Irradiation: పదార్థాలు చెడకుండా..

ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి.

Updated : 29 May 2024 08:16 IST

ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి. అతి శీతల వాతా వరణంలో భద్ర పరచటం, పాలను పాశ్చరైజ్‌ చేయటం తెలిసిందే. వీటి కోవకు చెందిన మరో ప్రక్రియ ఇరేడియేషన్‌. ఇటీవల మనదేశం ఉల్లిగడ్డలు త్వరగా కుళ్లిపోకుండా ఈ ప్రక్రియను వాడాలని నిర్ణయించింది. ఇంతకీ ఇరేడియేషన్‌ అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది?

రేడియేషన్‌ అంటే ఆహార పదార్థాలను అయోనైజింగ్‌ రేడియేషన్‌ ప్రభావానికి గురిచేయటం. దీంతో పదార్థాలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. ఇదేమీ కొత్త పద్ధతి కాదు. మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలను ఎండలో ఎండించి, నిల్వ చేయటం అనాదిగా ఉన్నదే. ఇదీ ఒకరకం రేడియేషన్‌ పద్ధతే. అయోనైజింగ్‌ రేడియేషన్‌ విధానంతో ఆహార పదార్థాలను నిల్వ చేయటం వందేళ్ల క్రితమే.. 1920ల్లోనే మొదలైంది. అనంతరం 1950ల్లో అమెరికా సైన్యం ఆహారం ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండటానికి స్వల్ప, అధిక మోతాదు ఇరేడియేషన్‌తో ప్రయోగాలు నిర్వహించింది. ఇప్పుడు ఈ ప్రక్రియ వాడకానికి 40 దేశాలు అనుమతించాయి. ఇరేడియేషన్‌తో పదార్థాలు రేడియోధార్మికతకు గురవుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ ఇది చాలా సురక్షితం. వండటం వంటి ఇతర నిల్వ పద్ధతుల్లో వెలువడే రసాయనాలే ఇరేడియేషన్‌ ప్రక్రియలో వెలువడతాయి. నిర్ణీత మోతాదులో ఇరేడియేట్‌ చేసిన పదార్థాలు తినటానికి సురక్షితమైనవేనని, పోషకాలేవీ పోవని ప్రముఖ సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియతో హానికర బ్యాక్టీరియా ఏమీ ఉద్ధృతం కాదని తేలింది. పచ్చి మాంసంలో ఇ-కొలి వంటి హానికర బ్యాక్టీరియా నిర్మూలనకు దీన్ని మించిన పద్ధతి లేదనీ బయటపడింది. అందువల్ల ఆహార పదార్థాలు కుళ్లిపోవటంతో పుట్టుకొచ్చే జబ్బులను తగ్గించటానికిది బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఎలా చేస్తారు?

గామా కిరణాలు లేదా అత్యధిక శక్తితో కూడిన ఎలక్ట్రాన్‌ పుంజం లేదా శక్తిమంతమైన ఎక్స్‌రేలను ఆహార పదార్థాల మీద పడేలా చేయటం ఇరేడియేషన్‌ ప్రక్రియలో కీలకాంశం. పదార్థంలోని అన్ని భాగాలకూ కనీస మోతాదు రేడియేషన్‌ అందేలా చూడటం ప్రధాన లక్ష్యం. ఎలక్ట్రాన్‌ బీమ్, ఎక్స్‌రే టెక్నాలజీతో కూడిన ఇరేడియేషన్‌ ప్రక్రియలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. యాక్సిలరేటర్‌ వ్యవస్థ నుంచి అత్యధిక శక్తితో కూడిన ఎలక్ట్రాన్‌ పుంజం పుట్టుకొస్తుంది. ఇది అయస్కాంత పుంజం స్కానర్‌ సాయంతో పదార్థం గుండా సమానంగా ప్రసరిస్తుంది. నేరుగా ఎలక్ట్రాన్‌ ఇరేడియేషన్‌ కోసం పలుచటి ఎక్జిట్‌ విండో(టీఐ)ను ఉపయోగిస్తారు. హై-జడ్‌ కన్వర్టర్‌తో ఎక్స్‌రేలను సృష్టిస్తారు. పదార్థాన్ని కచ్చితంగా నియంత్రిస్తూ స్కాన్డ్‌ పుంజం నుంచి గుండా వెళ్లేలా చేస్తారు. మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పదార్థం నుంచి మైక్రో తరంగాలు వెళ్లినట్టుగానే ఈ కిరణాలు ప్రసరిస్తాయి. కానీ పదార్థం పెద్దగా వేడి కాదు. గామా కిరణాల ప్రభావంతో పదార్థం రేడియో ధార్మికతకు గురికాదు. ఎలక్ట్రాన్‌ పుంజాలు, ఎక్స్‌రేలు విద్యుత్తు సాయంతో పుట్టుకొస్తాయి. వీటిని ఆన్, ఆఫ్‌ చేయొచ్చు. వీటికి రేడియోధార్మిక పదార్థాలు అవసరం లేదు. ఇరేడియేషన్‌ మూలంగా పదార్థాలు కుళ్లిపోయేలా చేసే కీటకాలు, శిలీంద్రాలు, బ్యాక్టీరియా, కొన్ని విషపూరిత బ్యాక్టీరియా చనిపోతాయి. అయితే ఈ ప్రక్రియ వైరస్‌లను చంపలేదు. 

పదార్థాల మీద ప్రభావం

పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి కొన్ని పదార్థాలను ఇరేడియేషన్‌ చేయటం కుదరదు. ఎందుకంటే ఇరేడియేషన్‌తో వీటి రుచి, ఆకారం మారతాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాల పదార్థాలు, మసాలాలు, మాంసం వంటి వాటిని ఇరేడియేట్‌ చేయొచ్చు. దీంతో పదార్థాల రసాయన స్వభావం పెద్దగా ఏమీ మారదు. అయితే ఇది బి విటమిన్ల మీద కొంతవరకు ప్రభావం చూపుతుంది కాబట్టి కొన్ని పదార్థాల్లో పోషకాల మోతాదులు తగ్గొచ్చు. ఈ నష్టం కూడా వండినప్పుడు లేదా సంప్రదాయ పద్ధతిలో నిల్వ చేసినప్పుడు తగ్గేంత స్థాయిలోనే ఉంటుంది.

ఏంటీ ప్రయోజనాలు

ఇరేడియేషన్‌తో చాలా ప్రయోజనాలే ఉంటాయి.

  • పదార్థాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి.
  • వ్యర్థం కావటం తగ్గుతుంది.
  • క్యాంపిలోబ్యాక్టర్, సాల్మొనెల్లా, ఇ.కొలి, లిస్టీరియా వంటి సూక్ష్మక్రిములతో (ఇవి ముఖ్యంగా మాంసాహారంలో ఉంటాయి) వ్యాపించే జబ్బుల ముప్పు తగ్గుతుంది.
  • పురుగుమందులు వాడాల్సిన అవసరం తగ్గుతుంది.
  • నిల్వ కారకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి అడిటివ్స్‌ అంతగా కలపాల్సిన అవసరముండదు.
  • ఆహార పదార్థాల్లో కనిపించకుండా ఉండే కీటకాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపించటం తగ్గుముఖం పడుతుంది.
  • కొన్నిరకాల బ్యాక్టీరియాను చంపటానికి విషపూరిత రసాయనాలతో శుద్ధి చేసే అవసరం తప్పుతుంది.
  • దిగుమతి చేసుకున్న పండ్లు, ధాన్యాలు, కూరగాయలను క్రిమిరహితం చేయటానికి ప్రస్తుతం ఓజోన్‌ను తగ్గించే వాయువులతో శుద్ధి చేస్తున్నారు. ఇరేడియేషన్‌తో ఇలాంటి వాయువుల వినియోగం తగ్గుతుంది.
  • బంగాళాదుంపలు, ఉల్లిగడ్డల వంటివి మొలకెత్తటం తగ్గుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు