పుట్టి ముంచిన ఉల్లి ధరలు

దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార పక్షమైన పీపుల్‌ పవర్‌ పార్టీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు పాలక పక్షం పుట్టిముంచాయి.

Published : 19 Apr 2024 01:19 IST

దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార పక్షమైన పీపుల్‌ పవర్‌ పార్టీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు పాలక పక్షం పుట్టిముంచాయి. కానీ, అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేసే స్థాయిలో ప్రతిపక్షాలు సీట్లు సాధించలేదు.

క్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో మొత్తం 300 స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ కూటమి 192 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు యూన్‌ సాక్‌ యోల్‌కు చెందిన పీపుల్‌ పవర్‌ పార్టీ నేతృత్వంలోని అధికార కూటమి కేవలం 108 సీట్లతో సరిపెట్టుకుంది. వాస్తవానికి 254 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు. మిగతా 46 మందిని దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. 2022లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యూన్‌కు ఈ ఫలితాలు ఎదురుదెబ్బే. ఎన్నికలకు ముందు నిత్యావసరాల ధరల పెరుగుదలపై యూన్‌ చేసిన ప్రయోగం వికటించింది. సియోల్‌లో ఒక మాల్‌లో ఉల్లిపాయల ధరలు తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ ధరలు అందుబాటులోనే ఉన్నాయని ఆయన ప్రకటించారు. నిజానికి ఆ సమయంలో అక్కడ రాయితీ ధరల్లో ఉల్లి విక్రయిస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉల్లిపాయల ధరలు నాలుగింతలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని పట్టించుకోకుండా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ప్రజలు భగ్గుమన్నారు.

అనూహ్యమైన ఫలితాలతో దేశ ప్రధాని హాన్‌డూక్‌ రాజీనామా చేశారు. అయితే, అధ్యక్షుడు ఇంకా దానికి ఆమోదం తెలపలేదు. దక్షిణ కొరియాలో అధ్యక్షుడికి విస్తృతమైన అధికారాలు ఉన్నప్పటికీ, ప్రధాని రెండో స్థానంలో ఉంటారు. ప్రధానిగా అధికార పార్టీకి చెందినవారు ఉంటేనే పాలనా కార్యకలాపాలు సాఫీగా జరుగుతుంటాయి. ఫలితాలు యూన్‌ నేతృత్వంలోని పీపుల్‌ పవర్‌ పార్టీకి నిరాశాజనకంగా ఉన్నా- అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేసే 200 సూపర్‌ మెజారిటీని విపక్షాలు చేరుకోలేదు. విపక్షాల్లోని డెమొక్రాటిక్‌ పార్టీ, ఆర్కేపీ(రీ బిల్డింగ్‌ కొరియా పార్టీ) మధ్య సఖ్యత ఎన్నాళ్లు ఉంటుందన్నదీ పెద్ద ప్రశ్నే. ఈ పార్టీల అగ్రనేతలైన లీజే మయింగ్‌, చౌకిక్‌ల మోసం, అవినీతి కేసులు విచారణ దశలో ఉన్నాయి. దక్షిణకొరియాలో అవినీతిని అత్యంత హేయమైన నేరంగా పరిగణిస్తారు. దాయాది దేశం ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో జాతీయ అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడం రాబోయే కాలంలో యూన్‌కు సవాలే. గత రెండేళ్లుగా పార్లమెంటరీ ఎన్నికల నెపంతో పార్టీపై యూన్‌ పూర్తిగా ఆధిపత్యం చలాయించారు. ఇటీవలి ఫలితాల వల్ల సొంత రాజకీయపక్షం నుంచి యూన్‌కు ధిక్కార స్వరాలు వినిపించే అవకాశం ఉంది. వాణిజ్య అనుకూల విధానాలు, పన్ను సంస్కరణలపై ఇప్పటి వరకు ఆయన అనుసరిస్తున్న విధానాలకు పార్లమెంటు నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం లభించకపోవచ్చు. అధ్యక్ష తరహా పాలనలో విదేశాంగ విభాగంపై కార్యనిర్వాహక విభాగానికే తిరుగులేని అధికారం ఉంటుంది. కాబట్టి యూన్‌ ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశీ విధానాలే కొనసాగనున్నాయి. కొరియా ద్వీపకల్పంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో దేశభద్రతకు సంబంధించి అధ్యక్షుడి విధానాలతో విపక్షాలు ఏకీభవించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఉత్తరకొరియా, రష్యాల మధ్య పెరుగుతున్న సైనిక అనుబంధం, అమెరికా-చైనాల పోటీ, త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికలు దక్షిణ కొరియాకు ఇకపై కీలకంగా ప్రభావం చూపనున్నాయి. దక్షిణ కొరియా దాదాపు 90శాతానికి పైగా చమురును పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతకు ముందు రష్యా నుంచి జరుగుతున్న చమురు దిగుమతులను పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల దక్షిణ కొరియా తగ్గించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు కోసం ప్రత్యామ్నాయాలపై అధ్యక్షుడు దృష్టి సారించాల్సి ఉంది. ఆర్థికం, సాంకేతికం, రక్షణ రంగాల్లో ఇండియాతో దక్షిణ కొరియాకు కీలక భాగస్వామ్యం ఉంది. చైనాకు ప్రత్యామ్నాయంగా సాంకేతికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్న దిల్లీకి సియోల్‌ చేయూత ఎంతో అవసరం. రక్షణకు సంబంధించి ఇప్పటికే ‘కే9-వజ్ర’ శతఘ్నుల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశానికి దక్షిణ కొరియా అందించింది. ఈ శతఘ్నులను ప్రధానంగా ఎడారి ప్రాంతాల్లో శత్రువులపై పోరాటంలో వినియోగిస్తారు. అయితే, అతిశీతల ప్రాంతాల్లోనూ వాటి పనితీరు మెరుగ్గా ఉండటంతో చైనా సరిహద్దుల్లోనూ మోహరించారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల వల్ల దక్షిణ కొరియాలో పోనుపోను ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి!

 శ్రీధర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.