ముందే ప్రకటించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత బిగ్‌బాష్ లీగ్‌ ఆడాడు. వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ జట్లతో పరిమిత ఓవర్ల సిరీసుల్లోనూ పాల్గొన్నాడు. అయితే, మళ్లీ గాయాలు ఇబ్బందిపెట్టడంతో టీ20 ప్రపంచకప్‌ ముంగిట రిస్క్‌ తీసుకోకూడదని జంపా భావించాడు. కుటుంబంతో గడపాలని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఐపీఎల్‌లో నేను ఈసారి ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి 2023 ఏడాది వల్లే. అది వన్డే ప్రపంచకప్‌ సంవత్సరం. గత సీజన్‌లో ఐపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడా. భారత్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌లో పాల్గొన్నా. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లో ఆడదామనే ఉద్దేశం మొదట్లో ఉంది. కానీ, గతేడాది ఇంటికి దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురయ్యా. దీంతో ఈసారి, రాజస్థాన్‌ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలననే నమ్మకం నాలో లేదు. మరోవైపు ఈ ఏడాదే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అదెంతో ముఖ్యమైన టోర్నీ. కాబట్టి, ఫిట్‌నెస్‌పరంగా నేను మరింత మెరుగవ్వాల్సిఉంది. మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే. అంతేకాక నాకు చిన్న ఫ్యామిలీ ఉంది.  

ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో భారత్‌లోనే 9 వారాలపాటు ఉండటం చాలా కష్టం. అక్కడా తుది జట్టులో అవకాశం కోసం పోరాడాల్సిఉంది. ఇప్పటికే స్టార్‌ స్పిన్నర్లు అశ్విన్‌, చాహల్‌ రాజస్థాన్‌కు ఉన్నారు. ఆ తర్వాత పొట్టి కప్‌ కోసం మళ్లీ యూఎస్‌ - విండీస్‌ వెళ్లాల్సిఉంటుంది. ఐపీఎల్‌లో ఆడే 14 మ్యాచులతో మరింత సాధన చేసినట్లు అవుతుందని తెలుసు. కానీ, సుదీర్ఘమైన పర్యటనల వల్ల కుటుంబంతో గడపడానికి కూడా సమయం ఉండదు. అందుకే, వరల్డ్‌ కప్‌ ముంగిట విశ్రాంతి తీసుకోవాలని భావించా. గాయం నుంచి కోలుకోవడంతోపాటు ఫిట్‌నెస్‌పైనా దృష్టి సారించా’’ అని ఆడమ్‌ జంపా తెలిపాడు. జంపా ఇప్పటివరకు ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 29 వికెట్లు తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని