వ్యవసాయ ఆత్మనిర్భరతకు ‘సహకారం’

ప్రభుత్వాలదే. సేద్యంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధరలు దక్కేలా చేయడం ద్వారా కర్షకులకు తోడ్పాటు అందించాలి. వ్యవసాయ రంగంలో సరఫరా గొలుసు వ్యయాల్ని తగ్గించేందుకు సంస్థాగతమైన మద్దతు కల్పించాలి.

Published : 23 Apr 2024 01:13 IST

రైతుల్ని సాగు కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత

ప్రభుత్వాలదే. సేద్యంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధరలు దక్కేలా చేయడం ద్వారా కర్షకులకు తోడ్పాటు అందించాలి. వ్యవసాయ రంగంలో సరఫరా గొలుసు వ్యయాల్ని తగ్గించేందుకు సంస్థాగతమైన మద్దతు కల్పించాలి. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యవసాయ సహకార వ్యవస్థకు పునరుత్తేజం కల్పిస్తామంటోంది.

వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భరతను సాధించడంలో సహకార రంగానిది కీలక పాత్ర. సేద్యానికి తోడ్పాటు అందించే ప్రక్రియలో భాగంగా సహకార మంత్రిత్వ శాఖకు కేంద్ర ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఎగుమతులు, సేంద్రియ సేద్యం, విత్తనాలకు సంబంధించి జాతీయ స్థాయి బహుళ రాష్ట్రాల సహకార సంస్థలు తోడ్పాటు అందిస్తాయి. జాతీయ సహకార ఎగుమతుల సంస్థ (ఎన్‌సీఈఎల్‌), జాతీయ సహకార సేంద్రియసేద్య సంస్థ (ఎన్‌సీఓఎల్‌), భారతీయ విత్తన సహకార సంస్థ (బీబీఎస్‌ఎస్‌ఎల్‌)లు వ్యవసాయ రంగంలో నెలకొన్న ఎన్నో సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని లక్షిస్తున్నారు.

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

జాతీయ సహకార ఎగుమతుల సంస్థ(ఎన్‌సీఈఎల్‌) సహకార, తదితర సంస్థల వస్తుసేవలను నేరుగా ఎగుమతులు చేసే బాధ్యతల్ని చేపడుతుంది. సహకార రంగంలో మిగులు వస్తుసేవల ఎగుమతులకు తోడ్పడటం ద్వారా భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిస్తుంది. సంస్థ తోడ్పాటుతో ఎగుమతులు అధికమై, వివిధ స్థాయుల్లోని సహకార సంస్థల వస్తుసేవల మధ్య అనుసంధానత పెరిగి ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు సమకూరుతాయి. జాతీయ సహకార సేంద్రియసేద్య సంస్థ (ఎన్‌సీఓఎల్‌) దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. సేంద్రియ ఉత్పత్తులు పెరిగేందుకు దోహదపడుతుంది. సహకార సంఘాల ద్వారా సేంద్రియ పంటల సాగుదారులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రభుత్వ పథకాలు, విభాగాల సహాయంతో సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించిన అభివృద్ధి, ప్రోత్సాహక కార్యకలాపాలను చేపడుతుంది. వివిధ కార్యక్రమాలు, సంస్థల కింద సేంద్రియ పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేస్తుంది. సేంద్రియ పంటలకు ధ్రువీకరణ పత్రాల జారీ, పరీక్షల నిర్వహణ, ఉత్పత్తుల సేకరణ, నిల్వ, శుద్ధి వంటి వసతులను అందిస్తుంది. సేంద్రియ ఉత్పత్తులకు బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, బట్వాడా, మార్కెటింగ్‌ సౌకర్యాలను సమకూరుస్తుంది. ఈ ప్రక్రియలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌), రైతు ఉత్పత్తి సంఘాలను భాగస్వాములుగా చేసుకుంటుంది. వివిధ స్థాయుల్లోని సహకార సంఘాలకు చెందిన అధీకృత, ధ్రువీకృత సేంద్రియ ఉత్పత్తులను విపణిలోకి తీసుకెళ్తుంది. ప్రపంచ సేంద్రియ విపణి రూ.10లక్షల కోట్ల మేర ఉండగా, భారత సేంద్రియసాగు ఉత్పత్తుల ఎగుమతులు రూ.7000కోట్లకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో ప్రతి జిల్లాలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షలను చేపట్టేందుకు ప్రయోగశాలలు ఏర్పాటుకు సంకల్పిస్తోంది.

భారతీయ విత్తన సహకార సంస్థ (బీబీఎస్‌ఎస్‌ఎల్‌) సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే దిశగా కృషిచేస్తుంది. సహకార సంస్థల నెట్‌వర్క్‌ ద్వారా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీ దీని బాధ్యత. స్వదేశీ వంగడాలను సంరక్షించడం ద్వారా విదేశీ విత్తనాలపై ఆధార పడాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది. దిగుబడులను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషిచేస్తుంది. ఇది భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాకారం చేయడంలో కీలక ముందడుగు అవుతుంది. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తివల్ల దేశంలో దిగుబడులు పెరిగి వ్యవసాయ, సహకార రంగాల్లో ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయి. బీబీఎస్‌ఎస్‌ఎల్‌ ఆధునిక, సంప్రదాయ రీతుల్లో విత్తనాల పరిశోధన, ఉత్పత్తి ప్రక్రియలను చేపడుతుంది. సహకార రంగం ద్వారా విత్తన శుద్ధి, మార్కెటింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. వచ్చే అయిదేళ్లలో పదివేల కోట్ల టర్నోవర్‌ను సాధించాలని, సహకార సంస్థల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని పెంచాలనేది దీని లక్ష్యం. ఈ మూడు సంస్థలు పీఏసీఎస్‌ల ద్వారా కర్షకుల అభ్యున్నతికి తోడ్పడతాయి. రైతులు తమ ఉత్పత్తులకు గరిష్ఠ విలువను పొందడంవల్ల వ్యవసాయ సహకార సంఘాలు బలోపేతమవుతాయి. వ్యవసాయ, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని భావిస్తున్నారు. జిల్లా నుంచి జాతీయస్థాయి దాకా వివిధ స్థాయుల్లోని సహకార సంఘాలన్నీ ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చు.

కర్షకులకు ప్రయోజనం

అదనంగా ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల స్థాయి నుంచే కృషి జరగాలని భావిస్తున్నారు. పీఏసీఎస్‌లను బహుళార్థ సాధక సంఘాలుగా తీర్చిదిద్దడానికి పలురకాల చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించిన నిబంధనావళిని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఆయా రాష్ట్రాల సహకార చట్టాల కింద వ్యవసాయ సహకార సంఘాలు 25 రకాల వ్యాపార కార్యకలాపాలను చేపట్టడానికి అవసరమైన భూమికను నెలకొల్పుతారు. దేశంలో 63,000 పీఏసీఎస్‌లను జాతీయ సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్కు ద్వారా కంప్యూటరీకరిస్తారు. గ్రామ పంచాయతీలన్నింటికీ బహుళార్థ సాధక పీఏసీఎస్‌లు, పాడి, మత్స్య సహకార సంఘాలను సమకూరుస్తున్నారు. రానున్న అయిదేళ్లలో అన్ని గ్రామ పంచాయతీలలో మొత్తం రెండు లక్షల సరికొత్త బహుళార్థ సాధక పీఏసీఎస్‌లు, పాడి, మత్స్య సహకార సంఘాలను నెలకొల్పాలని లక్షిస్తున్నారు. ఆహార భద్రత కోసం భారీస్థాయిలో ధాన్యం నిల్వలను చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం వ్యవసాయ సహకార సంఘాలు ఉమ్మడి సేవా కేంద్రాలుగా పనిచేయనున్నాయి. పీఏసీఎస్‌ల ద్వారా కొత్తగా రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. పెట్రోలు, డీజిల్‌ బంకుల ఏర్పాటులో వీటికి ప్రాధాన్యం కల్పిస్తారు. వీటిని ఎరువుల పంపిణీ కోసం ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. తక్కువ వడ్డీరేట్లతో రుణాలు పొందేలా రూపే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను సహకార సంఘాల సభ్యులకు అందజేస్తారు. రైతులకు సౌర వ్యవసాయ పంపులను అందిస్తారు. ఈ తరహా చర్యలన్నింటి ద్వారా వ్యవసాయ రంగానికి ఇతోధిక తోడ్పాటు దక్కుతుంది.


జాతీయ విధానం రూపకల్పన...

హకార వ్యవస్థ నుంచి సమృద్ధి విధానం ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆధునికీకరణ, పారదర్శకత, పోటీతత్వం పెంచడం ద్వారా సహకార సంఘాలను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ కింద ప్రత్యేకంగా సహకార విభాగాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం- సహకార ఉద్యమాన్ని పటిష్ఠ పరచేందుకు జాతీయ విధానాన్ని రూపొందించింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.