ఫోన్‌ భద్రంగా..

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్‌వర్డ్‌లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్‌ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ!

Updated : 08 May 2024 02:13 IST

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్‌వర్డ్‌లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్‌ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! మనలో చాలామంది ఆండ్రాయిడ్‌ ఫోన్లనే ఎక్కువగా వాడుతుంటారు. వీటి రక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

 దగ్గరే ఉంచుకోవాలి

ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవటానికి అత్యుత్తమైన మార్గం దగ్గరే పెట్టుకోవటం. హోటళ్లకు వెళ్లినప్పుడు పర్సును టేబుల్‌ మీద పెట్టం కదా. అలాగే బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌ను కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. వాడనప్పుడు జేబులో గానీ చేతి సంచీలో గానీ పెట్టుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఫోన్‌ మీద ఓ కన్నేసి ఉంచాలి. చవక ఫోన్‌ అయినా కూడా దీన్ని మరవరాదు. ఒకసారి ఫోన్‌ పోయిందంటే దానిలోని వివరాలు ఇతరులకు చిక్కినట్టే. ఇది గోప్యతకు భంగం కలిగిస్తుందని మరవరాదు.

యూజర్‌ ప్రొఫైల్‌ సెట్‌

కుటుంబసభ్యులో, స్నేహితులో.. ఇతరులెవరి చేతికి ఫోన్‌ ఇస్తున్నా యూజర్‌ ప్రొఫైల్‌ ఆప్షన్‌ ఎంచుకోవటం మంచిది. ఇది ప్రతి ఒక్కరికీ తమదైన భద్రత కల్పిస్తుంది. దీన్ని సెట్‌ చేసుకుంటే కొత్త యూజర్‌ను యాడ్‌ చేసుకొని ఫోన్‌ను వారికి ఇవ్వచ్చు. వారి ఈమెయిల్‌ ఖాతా, యాప్స్‌, ఫొటో స్టోర్‌ విడిగా ఉంటాయి. ఇలా ఇద్దరి వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి. ఒకవేళ కొద్ది నిమిషాల వరకే ఎవరికైనా ఫోన్‌ ఇస్తున్నట్టయితే గెస్ట్‌ ప్రొఫైల్‌ను సెట్‌ చేసుకోవాలి. దీని ద్వారా ఆ సమయం మేరకు ఖాతాను భద్రంగా ఉంచుకోవచ్చు. మొత్తం వ్యక్తిగత డేటా వారి కంటపడకుండా చూసుకోవచ్చు. సెటింగ్స్‌ ద్వారా సిస్టమ్‌లోకి వెళ్లి.. మల్టిపుల్‌ యూజర్స్‌ బటన్‌ను ఆన్‌ చేసుకోవాలి. అనంతరం యాడ్‌ యూజర్‌ను ఎంచుకొని, ఓకే మీద ట్యాప్‌ చేయాలి. కొత్త యూజర్‌కు పేరు పెట్టుకోవాలి. అవసరమైతే ఫొటో జత చేసుకోవచ్చు. ఎవరికైనా ఫోన్‌ ఇచ్చేటప్పుడు స్విచ్‌ యూజర్‌ మీద ట్యాప్‌ చేసి సెటప్‌ నౌ ఎంచుకుంటే సరి. కొన్ని ఫోన్లలో ఈ సెటింగ్‌ విధానం భిన్నంగా ఉండొచ్చు.

యాప్స్‌ లాకప్‌

స్క్రీన్‌ లాక్‌ చేసుకోవటమే కాకుండా ముఖ్యమైన యాప్‌లను విడివిడిగా లాక్‌ చేసుకోవటమూ ముఖ్యమే. ఎవరైనా పాస్‌వర్డ్‌ తెలుసుకొని ఫోన్‌ను ఓపెన్‌ చేసినా యాప్‌లను ఓపెన్‌ చేయకుండా ఇది కాపాడుతుంది. ఇందుకోసం ఉచితంగా అందుబాటులో ఉండే యాప్‌ లాక్‌ వంటి సాధనాల సాయమూ తీసుకోవచ్చు. అన్నీ కాకపోయినా ఈమెయిల్‌, ఫైల్‌ మేనేజర్‌ వంటి రహస్య సమాచారంతో కూడిన యాప్‌లను లాక్‌ చేసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. కొన్ని పరికరాల్లో ప్రత్యేకించి లాక్డ్‌ ఏరియా వంటి ఫీచర్లూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైన యాప్‌లను భద్రపరచుకోవచ్చు. అదనంగా మరో సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరముండదు.

ఫైండ్‌ మై డివైస్‌

పొరపాటున ఫోన్‌ పోయినట్టయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి, సెక్యూరిటీ ఆప్షన్‌ ద్వారా ప్రైవసీలోకి వెళ్లాలి. ఫైండ్‌ మై డివైస్‌ను ఆన్‌ చేయాలి. చాలా ఫోన్లలో ఇది ఆఫ్‌ చేసి ఉంటుంది. దీని కింద ఫైండ్‌ మై డివైస్‌, వెబ్‌, గూగుల్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఫైండ్‌ మై డివైస్‌ ఫోన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోనట్టయితే ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక ఓపెన్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌ మాదిరిగా కనిపిస్తుంది. ఇది పనిచేయాలంటే ఫోన్‌లో లొకేషన్‌ ఆన్‌ చేసి ఉంచాలి. అప్పుడే మ్యాప్‌లో ఫోన్‌ ఉన్నచోటు కనిపిస్తుంది. ఇందులో ప్లే సౌండ్‌, సెక్యూర్‌ డివైస్‌, ఎరేజ్‌ డివైస్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో ఎరేజ్‌ డివైస్‌ బూడిద రంగులో ఉంటుంది. ఎందుకంటే దీన్ని అదే పరికరం నుంచి ఉపయోగించుకోలేం. వెబ్‌ లేదా ఇతర పరికరం ద్వారానే ఎరేజ్‌ చేయటానికి వీలుంటుంది.

  • ఫోన్‌ కనిపించనప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు వెబ్‌ ఇంటర్‌ఫేస్‌తో గుర్తించొచ్చు. ముందుగా  https://www.google.com/android/find లోకి వెళ్లాలి. గూగుల్‌ ఖాతాలోకి సైన్‌ ఇన్‌ అయ్యాక ఎడమ వైపున మన ఫోన్‌ కనిపిస్తుంది. ప్లే సౌండ్‌ను ఎంచుకుంటే ఐదు నిమిషాల సేపు ఫోన్‌ రింగ్‌ అవుతుంది. సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా, స్విఛాప్‌ అయినా కూడా ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ఫోన్‌ దొరికినవారిని హెచ్చరించేందుకు మెసేజ్‌ కూడా పంపించొచ్చు. స్క్రీన్‌ లాక్‌ అయినా వారికి మెసేజ్‌ కనిపిస్తుంది. ఫోన్‌ను లాక్‌ చేయాలనుకుంటే ‘సెక్యూర్‌ డివైస్‌’ మీద క్లిక్‌ చేసి, గూగుల్‌ ఖాతా నుంచి సైన్‌ అవుట్‌ కావాలి. ఇక ‘ఎరేజ్‌ డివైస్‌’ ఆప్షన్‌తో ఫోన్‌లోని సమాచారాన్నంతా డిలిట్‌ చేయొచ్చు. ఇందుకోసం మళ్లీ సైన్‌ ఇన్‌ కావాల్సి ఉంటుంది. ఒకసారి సమాచారం ఎరేజ్‌ అయితే ఇక ఎప్పటికీ ఫోన్‌ ఎక్కడున్నదీ గుర్తించలేం. ఒకవేళ కంప్యూటర్‌ అందుబాటులోకి లేకపోతే ఇతర ఆండ్రాయిడ్‌ పరికరంతోనూ ఫైండ్‌ మై డివైస్‌ యాప్‌లోకి సైన్‌ఇన్‌ అయ్యి కూడా ఫోన్‌ ఉన్న చోటును గుర్తించొచ్చు.
  • సామ్‌సంగ్‌ గెలాక్సీ వంటి కొన్ని ఫోన్లలో ఫైండ్‌ మై డివైస్‌తో పాటు అదనంగా ఫైండ్‌ మై మొబైల్‌ ఆప్షన్‌ సైతం ఉంటుంది.

గూగుల్‌తో యాప్స్‌ ధ్రువీకరణ

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న అన్ని యాప్‌లను గూగుల్‌ తనిఖీ చేస్తుంది, ధ్రువీకరిస్తుంది. అయితే కొన్నిసార్లు అధికార స్టోర్‌ల నుంచి కాకుండా ఇతర సోర్స్‌ నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. ఇలాంటప్పుడు యాప్‌ వెరిఫికేషన్‌ను ఆన్‌ చేసుకుంటే ఇన్‌స్టాల్‌ చేసుకునే యాప్‌లను స్కాన్‌ చేస్తుంది. వాటిల్లో మాల్వేర్లుంటే హెచ్చరిస్తుంది. ఇందుకోసం సెటింగ్స్‌ ద్వారా సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి స్కాన్‌ డివైస్‌ ఫర్‌ సెక్యూరిటీ థ్రెట్స్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.

సెక్యూరిటీ యాప్‌ ఇన్‌స్టాల్‌

సహజంగానే ఆండ్రాయిడ్‌ పరికరాల్లో బోలెడన్ని సెక్యూరిటీ టూల్స్‌ ఉంటాయి. అయినప్పటికీ థర్డ్‌ పార్టీ సెక్యూరిటీ లేదా యాంటీవైరస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటం మంచిది. అయితే 360 సెక్యూరిటీ, అవాస్ట్‌ యాంటీవైరస్‌ అండ్‌ సెక్యూరిటీ, లుకవుట్‌ మొబైల్‌ సెక్యూరిటీ వంటి విశ్వసనీయ యాప్‌లనే ఎంచుకోవాలని మరవొద్దు. ఇలాంటి భద్రమైన యాప్‌లు వైరస్‌లు, మాల్వేర్లను స్కాన్‌ చేయటమే కాకుండా అంతర్జాలాన్ని చూస్తున్నప్పుడు బ్రౌజర్లనూ స్కాన్‌ చేస్తాయి. టూల్స్‌ వేగాన్నీ పెంచుతాయి. బాగా పనిచేసే సెక్యూరిటీ యాప్‌ను ఎంచుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

డేటా ఎన్‌క్రిప్షన్‌

పరికరంలో డేటాను ఎన్‌క్రిప్షన్‌ చేసుకుంటే ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌ను ఎవరైనా దొంగిలించినా భద్రంగా కాపాడుకోవచ్చు. ఇది డేటాను ఇతరులు చదవటానికి వీల్లేని రహస్యలిపిలోకి మార్చేస్తుంది. పాస్‌వర్డ్‌లాంటి విశ్వసనీయ మార్గాలతో తప్ప వాటిని చదవటానికి, చూడటానికి వీలుండదు. ఖాతా, యాప్‌ వివరాలు, మ్యూజిక్‌, ఇతర మీడియా, డౌన్‌లోడ్‌ సమాచారం వంటి ఆండ్రాయిడ్‌ పరికరంలోని మొత్తం డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేసుకోవచ్చు. సెటింగ్స్‌లోని సెక్యూరిటీ మెనూ ద్వారా ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌ను జతచేసుకోవచ్చు. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటం కొన్ని ఫోన్లలో వేరేగా ఉండొచ్చు.

తరచూ బ్యాకప్‌

ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ సెటప్‌లో భాగంగా తరచూ బ్యాకప్‌ చేసుకోవటం కీలకమైన విషయం. ఎప్పుడో చేసుకున్న బ్యాకప్‌లు పరికరానికి పూర్తి భద్రత కల్పించలేవు. ఎప్పటికప్పుడు బ్యాకప్‌ చేసుకోకపోతే రికవర్‌ చేసుకునే సమయంలో కొంత సమాచారాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఆటోమేటిక్‌ బ్యాకప్‌ ఫీచర్‌తో దీన్ని తేలికగానే సెట్‌ చేసుకోవచ్చు. సెటింగ్స్‌లోకి వెళ్లి, బ్యాకప్‌ మై అకౌంట్‌ను ఎంచుకుంటే చాలు.

అన్‌సెక్యూర్డ్‌ నెట్‌వర్క్‌ల వాడొద్దు

ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసనీయం కాని నెట్‌వర్క్‌లకు కనెక్ట్‌ కావొద్దు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లతో వ్యాపారం చేసేవారికిది మరింత ముఖ్యం. హోటళ్ల వంటి చోట్ల తరచూ పనిచేసేవారు ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ కావాల్సి వస్తే పాస్‌వర్డ్‌తో కూడిన నెట్‌వర్క్‌లనే ఎంచుకోవాలి. పాస్‌వర్డ్‌లు లేని వై-ఫైతో కనెక్ట్‌ అయితే రహస్య సమాచారాన్ని పంపటం, అందుకోవటం చేయొద్దు.తెరకు తాళం అన్నింటికన్నా ముందుగా సెట్‌ చేసుకోవాల్సింది స్క్రీన్‌ లాక్‌. ఇంటికి తాళం వేసినట్టుగా తెరను లాక్‌ చేసుకుంటే ఇతరులెవరూ తెరవటానికి వీలుండదు. ప్యాటర్న్‌, పిన్‌ దేనితోనైనా స్క్రీన్‌ లాక్‌ చేసుకోవచ్చు. పిన్‌తో లాక్‌ చేసుకోవటం సురక్షితమైన పద్ధతే గానీ ప్యాటర్న్‌తోనైతే త్వరగా ఫోన్‌ను అన్‌లాక్‌ చేయొచ్చు. దీన్ని గుర్తుంచుకోవటమూ తేలికే. అయితే ఇతరులెవరూ ఊహించలేని సంక్లిష్టమైన ప్యాటర్న్‌ సెట్‌ చేసుకోవాలి. అధునాతన ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ ఫీచర్లు ఇప్పుడు ఫోన్‌ను సెట్‌ చేసుకోవటానికి ముందే స్క్రీన్‌ లాక్‌ను సూచిస్తున్నాయి కూడా. కాబట్టి దీన్ని సమర్థవంతంగా వాడుకుంటే ఫోన్‌ భద్రత విషయంలో తొలి అడుగు పడినట్టే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని