Updated : 19 Dec 2021 08:52 IST

Kidambi Srikanth:శ్రీకాంత్‌ నవశకం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ప్రవేశం
సెమీస్‌లో లక్ష్యపై విజయం


ఎవరు గెలిచినా ఆనందమే.. ఎవరు ఓడినా బాధే.. ఎందుకంటే ఆడుతున్నది ఇద్దరూ భారత క్రీడాకారులే. ఫలితం ఏదైనప్పటికీ.. ఆ ఇద్దరూ చరిత్రాత్మక విజయం కోసం తలపడిన తీరు అద్భుతం. ఎవరికి ఎవరూ తీసిపోరన్నట్లు పాయింట్‌ పాయింట్‌కూ పోరాడిన వైనం అమోఘం. నువ్వా నేనా అన్నట్లు సాగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో  చివరికి తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌ విజయం సాధించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌ చేరిన తొలి పురుష భారత షట్లర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న లక్ష్యసేన్‌.. కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. శ్రీకాంత్‌ ఇంకొక్క అడుగు వేస్తే భారత బ్యాడ్మింటన్‌లో కొత్త అధ్యాయం మొదలైనట్లే.

 వెల్వా (స్పెయిన్‌)


శ్రీకాంత్‌ అదరహో. యువ ఆటగాడు లక్ష్యసేన్‌కు నిరాశ. అనుభవాన్నంతా ఉపయోగిస్తూ సత్తా చాటిన కిదాంబి శ్రీకాంత్‌ కెరీర్‌లో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో అతడు 17-21, 21-14, 21-17తో లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. ఆరంభంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన లక్ష్య.. ఆ తర్వాత వెనుకబడ్డాడు. అలసిపోయినట్లు కనిపించాడు. తొలి గేమ్‌ను కోల్పోయినా.. అద్భుతంగా పుంజుకున్న శ్రీకాంత్‌ మ్యాచ్‌లో పైచేయి సాధించాడు. ఫైనల్‌ ఆదివారం జరుగుతుంది.

నువ్వా.. నేనా: ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య సెమీఫైనల్‌ ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్‌లో ర్యాలీలు ఎక్కువగాసేపు సాగకున్నా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. మొదట 4-4 వద్ద స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత శ్రీకాంత్‌ ఆధిక్యంలోకి వెళ్లినా.. లక్ష్య పుంజుకున్నాడు. ఓ చక్కని క్రాస్‌కోర్ట్‌ విన్నర్‌, ఓ స్ట్రెయిట్‌ స్మాష్‌తో అలరించాడు. 7-7 వద్ద స్కోర్లు సమమయ్యాయి. విరామానికి లక్ష్య 11-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత పుంజుకున్న శ్రీకాంత్‌ 17-16తో ఆధిక్యం సంపాదించాడు. కానీ లక్ష్య వరుసగా అయిదు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. రెండో గేమ్‌లోనూ జోరు కొనసాగించిన అతడు ఓ దశలో 8-4తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత స్కోరు 9-6. కానీ లక్ష్య అలసిపోయినట్లు కనిపించాడు. బలంగా పుంజుకుంటూ వరుసగా అయిదు పాయింట్లు సంపాదించిన శ్రీకాంత్‌.. విరామానికి 11-9తో ఆధిక్యంలో నిలిచాడు. ఆధిపత్యాన్ని కొనసాగించిన శ్రీకాంత్‌ మూలలకు ఆడుతూ లక్ష్య మరింత అలసిపోయేలా చేశాడు. బలమైన స్మాష్‌లూ కొట్టాడు. 18-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన శ్రీకాంత్‌.. ప్రత్యర్థికి మరో పాయింట్‌ ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ హోరాహోరీగా సాగింది. 7-7 వద్ద స్కోరు సమమైంది. అయితే విరామానికి లక్ష్య 11-8తో ఆధిక్యంలో నిలిచాడు. 43 షాట్ల పాటు సాగిన ఓ ర్యాలీలో అద్భుత డిఫెన్స్‌ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ లక్ష్య పైచేయి సాధించాడు. విరామం తర్వాత శ్రీకాంత్‌ పుంజుకున్నాడు. 13-13 వద్ద స్కోరు సమం చేశాడు. ఆ దశలో వరుసగా రెండు పాయింట్లతో లక్ష్య ఆధిక్యం సంపాదించాడు. కానీ శ్రీకాంత్‌ వరుసగా మూడు పాయింట్లతో 16-15తో నిలిచాడు. 16-16తో లక్ష్య స్కోరు సమం చేయగా.. ఆ తర్వాత శ్రీకాంత్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19-16తో నిలిచాడు. కళ్లు చెదిరే క్రాస్‌ కోర్ట్‌ విన్నర్‌.. చక్కని డ్రాప్‌తో అతడు ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్య ఓ పాయింట్‌ సాధించినా.. శ్రీకాంత్‌ దూకుడును అడ్డుకోలేకపోయాడు. వరుసగా రెండు పాయింట్లతో శ్రీకాంత్‌ మ్యాచ్‌ను ముగించాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ తైజు యింగ్‌, రెండో సీడ్‌ యమగూచి ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో తైజు (చైనీస్‌ తైపీ) 21-17, 13-21, 21-14తో బింగ్‌ జియావ్‌ (చైనా)పై విజయం సాధించింది. మరో సెమీస్‌లో యమగూచి (జపాన్‌) 21-19, 21-19తో మన్‌ జాంగ్‌ (చైనా)ను ఓడించింది.
 


3
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరిన భారత మూడో షట్లర్‌ శ్రీకాంత్‌. 2015లో సైనా నెహ్వాల్‌, 2017, 2018, 2019లో సింధు ఫైనల్‌ చేరారు. సైనా రజతంతో సంతృప్తి చెందగా.. రెండుసార్లు రజత పతకానికి పరిమితమైన సింధు గత టోర్నీలో స్వర్ణం గెలిచింది.


 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని