Rishabh Pant: సోనెట్‌ క్రికెట్‌ క్లబ్‌.. ఆ నిర్ణయం తీవ్రంగా బాధించింది: రిషభ్ పంత్‌

తమను ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దిన క్లబ్‌కు కష్టం రావడంతో టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) స్పందించాడు. తన ఆవేదనను తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టాడు.

Published : 01 May 2023 14:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దిల్లీలోని వెంకటేశ్వర కళాశాలలో ఉంటున్న సోనెట్ క్లబ్‌ను తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై  టీమ్‌ఇండియా క్రికెటర్ రిషభ్‌ పంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. టాప్ క్రికెటర్లను అందించిన క్లబ్‌పై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నాడు. తాను కూడా ఇదే క్లబ్‌ నుంచి క్రికెటర్‌గా వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడిన రిషభ్‌ పంత్‌ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌కూ దూరమయ్యాడు. సోనెట్‌ క్లబ్‌కు సంబంధించిన అంశంపై ఓ పత్రికా విలేకరి చేసిన ట్వీట్‌పై పంత్ స్పందించాడు. 

ద్రోణాచార్య అవార్డు గ్రహీత, కోచ్‌ తారక్ సిన్హా మార్గదర్శకంలో క్రికెటర్లు తయారుకాగా.. రిషభ్ పంత్‌ కూడా అతడి వద్దే క్రికెట్‌ పాఠాలను నేర్చుకున్నాడు. ‘‘ఎంతోమంది అంతర్జాతీయ క్రికెటర్లను అందించిన నా క్లబ్‌ పరిస్థితిని చూస్తే బాధేస్తోంది. సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న క్లబ్‌ను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరైందికాదు. నా క్రికెట్‌ కెరీర్‌ను పదును పెట్టడంలో క్లబ్ కీలక పాత్ర పోషించింది. నాతో సహా చాలా మంది ఆటగాళ్లు దాన్ని సొంత ఇల్లులా భావిస్తున్నాం. వెంకటేశ్వర కళాశాల నిర్దేశించిన నియమాలను పాటిస్తున్నాం. దయచేసి వెంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ ఆ డెసిషన్‌ను వెనక్కి తీసుకోవాలి. సోనెట్‌ క్లబ్‌ను కేవలం ఒక క్లబ్‌లా కాకుండా ఒక ప్రతిష్ఠాత్మక సంస్థగా పరిగణించాలి. మరింత మంది క్రికెటర్లకు అది హోమ్‌గా మారుతుంది ’’ అని రిషభ్ పంత్ ట్వీట్ చేశాడు. 

వీరంతా అక్కడి నుంచే..

సీకే నాయుడు ట్రోఫీకి దిల్లీ జూనియర్ జట్టు తరఫున సెలెక్ట్‌ కాకపోవడంతో తారక్‌ సిన్హా 1969లో సోనెట్ క్లబ్‌ను ప్రారంభించారు. అప్పుడు ఆయన వయసు 19 ఏళ్లు కావడం గమనార్హం. శ్రీ వెంకటేశ్వర కళాశాల వేదికగా క్లబ్‌ను ఏర్పాటు చేసిన తారక్‌ యువ క్రికెటర్లకు తర్ఫీదు ఇచ్చారు. మాజీ ఆటగాళ్లు మనోజ్‌ ప్రభాకర్, ఆశిశ్‌ నెహ్రా, ఆకాశ్‌ చోప్రాతోపాటు ప్రస్తుత తరంలో పంత్‌, ఆయుష్ బదోని, హృతీక్‌ షోకీన్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్‌ శిక్షణ పొందారు. టీమ్‌ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్‌ చోప్రా కూడా ఆయన శిష్యురాలే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు