భూగర్భ శోకం

భారత్‌లో సాగు, తాగునీటి అవసరాల్లో భూగర్భ జలవనరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. విచ్చలవిడి వినియోగంతో అవి క్రమంగా తరిగిపోతున్నాయి.

Published : 29 Nov 2022 00:38 IST

భారత్‌లో సాగు, తాగునీటి అవసరాల్లో భూగర్భ జలవనరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. విచ్చలవిడి వినియోగంతో అవి క్రమంగా తరిగిపోతున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి దాపురించే పరిస్థితులు నెలకొన్నాయి.

లచక్రంలో భూగర్భ జల వనరులను చాలా ముఖ్యమైనవిగా నిపుణులు భావిస్తారు. ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం, విశ్వవ్యాప్తంగా ఇండియాయే భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తోంది. మన దేశ అవసరాల్లో నీటిపారుదలలో 62శాతం, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో వరసగా 85శాతం,  50శాతానికి భూగర్భ జలాలే ఆధారం. కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) తాజాగా భూగర్భ జలవనరుల నివేదిక 2022ను విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో  భూగర్భ జల స్థాయులు 2020 కంటే స్వల్పంగా మెరుగయ్యాయి. అదే  సమయంలో చాలా ప్రాంతాల్లో వాటి విచ్చలవిడి వినియోగం పెరిగింది.

భారత్‌లో వార్షిక వెలికితీత, వినియోగం, పునరుద్ధరణ తదితర అంశాల ఆధారంగా భూగర్భ జలాల అంచనా సాగుతుంది. తాలూకాలు, బ్లాకులు, మండలాలు, ఫిర్కాలుగా భూగర్భ జల మదింపు విభాగాలు ఉంటాయి. 1980 నుంచి ఇప్పటిదాకా పది సార్లు భూగర్భ జలాల అంచనా జరిగింది. తాజాగా విడుదలైన నివేదిక భారత్‌లో మొత్తం వార్షిక భూగర్భ జలాల పునర్‌భర్తీ 43,760 కోట్ల ఘనపు మీటర్లుగా అంచనా వేసింది. 2020తో పోలిస్తే ఇది 1.45శాతం అధికం. అలాగే భూగర్భ జలాల వార్షిక వెలికితీత 2020 నాటి లెక్కల ప్రకారం 24,492 కోట్ల ఘనపు మీటర్లు. ఈ సంవత్సరం అది 23,916 కోట్ల ఘనపు మీటర్లకు తగ్గిందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 7086 మదింపు యూనిట్లలో 1006 చోట్ల భూగర్భ జలాలు విచ్చలవిడి వినియోగానికి గురయ్యాయని నివేదిక కుండ బద్దలుకొట్టింది. 260 ప్రాంతాల్లో 90 నుంచి 100 శాతం నీటిని తోడేశారు. హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌, దాద్రానగర్‌హవేలీ, డామన్‌ డయ్యూ వంటి చోట్ల భూగర్భ జలాల అతి వినియోగం గరిష్ఠ స్థాయిలో ఉంది. దిల్లీ, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, చండీగఢ్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో 60 శాతం నుంచి వంద శాతం వరకు తోడేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో అది 60 శాతం కంటే తక్కువ ఉంది.

దేశీయంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడేస్తున్నారు. ఫలితంగా అవి నానాటికీ అడుగంటి పోతున్నాయి. సాధారణంగా భూగర్భ జల సంక్షోభానికి మానవ చర్యలే ప్రధాన కారణం. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, సరైన నిర్వహణ లేమి, ప్రణాళిక లేని నీటి పారుదల కార్యకలాపాల విస్తరణ కారణంగా కొన్ని దశాబ్దాలుగా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్‌లో హరిత విప్లవానికి భూగర్భ జలవనరులే ప్రాణాధారంగా నిలిచాయి. అడవుల విధ్వంసం, మృత్తికా క్రమక్షయం, జలాశయాలు, చిత్తడి నేలల్లోకి నీటి ప్రవాహాల తగ్గుదల, అనావృష్టి తదితరాలు సైతం భూగర్భ జలాల పెరుగుదలను దెబ్బతీస్తున్నాయి.

దిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 భారతీయ నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని ప్రపంచ బ్యాంకు నివేదిక గతంలో వెల్లడించింది. ఈ క్రమంలో 2030 నాటికి దేశీయంగా 40శాతం జనాభా దుర్భర తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఎదుర్కొంటుందని ఆ నివేదిక హెచ్చరించింది. తాజాగా క్రియాశీలక భూగర్భ జల వనరుల నివేదిక సైతం అదే అంశాన్ని తేటతెల్లం చేసింది. కేంద్ర భూగర్భ జల మండలి రూపొందించిన నీటి నాణ్యత నివేదిక ప్రకారం దేశంలోని 20శాతం జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన ఆర్సెనిక్‌ అవశేషాలు ఉన్నాయి. చమురు వెలికితీత, మైనింగ్‌, ఉపరితల కాలుష్యం, వ్యవసాయంలో అధికంగా ఎరువులు, పురుగుమందుల వాడకం, చిత్తడి నేలల్లోకి, జలాశయాల్లోకి కలుషితాలు చేరడం వల్ల భూగర్భ జలాల నాణ్యత దెబ్బతింటోంది. దీన్ని నివారించడానికి పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. వ్యవసాయంలో విపరీతంగా పురుగు మందులు వాడకుండా ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం పెరగాలి. వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి వాటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జల వనరుల్లోకి కలుషితాలు చేరకుండా పాలకులు పటిష్ఠ చర్యలు తీసుకోవడమూ తప్పనిసరి. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం ముమ్మరించకుండా ఉండాలంటే- భూగర్భ జలాలను సమధికంగా పెంపొందించుకొని, వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం తప్పనిసరి.

గొడవర్తి శ్రీనివాసు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.