Pathipaka Mohan: పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ కవి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు సంపాదకుడు, సిరిసిల్ల వాసి డా.పత్తిపాక మోహన్‌.. ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన యువ కవి, తెలుగు ఉపాధ్యాయుడు పళ్లిపట్టు నాగరాజు కేంద్ర సాహిత్య అకాడమీ-2022 బాల, యువ పురస్కారాలకు ఎంపికయ్యారు.

Updated : 25 Aug 2022 04:48 IST

 ‘బాలల తాతా బాపూజీ’ కవితా సంకలనానికి బాల పురస్కారం

పళ్లిపట్టు నాగరాజుకు యువ పురస్కారం

ఈనాడు, దిల్లీ: ప్రముఖ కవి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు సంపాదకుడు, సిరిసిల్ల వాసి డా.పత్తిపాక మోహన్‌.. ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన యువ కవి, తెలుగు ఉపాధ్యాయుడు పళ్లిపట్టు నాగరాజు కేంద్ర సాహిత్య అకాడమీ-2022 బాల, యువ పురస్కారాలకు ఎంపికయ్యారు. మోహన్‌ ‘‘బాలల తాతా బాపూజీ’’, నాగరాజు ‘‘యాలై పూడ్సింది’’ కవితా సంకలనాలను అకాడమీ అవార్డులు వరించాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వెలువడిన కవితా సంపుటాలు, చిట్టికథలు, నవలలు, వ్యాస సంపుటాలు, వ్యంగ్య రచనలకు అకాడమీ 2022కి బాల, యువ పురస్కారాలను ప్రకటించింది. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబారా నేతృత్వంలో దిల్లీలో బుధవారం సమావేశమైన సభ్యులు.. 22 భాషలకు సంబంధించి జ్యూరీ ఎంపిక చేసిన రచనలకు పురస్కారాలను ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన కవులు/రచయితలకు నవంబరు 14న దిల్లీలో నిర్వహించే వేడుకలో రూ.50వేల చెక్కు, తామ్ర ఫలకం అందజేస్తారు.

ఎన్నెన్నో సంకలనాలకు వన్నెలు..

పిల్లల కోసం మన కవులు, సహస్ర భాగవత సప్తాహదీప్తి, చందమామ రావె, వెన్నముద్దలు, ఆకుపచ్చని పాట, ఒక్కేసి పువ్వేసి చందమామ, అఆ ఇఈ తదితర కథలతో పాటు.. 14 బాల సాహిత్య సంకలనాలు, 28 బాలసాహిత్య అనువాదాలు, ఖడ్గధార, సముద్రం తదితర రచనలు సహా పలు సంకలనాలకు మోహన్‌ సంపాదకత్వం వహించారు. సిరిసిల్లకు చెందిన మోహన్‌ 1972, జనవరి 5న చందుర్తి మండలం లింగంపేటలో గంగాబాయి, లక్ష్మీరాజం దంపతులకు జన్మించారు. వీరిది చేనేత కుటుంబం. ఈ నేపథ్యంలోనే కవిత్వం రాశారు. ఈయనకు తొలి గురువు ఆచలయోగి, తాత పత్తిపాక శంకరయ్య ప్రభావం తొలి నుంచీ ఉంది. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. ‘తెలుగులో గజల్‌ ప్రక్రియ-సమగ్ర పరిశీలన’ పేరుతో ఆ పంథాలో తొలి పరిశోధన చేశారు. మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా సాహితీ సేవ చేశారు. 1997లోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మొదటి యువ విశిష్ట సాహిత్య పురస్కారంతో పాటు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాహిత్య పురస్కారం-2017 వంటి అవార్డులను అందుకున్నారు. 2022 కేంద్ర సాహిత్య బాల పురస్కారం పోటీలో పలువురు ప్రముఖుల రచనలు నిలిచినా జ్యూరీ ఏకగ్రీవంగా ‘‘బాలల తాతా బాపూజీ’’ని ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా బెలగం భీమేశ్వరరావు, డాక్టర్‌ ఎన్‌.గోపి, చొక్కాపు వెంకటరమణ వ్యవహరించారు. మోహన్‌ సతీమణి సిరిసిల్ల చందన ఎస్‌సీఈఆర్‌టీలో హిందీ భాషా నిపుణురాలిగా ఉన్నారు.

రాష్ట్రానికి గర్వకారణం: సీఎం కేసీఆర్‌

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి మోహన్‌ ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి గర్వకారణమన్నారు. గాంధీజీపై రాసిన బాల సాహిత్యానికి తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం, స్వతంత్ర భారత   వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు. కీర్తిశేషులు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి శిష్యుడైన మోహన్‌.. సాహితీ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణకు వన్నె తేవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.


‘‘జోతలివే అందుకొనుము గాంధీతాత

భరతజాతికంతటికి స్ఫూర్తిప్రదాత

శిరమెత్తిన స్వేచ్ఛకు నీ పిలక ప్రతీక

నీ బోసినవ్వే కదా భరతజాతి జ్ఞాపిక

సబర్మతి మౌనివి.. సహకార జ్యోతివి

శాంతియుద్ధ వీరునివి, సత్యధర్మ మార్గానివి’’... అంటూ మహాత్ముడిని వర్ణిస్తూ పత్తిపాక మోహన్‌ బాలల కోసం గుదిగుచ్చిన కవితా సంకలనమే ‘‘బాలల తాతా బాపూజీ’’. రెండు భాగాలు కలిగిన ఈ పుస్తకంలో తొలి భాగం గాంధీ గేయాలతో, రెండోది గాంధీ గేయ కథతో ఉంటుంది. చిరుప్రాయంలో గాంధీ చూపిన గాంధేయవాదం, ఆయన తత్వం, వ్యక్తిత్వం, జాతీయోద్యమాన్ని మహాత్ముడు ముందుండి నడిపిన తీరును పిల్లల మనసుకు హత్తుకునేలా మోహన్‌ రచించారు.


నాయకులను నిలదీసేలా...

‘‘యాలై పూడుస్తా ఉంది.. ఎంతకాలమీ ఏగులాట...

కొన్నాలికలో బెల్లం పూసుకొని... అంగిట్లో విషం బెట్టుకొని

భలే మాట్లాడుతుండారు కదబ్బ... భలే బెలిపిస్తుండారు కదయ్యా..

కాళ్లు తిమ్మిరెక్కేలా పిల్లకాయలను కూచోబెట్టి నీతి కోతలు కోస్తా ఉండారే...

ఇంగిలీసోడు ఎలబారి ఏళ్లు గడిచినా దుమ్మెత్తి పోస్తున్నారేగానీ...

దేశంలోపల దొరల సంగతేంది.. దేశం వదిలిపోతున్న దొంగల సంగతేంది

సెలవిస్తారా స్వామి’’.. అంటూ నాయకులను నిలదీసేలా ‘యాలై పూడ్సింది’ కవిత సాగుతుంది. దేశ కాలమాన పరిస్థితులను కళ్లకు కడుతూ 56 కవితలతో ఈ సంకలనాన్ని పళ్లిపట్టు నాగరాజు 2020  డిసెంబరులో వెలువరించారు. అది ఆయన తొలి వచన కవితా సంపుటి.

తెలుగు చదివి.. వెలుగులీని

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రంగనాథపురం మిట్టిండ్లు గ్రామంలో 1987, మే 22న నాగరాజు జన్మించారు. తల్లిదండ్రులు భూలక్ష్మి, రాఘవయ్య. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ(తెలుగు) చదివిన నాగరాజు 2016లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలం 64 పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధిస్తున్నారు. రెక్కలు(మినీ కవితలు), మమ్మీ అమ్మ కావాలి, మనసుపొరల్లో వంటి కథలు, పలు కవితలను ఆయన రాశారు. నాగరాజు కవితలు కన్నడ, ఆంగ్లభాషల్లోకి ఎక్కువగా అనువాదమయ్యాయి. కవిగా ఆయన కలహంస పురస్కారం, డాక్టర్‌ రాధేయ కవితా పురస్కారం, వింజమూరి-కవిసంధ్య కవితల పోటీ పురస్కారం, తెలుగు సాహిత్య సంస్కృతి సమితి పురస్కారం, తెలుగు రక్షణవేదిక భాషా సేవక పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. 2022 కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి అనేక రచనలు పోటీ పడినా జ్యూరీ ఏకగీవ్రంగా ‘యాలై పూడ్సింది’ని ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, డా.పెన్నా శివరామకృష్ణ వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని