కార్చిచ్చు కహానీ!

ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు రేగటం తెలిసిందే.

Published : 01 May 2024 00:00 IST

ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. అదృష్టం కొద్దీ ఇవి మనదగ్గర తక్కువే. ఇక్కడ 54.4% అడవుల్లో అప్పుడప్పుడూ, 7.49% అడవుల్లో ఒక మాదిరిగా, 2.40% అడవుల్లో అత్యంత తీవ్రమైన మంటలు రేగుతుంటాయి. కార్చిచ్చుల మూలంగా బయోమాస్‌ వంటి విలువైన అటవీ వనరులను  కోల్పోవాల్సి వస్తోంది. అందుకే వీటి నివారణకు అధునాతన ఉపగ్రహ చిత్రాలు, సెన్సర్ల సాయం తీసు కుంటున్నారు. మంటలు రేగినా వినూత్న పద్ధతుల్లో ఆర్పటానికి ప్రయత్ని స్తున్నారు. ఇంతకీ కార్చిచ్చులు ఎలా పుట్టు కొస్తాయి? ఎలా ఆర్పుతారు?

కార్చిచ్చు, దావానలం.. పేరేదైనా పచ్చటి అడవుల్లో మంటలు రేగటం అనాదిగా చూస్తున్నదే. ఇవి రాజుకోవటానికి చిన్న నిప్పు రవ్వో, సూర్యుడి వేడో చాలు. ఒక్కసారి అంటుకుందంటే ఎండిన కొమ్మలు, చెట్లే కాదు.. దారిలో ఉన్న దేనినైనా కాలుస్తూ చాలా వేగంగా.. దాదాపు గంటకు 23 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తుంది. అప్పటివరకూ పచ్చటి అడవిలా కనిపించింది కాస్తా బూడిద కుప్పలా మారుతుంది. చుట్టుపక్కల వేలాది ఎకరాలను కబళిస్తుంది. ఆవాసాలకు, ప్రజలకు ముప్పుగా పరిణమిస్తుంది.

ఎండా కాలంలోనే ఎక్కువ

కార్చిచ్చులు చాలావరకూ ఎండా కాలం వంటి కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడు పుట్టుకొస్తున్నాయి. చిన్న నిప్పు రవ్వ అయినా దావానలం రాజుకునేలా చేయొచ్చు. రైలు చక్రాలు పట్టాలకు రాసుకున్నప్పుడు పుట్టుకొచ్చే రవ్వలైనా చాలు. కొన్నిసార్లు ఎండ, మెరుపు వంటి సహజ అంశాలూ కార్చిచ్చులకు కారణం కావొచ్చు. అయితే చాలావరకూ మానవ తప్పిదాలే దీనికి దోహదం చేస్తుంటాయి.

ప్రధాన కారణాలు

మండటానికి అవసరమైన వేడితో కూడినవి ఏవైనా కార్చిచ్చులను రేపొచ్చు. పొలాలు, నిర్మాణాల కోసం చెట్లను కాల్చటం, వనవాసానికి వెళ్లినవారు వేసుకునే చలిమంటలు, సిగరెట్లను నిర్లక్ష్యంగా విసిరేయటం, చెత్తను పూర్తిగా కాల్చకుండా అడవుల దగ్గర వదిలేయటం, అగిపెట్టెలు, బాణసంచా, ఉద్దేశపూర్వకంగా మంట పెట్టటం వంటివి కార్చిచ్చులకు కారణమవుతుంటాయి. కలప 300 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద మండుతుంది. కలప ఈ ఉష్ణోగ్రత వరకూ వేడెక్కినప్పుడు పొగరూపంలో హైడ్రోకార్బన్‌ వాయువులు వెలువడతాయి. ఇవి గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి దగ్ధమవుతాయి. అనంతరం మంట పుట్టుకొస్తుంది.

జ్వాల త్రికోణం

మంట రాజుకోవటానికి, జ్వాలలు రేగటానికి మూడు అంశాలు దోహదం చేస్తాయి. అవి మండటానికి తోడ్పడే ఇంధనం, ఆక్సిజన్‌  సరఫరా చేసే గాలి, ఇంధనం దహనమయ్యే ఉష్ణోగ్రతకు చేరుకోవటానికి తోడ్పడే వేడి కారకం. అందుకే వేడి, ఆక్సిజన్‌, ఇంధనాన్ని జ్వాల త్రికోణం (ఫైర్‌ ట్రయాంగిల్‌) అని పేర్కొంటారు. మంటలు ఆర్పే సిబ్బంది దీని గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. త్రికోణంలో ఒకదాన్ని సమసి పోయేలా చేస్తే మంటల నియంత్రణ తేలికవుతుంది.  చివరికి మంటలు ఆరిపోతాయి.

మంచి కూడా..

సహజ కార్చిచ్చు పర్యావరణానికి మేలు చేస్తుంది కూడా. ఉదాహరణకు- కొన్ని చెట్ల గుత్తులు విచ్చుకోవటానికి, వాటి నుంచి విత్తనాలు వెలువడటానికి వేడి అవసరం. ఇలాంటి చెట్ల ఆకులకు మండే స్వభావం గల జిగురు ఉంటుంది. ఇది మంటలకు ఆజ్యం పోస్తుంది. ఇలా తమ విత్తనాలను వ్యాప్తి చేసుకుంటాయి. కార్చిచ్చులు చెట్లకు హాని చేసే కీటకాలు, చీడలు నశించేలా చేస్తాయి. కొత్త గడ్డికి, పొదలకు ఆస్కారం కలిగిస్తాయి. తక్కువ తీవ్రతతో కూడిన మంటలు చెత్తను కాల్చివేస్తాయి. దీంతో నేల అంతటా ఎండ తగులుతుంది. ఫలితంగా చిన్న మొక్కలకు పోషణ లభిస్తుంది. పెద్దవి మరింత ఏపుగా పెరుగుతాయి.

ఆర్పటం కష్టమే..

ఇంధనం, ఆక్సిజన్‌, వేడి అందినంతవరకూ కార్చిచ్చు రగులుతూనే ఉంటుంది. నివాసాల్లో రేగే మంటలను ఆర్పటం వేరు. అడవుల్లో మంటలను ఆర్పటం వేరు. మంటల వ్యాపిని అరికట్టటానికి కొన్నిసార్లు ముందుగానే కొంత ప్రాంతాన్ని కాల్చి వేస్తుంటారు కూడా. దీంతో కార్చిచ్చు అక్కడి వరకూ వచ్చి ఆగిపోతుంది. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా వేలాది గ్యాలన్ల నీటిని వెదజల్లుతుంటారు కూడా. ఫాస్ఫేట్‌ ఎరువుతో కూడిన రసాయన రిటార్డెంట్‌ కూడా వాడుతుంటారు. ఇది మంట నెమ్మదించటానికి, చల్లబడటానికి తోడ్పడుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌ అడవుల్లో రేగిన మంటలను ఆర్పటానికి వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 వీ5 హెలికాప్టర్లను వినియోగించటం తెలిసిందే. ఇందుకోసం బాంబీ బకెట్లతో నీటిని వెదజల్లారు. వీటిని హెలీబకెట్‌ అనీ పిలుచుకుంటారు. తక్కువ బరువుతో కూడిన దీనికి కింద మూత ఉంటుంది. పైలట్‌ ఆధీనంలో ఉండే వాల్వ్‌ ద్వారా మూత తీస్తే కింది నుంచి అవసరమైన చోట నీరు పడుతుంది. దీన్ని చాలా కాలంగా మంటలు ఆర్పటానికి వినియోగిస్తున్నారు. చెరువులు, ఈత కొలనుల వంటి నీటి వనరుల నుంచి తేలికగా నీటిని నింపటం దీని ప్రత్యేకత.

బాంబీ బకెట్‌ను కెనడా వ్యాపారవేత్త డాన్‌ ఆర్నే 1982లో ఆవిష్కరించారు. అప్పట్లో విమానాల ద్వారా మంటలను ఆర్పే నీటి బకెట్లు సమర్థంగా పనిచేయటం లేదని, చాలావరకూ విఫలమవు తున్నాయని గ్రహించిన ఆయన దీనికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నీటి బకెట్లను గట్టి ఫైబర్‌ గ్లాస్‌, ప్లాస్టిక్‌, లోహ చట్రంతో కూడిన దళసరి గుడ్డతో తయారుచేసేవారు. ఇవి విమానంలో పెట్టటానికి అనువుగా ఉండేవి కావు. హెలికాప్టర్‌ హుక్‌కు తగిలించటం వల్ల వేగంగా ప్రయాణించటమూ సాధ్యమయ్యేది కాదు. పైగా వీటితో కిందికి వదిలే నీరు తుంపర్లుగా మారి, చుట్టుపక్కలకు పోయేది. దీంతో అంత ఫలితం కనిపించక పోయేది. బాంబీ బకెట్‌తో ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. దీన్ని హెలికాప్టర్‌లోనే భద్రపరచొచ్చు. అవసరమైనప్పుడు పరిసరాల్లోని చెరువుల వద్దకు వెళ్లి తేలికగా నీరు నింపొచ్చు. పైగా దీనిలోంచి నీరు కిందికి ధారగా పడుతుంది. అవసరమైన చోట కచ్చితంగా నీటిని వదలొచ్చు. తక్కువ నీరు ఆవిరి కావటం వల్ల మంచి ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం 115కు పైగా దేశాల్లో బాంబీ బకెట్లను వాడుతున్నారు.

కొత్త టెక్నాలజీలు

కార్చిచ్చులను ఆర్పటానికి కొత్త టెక్నాలజీలూ సాయం చేస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఏఐ ఆధారిత సెన్సర్లు, అధునాతన కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ మోడళ్లతో మంటల తీరుతెన్నులను గమనిస్తూ వ్యాపించకుండా చూస్తున్నారు.

  • అధునాతన విమాన పద్ధతులూ దావానలాన్ని ఆర్పటానికి ఉపయోగపడుతున్నాయి. దీనికి ఉదాహరణ- గ్లోబల్‌ సూపర్‌ ట్యాంకర్‌. ఇదో అధునాతన జంబో జెట్‌ విమానం. ఇది సుమారు 73వేల లీటర్ల వరకూ మంటను నిరోధించే రసాయనాలను మోసుకెళ్తుంది. దీనికి 10వేల లీటర్ల నీటిని మోసుకెళ్లే హెలికాప్టర్‌ కూడా తోడుగా ఉంటుంది. జీపీఎస్‌ డేటాతో కూడిన వీడియో క్లిప్‌లు, సెన్సర్ల ద్వారా ఇది మంటల నివారణకు తోడ్పడుతుంది.
  • మానవ రహిత విమానాలు, డ్రోన్లు కూడా కార్చిచ్చులను ఆర్పటానికి దోహదం చేస్తున్నాయి. వీటికి పొగతో ఇబ్బందేమీ ఉండదు. ఇన్‌ఫ్రారెడ్‌, థర్మల్‌ కెమెరాలతో అత్యంత స్పష్టమైన ఫొటోలను తీస్తూ ముందుకు సాగుతాయి. సిబ్బందికి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ప్రమాదకరమైన పరిస్థితులను గుర్తించటానికి తోడ్పడతాయి.
  • థర్మల్‌ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్లు కూడా అగ్నిమాపక సిబ్బందికి చేదోడుగా నిలుస్తున్నాయి. పొగలు కమ్మినా వాటిల్లోంచి చూడటానికి, మంటలు రేగటానికి కారణమయ్యే అంశాలను గుర్తించటానికివి తోడ్పడుతున్నాయి.
  • అగ్నిమాపక సిబ్బందికి ఆగ్మెంటెడ్‌ రియాలిటీ హెల్మెట్లు కూడా తోడ్పడుతున్నాయి. వీటిల్లో కంప్యూటర్‌ విజన్‌తో పాటు శ్వాస తీసుకోవటానికి వెసులుబాటూ ఉంటుంది. వీటిల్లోని థర్మల్‌ కెమెరాలు పొగల్లోంచి చూడటానికీ వీలు కల్పిస్తాయి. అదే సమయంలో వైర్‌లెస్‌గా సమాచారాన్ని కంట్రోల్‌ కేంద్రాలకు బట్వాడా చేస్తాయి.
  • రోబోలూ చేదోడుగా నిలుస్తున్నాయి. ఓ స్వీడన్‌ యూనివర్సిటీ తయారుచేసిన స్మోక్‌బాట్‌ మంటలను ఆర్పటానికి, సహాయ చర్యలకు తోడ్పడుతుంది. రాడార్‌, లేజర్‌ స్కానర్‌, థర్మల్‌ కెమెరా, గ్యాస్‌ సెన్సర్లతో కూడిన ఇది పొగ ఆవల ఉన్న విషయాలను తెలుపుతుంది.

విస్తరణకు కారణాలు

ఇంధనం రాజుకున్న తర్వాత మంట పుట్టి, జ్వాలలు ఏర్పడతాయి. ఇవి వ్యాపించటానికి ఇంధనం, వాతావరణం, నైసర్గిక స్వరూపం వంటివి కారణమవుతాయి. మంట త్వరగా ఆరుతుందా? లేదా? జ్వాలగా మారి వేలాది ఎకరాలకు విస్తరిస్తుందా? అనేవి వీటిని బట్టే ఆధారపడి ఉంటాయి.
ఇంధనం: కార్చిచ్చు వ్యాపించటాన్ని చుట్టుపక్కల ఇంధనం రకం, నాణ్యత నిర్దేశిస్తాయి. చెట్లు, పొదలు, ఎండిన గడ్డి క్షేత్రాలు, ఇళ్లు వంటివేవైనా ఇంధనంగా పనిచేయొచ్చు. కొద్దిపాటి ఇంధనం గల మంటలు నెమ్మదిగా వ్యాపిస్తాయి. వీటి తీవ్రత తక్కువ. అదే పెద్దమొత్తంలో ఇంధనం అందుబాటులో ఉంటే తీవ్రంగా మంటలు లేస్తాయి. వేగంగా వ్యాపిస్తాయి. చుట్టుపక్కల పదార్థం ఎంత వేగంగా వేడెక్కితే అంత త్వరగా రాజుకుంటుంది. ఇంధనం సైజు, ఆకారం, అమరిక, తేమ శాతం కూడా మంటల తీవ్రతను నిర్ణయిస్తాయి. పెద్ద కాండాలతో పోలిస్తే ఎండు గడ్డి, ఎండుటాకులు, పుల్లలు, ఎండిన పొదలు త్వరగా మండుతాయి. రసాయన స్థాయిలో చూసుకుంటే వేర్వేరు ఇంధన పదార్థాలు వేర్వేరు వేగంతో మండుతాయి. కానీ కార్చిచ్చులో చాలావరకూ ఒకేరకం పదార్థంతో తయారైన ఇంధనమే ఉంటుంది. అయితే రాజుకునే సమయంలో నేల మీద ఇంధనం పరచుకొన్న విస్తీర్ణం, దాని పరిమాణం నిష్పత్తి మూలంగా మంట రేగుతుంది. మంట పెరుగుతున్నకొద్దీ దాని పక్కనుండే పదార్థమూ ఎండిపోతూ వస్తుంది. వేడి, పొగ కలిసి తేమ ఆవిరయ్యేలా చేస్తాయి. దీంతో మంట చేరుకున్న వెంటనే ఇంధనం తేలికగా జ్వలిస్తుంది. ఒకదగ్గర పోగుపడిన ఇంధనం కన్నా చెల్లాచెదరుగా పడిఉన్న ఇంధనం త్వరగా ఎండుతుంది. ఎందుకంటే ఇలాంటి చోట్ల ఎక్కువ ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుంది. పోగుపడిన ఇంధనంలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మంట వేడిని గ్రహిస్తుంది. అందువల్ల త్వరగా వేడెక్కదు, మండదు.

వాతావరణం: మంట పుట్టటం, ఎక్కువ కావటం, చల్లారటంలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. కార్చిచ్చులకు కరవు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. గాలులు మంటలను ఉద్ధృతమయ్యేలా చేస్తాయి. మంటలు త్వరగా వ్యాపించటానికి, మరింత ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించటానికివి దోహదం చేస్తాయి. మంటలను ఆర్పటంలోనూ చిక్కులు కలిగిస్తాయి. ఉష్ణోగ్రత, గాలి, తేమ.. ఈ మూడూ కార్చిచ్చుల మీద ప్రభావం చూపుతాయి. జ్వాల త్రికోణంలో వేడి ఒక అంశం కాబట్టి కార్చిచ్చులు పుట్టటంలో ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ వేడికి నేల మీది కర్రలు, చెట్లు, పొదలు ఎండిపోయి, మంచి ఇంధనాలుగా మారతాయి. వాతావరణం మరింత వేడెక్కినప్పుడు ఇవి రాజుకొని, త్వరగా మండుతాయి. కార్చిచ్చు త్వరగా విస్తరించటానికి దోహదం చేస్తాయి. అందుకే చాలావరకూ కార్చిచ్చులు మధ్యాహ్నం వేళ పుట్టుకొస్తుంటాయి. దావానలం తీరు మీద గాలులు గణనీయ ప్రభావం చూపుతాయి. వీటిని అంచనా వేయటమూ కష్టమే. గాలితో మంటలకు అదనపు ఆక్సిజన్‌ అందుతుంది. దీంతో మరింత విజృంభిస్తాయి, వేగంగా చుట్టుపక్కలకు విస్తరిస్తాయి. మరోవైపు జ్వాలలు సైతం తమదైన వాతావరణాన్ని ఏర్పరచు కుంటాయి కూడా. ఇది గాలి తీరుతెన్నులనూ మారుస్తుంది. వేడి ప్రభావంతో గాలి వడిగా తిరుగుతూ మంట సుడిగాలులు (ఫైర్‌ విర్ల్స్‌) పుట్టుకొస్తాయి. ఇవి మండే కొమ్మలు, నుసిని చాలా దూరాలకూ మోసుకెళ్తాయి. చెట్ల మీద లేచే మంటల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. గాలి వేగం పెరిగినకొద్దీ మంటల వ్యాప్తీ ఎక్కువవుతుంది. ఇవి సృష్టించుకునే గాలి చుట్టుపక్కల గాలి కన్నా 10 రెట్లు ఎక్కువ వేగం కలిగుంటాయి. దీని ప్రభావంతో గాల్లోకి ఎగిసే బూడిద, నుసి వంటివి మరిన్ని మంటలకూ కారణమవుతాయి. గాలులు మంట దిశనూ మార్చగలవు. చెట్ల మీదికీ వ్యాపింపజేయగలవు. మరోవైపు గాల్లోని తేమ మంటలను, వాటి తీవ్రతను తగ్గించటానికి ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే తేమ మంటల వేడిని శోషించుకుంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంధనం తక్కువగా పొడిబారుతుంది. అందువల్ల త్వరగా రాజు కోదు. అదే తేమ తగ్గి నప్పుడు గాల్లో నీటి ఆవిరి మోతాదు తక్కువగా ఉంటుంది. కార్చిచ్చులకు ఇది అనువువైన పరిస్థితిని కల్పిస్తుంది. కాబట్టే మంటల నివారణకు వాన బాగా ఉపయోగపడుతుంది. గాలిలో తేమ సంతృప్త స్థాయికి చేరుకున్నప్పుడు అది వాన రూపంలో కురుస్తుంది కదా. దీంతో ఇంధనంలో తేమ శాతం పెరుగుతుంది. కార్చిచ్చులు రేగకుండా అణచి వేస్తుంది.
నైసర్గిక స్వరూపం: చుట్టుపక్కల నేల తీరుతెన్నులూ కార్చిచ్చుల మీద ప్రభావం చూపుతాయి. ఇది ఇంధనం, వాతావరణం మాదిరిగా మారకపోయినప్పటికీ మంటలు ఉద్ధృతం కావటం, చల్లారటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వాలు గణనీయమై ప్రభావం చూపుతుంది. మనం కిందికి వేగంగా దిగుతాం గానీ మంటలు మాత్రం పైకి త్వరగా వ్యాపిస్తాయి. ఎంత వాలు ఎక్కువగా ఉంటే అంత వేగంగా విస్తరిస్తాయి. దీనికి కారణం చుట్టుపక్కల గాలి దిశ. సాధారణంగా గాలి పైకి ప్రయాణిస్తుంటుంది. మరోవైపు పొగ, వేడి ఎగువకు వ్యాపించటం వల్ల కొండల మీద ఇంధనం ఎండిపోవటం ఆరంభిస్తుంది. ఇది మంట రాజుకోవటానికి అనువైన వాతావరణం కల్పిస్తుంది. పర్వతాల మీద రేగిన మంటలు కిందికి అంతగా వ్యాపించవు. ఎందుకంటే వేడి పైకి పోవటం వల్ల కింద ఉండే ఇంధనాన్ని అంతగా ఎండిపోయేలా చేయదు. అయితే ఇందులో గాలి దిశ కూడా ముఖ్యమే. కొన్నిసార్లు బలమైన గాలులు మంటలు పైకి వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. దీంతో నెమ్మదిగా ఎగువకు విస్తరిస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని