NPDCL CMD Varun Reddy: సెల్‌ఫోన్‌లోనే కరెంటు మీటర్‌ రీడింగ్‌

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కొత్త కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు
తొలుత పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల్లో ఏర్పాటు
పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణతో నష్టాలను తగ్గిస్తాం
‘ఈనాడు’తో ఉత్తర డిస్కం సీఎండీ వరుణ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌లోనే కరెంటు మీటర్‌ రీడింగ్‌ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని... నెలవారీ బిల్లు పెరగకుండా పొదుపు పాటించడానికి అవకాశం ఏర్పడుతుందని ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించి... ‘సరఫరా, పంపిణీ’(టీడీ)లో నష్టాలను తగ్గించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్‌ సంస్థల పనితీరు, పంపిణీ వ్యవస్థలో సమస్యలు, ప్రభుత్వపరంగా చేపడుతున్న సంస్కరణలు తదితర అంశాలను ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

‘పీఎం సూర్యఘర్‌’ పథకంలో తెలంగాణ వెనుకబడటానికి ఇళ్లపై సౌరవిద్యుత్‌ ఏర్పాటును డిస్కంలు ప్రోత్సహించకపోవడమే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి...?

ఇందులో వాస్తవం లేదు. రాష్ట్రంలోని గృహావసర  కనెక్షన్లలో 80% వరకు నెలకు 200 యూనిట్లలోపే కరెంటు వినియోగిస్తున్నారు. ఈ వినియోగదారుల్లో ఎక్కువ మంది గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ పొందుతున్నారు. రూ.లక్ష వరకు ఖర్చుతో రూఫ్‌టాప్‌ సోలార్‌ పలకల ఏర్పాటుకు వీరు విముఖత చూపుతున్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేసుకుంటే రాయితీ వస్తుందని, కరెంటు బిల్లు తగ్గుతుందంటూ గృహజ్యోతి పరిధిలో లేని వినియోగదారులకు సెల్‌ఫోన్‌ సందేశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి కనబరిచేవారికి ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుకు సహకరిస్తున్నాం.

ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని గతంలో ఈఆర్‌సీ ఆదేశించింది. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు...?

పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కేటగిరీల్లో కరెంటు వినియోగం భారీగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం వాటికి ఇచ్చే కొత్త కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును తప్పనిసరి చేశాం. ఈ మీటర్లలోనే ప్రీపెయిడ్‌ ఆప్షన్‌ ఉంటుంది. గృహావసరాలకు దశలవారీగా ఏర్పాటు చేస్తాం. ప్రీపెయిడ్‌ మీటర్లతో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు పలు రాష్ట్రాల విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. రీఛార్జి సొమ్ము వరకు కరెంటు వాడుకున్న తర్వాత సరఫరా నిలిచిపోతుంది. తిరిగి రీఛార్జి చేసుకున్నాకే సరఫరా ప్రారంభమవుతుంది. ఇలాంటి సాంకేతిక సమస్యలను పరిశీలించి... ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. నెలకు 500 యూనిట్లకుపైగా వినియోగించుకునేవారు కోరితే ఏర్పాటు చేస్తాం.

కాలం చెల్లిన పరికరాలు, సామగ్రి వల్లనే విద్యుత్‌ పంపిణీలో 10 శాతానికిపైగా నష్టాలు వస్తున్నాయన్నది నిజమా...?

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పరికరాలు, సామగ్రి మార్చేయడం సాధ్యం కాదు. ఒకే ఫీడర్‌లో మొత్తం పరికరాలు, సామగ్రి మార్చాలంటే 10-15 సార్లు కొన్ని గంటలసేపు సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు ఈ ఏడాది రెండు డిస్కంల పరిధిలో రూ.4 వేల కోట్ల వరకు వెచ్చించాలనే ప్రణాళికలున్నాయి. ఉత్తర డిస్కం పరిధిలో రూ.450 కోట్లతో పనులు చేపడుతున్నాం.

ఉత్తర డిస్కం పరిధిలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయెందుకు?

బొగ్గు ధరలు పెరుగుతుండటంతో కరెంటు కొనుగోలు వ్యయం అధికంగా ఉంది. పంపిణీ, సరఫరాలో నష్టాలను గణనీయంగా తగ్గించడానికి పెద్దఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నాం. సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను, లైన్లను పరిశీలిస్తున్నాను. ఏదైనా ఫీడర్‌ పరిధిలో బిల్లులు, రీడింగ్‌లో తేడాలు అధికంగా ఉంటే ఇంజినీర్లను తనిఖీలకు పంపుతున్నాను. 

కొత్త డిస్కం ఏర్పాటుతో ప్రయోజనాలేంటి?

రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా, ఎత్తిపోతల పథకాలు వంటివి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మూడో డిస్కం ఏర్పాటుతో ప్రస్తుతమున్న రెండు డిస్కంలకు నష్టాలు తగ్గి.. ఆర్థికంగా మేలు జరుగుతుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని