T20 World Cup 2024: ఆ ఇద్దరు సీనియర్లకు నో ఛాన్స్‌.. కుర్రాళ్లకే నా ఓటు: వెంకటేశ్ ప్రసాద్

ప్రపంచ కప్ జట్టు ఎలా ఉంటుందనే చర్చలోకి భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ వచ్చాడు. తాను మాత్రం యువ క్రికెటర్లకే మద్దతుగా ఉంటానని తెలిపాడు.

Published : 10 Apr 2024 15:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: త్వరలోనే టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టును ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఎవరిని తీసుకుంటారు? ఎవరిని పక్కన పెడతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వరల్డ్ కప్‌ జట్టుపై భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్‌ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల కంటే కుర్రాళ్లకే అవకాశం ఇవ్వాలని సూచించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. 

‘‘స్పిన్నర్లపై శివమ్‌ దూబె అత్యుత్తమంగా ఎటాక్‌ చేస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో టాప్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్. ఫినిషర్‌గా రింకు సింగ్‌ అద్భుతం. మిడిలార్డర్‌లో వీరే కీలకం. తుది 11 మంది జట్టులో ఈ ముగ్గురికీ అవకాశం ఇవ్వాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలానూ ఉంటారు. వికెట్ కీపర్‌ ఎవరు అనేది ఇంకా తేలాల్సిఉంది. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి’’ అని ఎక్స్‌లో వెంకటేశ్‌ ప్రసాద్ పోస్టు పెట్టాడు. దీంతో సీనియర్‌ ప్లేయర్లు కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ ముగ్గురూ ప్రస్తుత ఐపీఎల్‌లో నాణ్యమైన ప్రదర్శన చేయడం లేదనే ఉద్దేశంతోనే మాజీ పేసర్ తన జాబితాలో అవకాశం ఇవ్వలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

సంజూనే వికెట్ కీపర్‌: బ్రాడ్ హాగ్

టీ20 ప్రపంచ కప్‌ బరిలోకి దిగే భారత జట్టులో వికెట్ కీపర్‌గా సంజూశాంసన్ అయితే బాగుంటుందని ఆసీస్‌ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు. రిషభ్‌ పంత్, కేఎల్ రాహుల్‌ కంటే అతడే బెటర్‌ అని పేర్కొన్నాడు. ‘‘గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఎక్కువ స్ట్రైక్‌రేట్‌ కావాలని మీరు భావించినా.. దానికి అతడు సరిపోతాడు. రాజస్థాన్‌ను నడిపిస్తున్న సంజూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దూకుడుగా ఆడటంతోపాటు జట్టును గెలిపించగల సత్తా ఉంది. రిషభ్‌ పంత్ కూడా వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, అతడు ఇంకాస్త నిలకడ ప్రదర్శించాల్సి ఉంది. ఫిట్‌నెస్‌ పరంగానూ పంత్‌ కంటే సంజూ బెటర్. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేయగలడు. వికెట్ కీపర్ - బ్యాటర్‌ పాత్రకు సరిపోతాడు’’ అని బ్రాడ్ హాగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని