Artificial Intelligence: యాపిల్‌ ఏఐ శకం

యాపిల్‌ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్‌ అసిస్టెంట్‌ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది.

Updated : 12 Jun 2024 07:04 IST

యాపిల్‌ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్‌ అసిస్టెంట్‌ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది. మరోవైపు ఐఓఎస్‌ 18, ఐప్యాడ్‌ఓఎస్‌ 18, విజన్‌ఓఎస్‌ 2, మ్యాక్‌ఓఎస్‌ సుకోయా, వాచ్‌ఓఎస్‌ 11 ఆవిష్కరణతో తమ పరికరాలకు కొత్త జవసత్వాలను అందించింది. వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ను ఛాట్‌జీపీటీతో సమ్మిళితం చేయటం మరో విశేషం. గోప్యత మీద దృష్టి సారిస్తూనే యాపిల్‌ వినూత్న దృష్టితో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాంటి కొన్ని పరిజ్ఞానాలు, ఫీచర్ల గురించి తెలుసుకుందామా.


సొంత కృత్రిమ మేధ

ఆలస్యంగానైనా యాపిల్‌ సంస్థ కృత్రిమ మేధ సమ్మేళనానికి నడుం బిగించింది. తమదైన యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చింది. కాకపోతే ఇది యాపిల్‌ పరికరాల్లోనే అందుబాటులో ఉంటుంది. అదీ అప్‌గ్రేడెడ్‌ పరికరాల్లోనే. ఎం1 చిప్‌తో కూడిన ఐప్యాడ్‌ ఎయిర్, ఐప్యాడ్‌ ప్రొ, మ్యాక్‌ల వంటి పరికరాల్లో దీన్ని వాడుకోవచ్చు. ఐఫోన్ల విషయానికి వస్తే గత సంవత్సరం వచ్చిన ఐఫోన్‌ 15 ప్రొ మ్యాక్స్, ఐఫోన్‌ ప్రొ 15 పరికరాలనే సపోర్టు చేస్తుంది. మామూలు ఐఫోన్‌ 15లో పనిచేయదు. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ బీటా వర్షన్‌ త్వరలోనే విడుదల కానుంది. కృత్రిమ మేధ పరిజ్ఞానం సాయంతో ఇది బోలెడన్ని పనులు చేసి పెడుతుంది. రాస్తున్నప్పుడు అక్షర దోషాలను పరిహరిస్తుంది. కావాలంటే మరింత ఆకర్షణీయంగా, వృత్తి అవసరాలకు అనుగుణంగా తిరగ రాస్తుంది కూడా. ఫోన్‌ మొత్తం వెతికి ఆయా మెయిల్స్, మెసేజ్‌లను పట్టుకోగలదు. వాటిని క్రోడీకరించగలదు. నోటిఫికేషన్లను ప్రాధాన్య క్రమంలో అమర్చుతుంది కూడా. అవసరానికి అనుగుణమైన జెన్‌మోజీ అనే ఎమోజీనీ సృష్టించగలదు. స్నేహితులు, కుటుంబసభ్యుల ఫొటోలను ఎమోజీలుగా మార్చే సదుపాయాన్నీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. వీటిని మెసేజ్‌లు, ఈమెయిళ్లు పంపేటప్పుడు వాడుకోవచ్చు. ఫొటోలో దుస్తుల రంగును వెతికి పట్టుకోవచ్చు. నేరుగా ఫొటోలోని అంశాలను వెతికి పట్టుకునే వీలుండటమూ విశేషం. ఉదాహరణకు పాస్‌పోర్ట్‌ నంబరు వంటి వాటిని సెర్చ్‌ చేసుకోవచ్చు. సిరి ద్వారా ఓపెన్‌ ఏఐకి చెందిన ఛాట్‌జీపీటీ సాయంతో మరింత సమగ్రమైన సమాధానాలూ అందుకోవచ్చు. పరికరానికి సంబంధించిన అన్ని విషయాల మీదా సిరి అవగాహన కలిగుండటం గమనార్హం. ఐఫోన్‌ లేదా ఐప్యాడ్‌లో ఏ పని ఎలా చేయాలో చెప్పమని అడిగినా వాటిని సవివరంగా ముందుంచుతుంది. గోప్యతకు, వ్యక్తిగత అవసరాలకు యాపిల్‌ ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం విశేషం. యాపిల్‌ సర్వర్లలో ప్రత్యేకించిన ప్రైవేట్‌ క్లౌడ్‌ కంప్యూట్‌ను దీనికి వాడు కుంటారు.


ఇక కాల్‌ రికార్డింగ్‌ 

ఐఫోన్లలో కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. యాపిల్‌ సంస్థ తొలిసారిగా ఐఓఎస్‌ 18తో కూడిన ఫోన్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌ యాప్‌లోని ఈ ఫీచర్‌ కాల్స్‌ను రికార్డు చేయటమే కాకుండా వాటిని ఇంగ్లిషులో అక్షర రూపంలోకీ మారుస్తుంది. దీన్ని వాడుకునేటప్పుడు అవతలివారికి కాల్‌ రికార్డు చేస్తున్నామనే విషయాన్నీ తెలియజేస్తుంది. ఇంగ్లిషులో మాటలను అక్షరాల రూపంలోకి మార్చే ఫీచర్‌ మనదేశంతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్‌లో అందుబాటులో ఉంటుంది. కాల్‌ చేస్తున్నప్పుడు దానిలోని ముఖ్యాంశాలను సారాంశంగా సృష్టించటం మరో ప్రత్యేకత. దీంతో చర్చల సమయంలో ప్రస్తావనకు వచ్చిన ముఖ్యమైన విషయాలను త్వరగా సమీక్షించుకోవచ్చు. కాల్‌ హిస్టరీలో కొత్త ఇంటర్ఫేస్‌నూ జోడించారు. గతంలో చేసిన కాల్స్‌ను తేలికగా వెతుక్కోవచ్చు. ఫోన్‌ నంబర్లకు ఆటోఫిల్‌ ఫీచర్‌ కూడా తోడైంది. ఇది అంకెలను టైప్‌ చేస్తున్నప్పుడు ఆ నంబరును పూర్తి చేస్తుంది. కాల్‌ చేస్తున్నప్పుడు మధ్యలో ఆగకుండా వేరే సిమ్‌కు మారే సదుపాయమూ వచ్చింది. ఎక్కువ సిమ్‌లు వాడేవారికిది ఎంతో ఉపయుక్తం. ఆడియో, ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్లను నోట్స్‌ యాప్‌కూ వర్తింపజేయాలని యాపిల్‌ అనుకుంటోంది. అప్పుడు నోట్స్‌ యాప్‌ నుంచే నేరుగా ఆడియోను రికార్డు చేయొచ్చు. దాన్ని అప్పటికప్పుడే అక్షర రూపంలోకి మార్చుకోవచ్చు. ఐఫోన్‌ 12, ఆ తర్వాతి తరం ఫోన్లలో ఇది అందుబాటులోకి రానుంది. 


ఐప్యాడ్‌లో కాలిక్యులేటర్‌

ఎట్టకేలకు ఐప్యాడ్‌లో కాలిక్యులేటర్, మ్యాథ్స్‌ నోట్స్‌ జతచేరాయి. కాలిక్యులేటర్‌ అంత ఉత్సాహం కలిగించకపోయినా మాథ్స్‌ నోట్స్‌ ఉత్సుకత రేకెత్తిస్తోంది. కాలిక్యులేటర్‌లో ప్రాథమిక, శాస్త్రీయ కాలిక్యులేటర్లు సమస్యను అంచెల వారీగా వివరించి గణిస్తుంది. హిస్టరీ ఫీచర్‌ గతంలో చేసిన లెక్కలను చూపుతుంది. యూనిట్‌ ఫీచరేమో పొడవు, ఎత్తు, కరెన్సీలను వెంటనే కన్వర్ట్‌ చేస్తుంది. కాలిక్యులేటర్‌తో సమ్మిళితమైన మ్యాథ్‌ నోట్స్‌ కాగితం, కలంలా కనిపిస్తుంది. లెక్కలను రాయటానికి లేదా టైప్‌ చేయటానికిది వీలు కల్పిస్తుంది. ఆ వెంటనే సమాధానాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు- సమీకరణాన్ని రాసి ఈక్వల్‌ గుర్తును టైప్‌ చేయగానే జవాబు ఆ వెంటనే ప్రత్యక్షమవుతుంది. అదే సమీకరణాన్ని వేరే రూపంలోకి మార్చుకునే సదుపాయమూ ఉంటుంది. తరగతిలో కొత్త అంశాలను నేర్చుకున్నప్పుడు, బడ్జెట్‌ను గణించేటప్పుడు వ్యత్యాస విలువలనూ అసైన్‌ చేసుకోవచ్చు. చేతిరాత రూపంలోని లెక్కలనూ ఇది విశ్లేషించగలదు. ఆ రాత రూపంలోనే సమాధానాలు సృష్టించటం గమనార్హం. మ్యాథ్‌ నోట్స్‌లో మరో గొప్ప ఫీచర్‌ గ్రాఫిక్‌. భౌతికశాస్త్ర సమీకరణాలను దీంతో పరిష్కరించుకోవచ్చు. సమీకరణాన్ని చేత్తో రాసి గానీ టైప్‌ చేసి గానీ ఒక్క ట్యాప్‌తో గ్రాఫ్‌ను జొప్పించొచ్చు. ఒకే గ్రాఫ్‌లో పలు సమీకరణాలనూ జత చేయొచ్చు. వాటి మధ్య సంబంధాలను తెలుసుకోవచ్చు. నోట్స్‌ యాప్‌లోనే మాథ్‌ నోట్స్‌ ఫోల్డర్‌ కూడా ఉంటుంది. మరో ట్యాబ్‌కు మారినా ఆయా సమీకరణాలు అలాగే ఉంటాయి.


సరికొత్తగా వాచ్‌ఓఎస్‌

యాపిల్‌ వాచ్‌ను మరింత సమర్థ హెల్త్, ఫిట్‌నెస్‌ సహాయకారిగా మలిచే వాచ్‌ఓఎస్‌ 11 ఆవిష్కృతమైంది. వైటల్స్‌ యాప్‌లో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలనూ చూసుకోవచ్చు. గుండె వేగం, శ్వాస వేగం, నిద్ర తీరు వంటి విషయాలన్నీ ఒక్క చోటే ఉంటాయి. వీటిని వైటల్స్‌ యాప్‌ కృత్రిమ మేధ సాయంతో విశ్లేషించి వ్యక్తిగత అవసరాలను నోటిఫికేషన్ల రూపంలో అందిస్తుంది. ఇలా ఆరోగ్యానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవటానికి తోడ్పడుతుంది. యాపిల్‌ వాచ్‌తో వ్యాయామాన్ని ట్రాక్‌ చేసుకునేవారికి ట్రెయినింగ్‌ లోడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు. గత నెలతో పోలిస్తే గత వారంలో వ్యాయామం మూలంగా కండరాలు ఎంత ఒత్తిడికి గురయ్యాయో ఇది తెలియజేస్తుంది. గతంలో మెసేజ్‌ యాప్‌లో ప్రవేశపెట్టిన చెక్‌ ఇన్‌ ఫీచర్‌ ఇప్పుడు వాచ్‌ఓఎస్‌ 11 మీద వర్కవుట్‌ యాప్‌లో జత చేశారు. తాము సాధించిన పురోగతిని స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవటానికిది తోడ్పడుతుంది.


పాస్‌వర్డ్‌ సమన్వయం

ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌ వాడేవారి కోసం పాస్‌వర్డ్‌లను, పాస్‌కీస్‌ను సమర్థంగా పర్యవేక్షించటానికి కొత్తగా పాస్‌వర్డ్‌ మేనేజర్‌ అందుబాటులోకి వచ్చింది. దీని పేరు పాస్‌వర్డ్స్‌. ఇది ఐక్లౌడ్‌ కీచెయిన్‌ ఫీచర్‌కు కొనసాగింపని అనుకోవచ్చు. యూజర్‌నేమ్, పాస్‌వర్డ్, క్రెడిట్‌ కార్డు వివరాలు, సెక్యూరిటీ కోడ్స్, వైఫై పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని తనకు తానే పూరిస్తుంది. వేర్వేరు ఖాతాల పాస్‌వర్డ్‌లను సమర్థంగా నిర్వహించుకోవటానికిది తోడ్పడుతుంది. దీన్ని అన్ని యాపిల్‌ పరికరాల్లో ఉచితంగానే వాడుకోవచ్చు. కొత్తగా సృష్టించుకున్న పాస్‌వర్డ్‌లు తమకుతామే యాప్‌నకు సింక్‌ అవుతాయి.


మ్యాక్‌ఓఎస్‌ సుకోయా

మ్యాక్‌లో ఐఫోన్‌ మిర్రరింగ్‌ ఫీచర్‌ కొత్త విశేషం. దీని సాయంతో యూజర్లు మ్యాక్‌ మీద తమ ఐఫోన్లను వాడుకోవచ్చు. హోం స్క్రీన్‌ స్వైప్‌ చేయటం, వేర్వేరు యాప్‌లను ఓపెన్‌ చేయటం.. ఇలా ఫోన్‌ మీద చేసే పనులన్నింటినీ మ్యాక్‌ తెర మీదే చేయొచ్చు. మ్యాక్‌ నోటిఫికేషన్లతో పాటు ఐఫోన్‌ నోటిఫికేషన్లూ కనిపిస్తాయి. ప్రజెంటర్‌ వ్యూ ఫీచర్‌ వీడియో కాలింగ్‌ అనుభూతిని మెరుగు పరుస్తుంది. మీటింగులో ఇతరులతో షేర్‌ చేసుకోవటానికి ముందు వారి స్క్రీన్‌ను చూడటానికిది వీలు కల్పిస్తుంది. ఫేస్‌టైమ్, జూమ్‌ వంటి అప్లికేషన్లను ఇది సపోర్టు చేస్తుంది. వీడియో కాల్‌ చేస్తున్నప్పుడు నేపథ్యాన్ని వైవిధ్యమైన రంగుల ఛాయల్లోకి మార్చుకోవచ్చు కూడా. కావాలంటే పీసీలోని వాల్‌పేపర్లనూ అలంకరించుకోవచ్చు.


యాప్‌లకు తాళం

అనధీకృత వ్యక్తులు వాడుకోకుండా ఆయా యాప్‌లకు తాళం వేయటానికీ వినూత్న ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. దీని పేరు లాక్‌ యాన్‌ యాప్‌. ఇతరుల చేతికి పరికరాలను ఇస్తున్నప్పుడు గోప్యతను కాపాడుకోవటానికిది తోడ్పడుతుంది. వేరేవాళ్ల కంటికి యాప్‌లు కనిపించకుండా చేసే హైడ్‌ యాన్‌ యాప్‌ ఫీచర్‌ కూడా తోడైంది.


ఐఓఎస్‌ 18 కొత్తగా

ఇకపై యూజర్లు తమ ఇష్టానికి అనుగుణంగా హోం స్క్రీన్‌ మీద యాప్స్, విడ్జెట్స్‌ను సర్దుకోవచ్చు. ఐఓఎస్‌ 18 రాకతో తొలిసారిగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. హోం స్క్రీన్‌ ఐకన్లు, విడ్జెట్స్‌ రంగులను ముదురుగా లేదా లేతగా మార్చుకోవటానికీ వీలుంటుంది. మరింత సులభంగా వాడుకోవటానికి కంట్రోల్‌ సెంటర్‌ డిజైన్‌ కూడా మారింది. ఇప్పుడు థర్డ్‌ పార్టీ యాప్స్‌ సపోర్టుతో కంట్రోళ్లనూ జత చేసుకోవచ్చు. కంట్రోళ్ల లే అవుట్‌నూ ఇష్టమైనట్టు అలంకరించుకోవచ్చు. అడుగున లాక్‌ స్క్రీన్‌ మీద కంట్రోళ్లను బదలాయించుకోవచ్చు. 

  • ఫొటోస్‌ యాప్‌ సైతం కొత్తగా ముస్తాబయ్యింది. నచ్చిన ఫొటోలను తేలికగా వెతుక్కోవచ్చు. కరోజల్‌ వ్యూ ఫీచర్‌ సాయంతో నచ్చిన వ్యక్తులు, జంతువుల, ప్రాంతాల హైలైట్స్‌ను చూడొచ్చు. ఇది గత అనుభూతులను ఆటోప్లే చేస్తుంది కూడా.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని