Sunil Gavaskar: టీమ్‌ఇండియా ముందున్న ఏకైక సమస్య అదే..

భారత సారథి రోహిత్‌ శర్మ ఫామ్‌ కలవరానికి గురిచేస్తోందని, ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య ఇదేనని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 26 Oct 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌, హార్దిక్‌ పాండ్య సమయోచిత ఇన్నింగ్స్‌తో పాక్‌పై భారత జట్టు విజయం సాధించి ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. అయితే, కొద్దిరోజులుగా విఫలమవుతూ వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లోనూ రాణించలేదు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 4 రన్స్‌ మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ రాహుల్‌ సైతం నాలుగు పరుగులే చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో విజయంతో ఈ విషయంపై ఎవరూ మాట్లాడలేదు. కాగా ఈ అంశంపై భారత మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ విశ్లేషకుడు సునీల్‌ గావస్కర్‌ తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం టీమ్ఇండియాను ఆందోళనకు గురిచేస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

‘ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్‌ శర్మ ఫామ్‌. కొద్దిరోజులుగా అతడి స్థాయికి తగినట్లు ఆడటంలేదు. అతడు ఆడితే ఇతరులకు బ్యాటింగ్ చేయడం ఎంతో సులువవుతుంది. మంచి ఓపెనింగ్‌ ఇస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండదు. వచ్చీ రాగాగే మొదటి బంతి నుంచే హిట్టింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మంచి స్కోర్‌ సాధించవచ్చు’ అని అన్నాడు. తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో మొదటి 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఉంటడమే కీలకం అని వ్యాఖ్యానించాడు. నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసినా.. వికెట్‌ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గావస్కర్‌ సూచించాడు. కాగా భారత్‌ గురువారం తన తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని