IPL 2024: ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!

పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. 

Updated : 01 May 2024 12:00 IST

ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఉన్నప్పటికీ కప్పు గెలవని జట్లు మూడు. అవే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌గా మారిన దిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్ కింగ్స్‌గా రూపాంతరం చెందిన కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్. ఐతే ఆర్సీబీ మినహా మిగతా రెండు జట్ల వైఫల్యం గురించి పెద్దగా చర్చ ఉండదు. సామాజిక మాధ్యమాల్లో వాటిని అభిమానులు అంతగా పట్టించుకోరు. కానీ బెంగళూరు వైఫల్యం గురించి ఎడతెగని చర్చ జరుగుతుంటుంది. ఆ జట్టు ఓడిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తుంది. మీమ్స్ మోత మోగుతుంది. ఈ సీజన్లోనూ ఆర్సీబీ పేలవ ప్రదర్శన చేస్తుండటం ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. భారీ అంచనాలున్న ఆటగాళ్లు కూడా బెంగళూరు జట్టులోకి వస్తే విఫలం కావడం.. ఇక్కడ్నుంచి వేరే జట్లకు వెళ్లిన ఆటగాళ్లు అదరగొట్టడం చూసి ఇదేం శాపం అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

కప్పు కొట్టలేదన్న మాటే కానీ.. ఆదరణ విషయంలో ఆర్సీబీకి తిరుగులేదు. ఐదేసి సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు దీటుగా ఆ జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతిసారీ ఆర్సీబీ మీద భారీ అంచనాలు నెలకొంటాయి. ఈసాలా కప్ నమదే అంటూ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ తీరా చూస్తే ఏదో ఒక దశలో నిష్క్రమించి టైటిల్‌కు దూరం కావడం మామూలే. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిన ఆర్సీబీ.. 2016 తర్వాత మూడు సీజన్ల పాటు గ్రూప్ దశ కూడా దాటలేదు. ఆ తర్వాత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరినా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. గత సీజన్లో మళ్లీ గ్రూప్ దశకే పరిమితం అయింది. ఈసారి కూడా కథ మారేలా లేదు. తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓడి దాదాపుగా ప్లేఆఫ్స్‌కు దూరమైన స్థితికి చేరుకుంది. తర్వాత రెండు విజయాలు సాధించినా లీగ్ దశ దాటే అవకాశాలు స్వల్పమే. ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్టార్ ఆటగాళ్లు ఈసారి ఆ జట్టు కొంప ముంచేశారు.

ఏదో చేస్తారనుకుంటే..

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా తరఫున గత ఏడాది అద్భుతంగా రాణించాడు. వన్డే ప్రపంచకప్‌లోనే కాక వేరే మ్యాచ్‌ల్లోనూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ ఆర్సీబీ తరఫున మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 5.33 సగటు, 94 స్ట్రైక్ రేట్‌తో 32 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ తరఫున మ్యాక్సీ ఎప్పుడూ నిలకడగా రాణించింది లేదు. ఒకప్పుడు పంజాబ్ తరఫున కొన్ని సీజన్లలో అతను నిలకడగా రాణించాడు. కానీ ఆర్సీబీకి వచ్చాక అతను అంచనాలను అందుకోలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో, వేరే లీగ్స్‌లో రాణిస్తూ ఐపీఎల్‌లో మాత్రం అతను నిరాశపరుస్తున్నాడు. ఇక ఈ సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన విల్ జాక్స్ సైతం నిరాశపరుస్తున్నాడు. అతను ఐపీఎల్‌కు రావడానికి ముందు బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. ఓ సెంచరీ కూడా చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించాడు. వేరే లీగ్స్‌లో కూడా అదరగొట్టాడు. వరుసగా ఓటములు చవిచూస్తున్న ఆర్సీబీ రాత మార్చేది అతడే అన్న చర్చ జరిగింది. కానీ లేటుగా లీగ్‌లోకి అడుగుపెట్టిన అతను.. అవకాశాలను అతను అందిపుచ్చుకోలేకపోయాడు. తొలి 4 మ్యాచ్‌ల్లో 76 పరుగులే చేసి 2 వికెట్లే పడగొట్టాడు. ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌ దారులు దాదాపుగా మూసుకుపోయాక గుజరాత్ మీద మెరుపు సెంచరీ సాధించాడు. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. మరోవైపు ముంబయి నుంచి ఆర్సీబీ ట్రేడ్ చేసుకున్న ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఈసారి తేలిపోయాడు. ముంబయి తరఫున ఓ మోస్తరు ప్రదర్శన చేసిన అతను.. ఆర్సీబీ తరఫున మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో 111 పరుగులే చేసి, 6 వికెట్లే తీశాడు. గ్రీన్‌ కోసం ఆర్సీబీ రూ.17.5 కోట్లు వెచ్చించడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో మంచి రికార్డున్న రీస్ టాప్లీ సైతం ఆర్సీబీ తరఫున విఫలమవుతున్నాడు. రెండు సీజన్లలో కలిపి 5 మ్యాచ్‌లాడిన టాప్లీ 5 వికెట్లు మాత్రమే తీశాడు.

ఇక్కడి నుంచి వెళ్తే సూపర్ హిట్

ఆర్సీబీ తరఫున విఫలమైన ఆటగాళ్లు వేరే జట్లకు వెళ్లి అదరగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి చాలా సీజన్ల పాటు ఆ జట్టుకే ఆడిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్.. బెంగళూరు జట్టులోకి వచ్చాక తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఆ జట్టు తరఫున 24 మ్యాచ్‌లు ఆడి 13.5 సగటుతో 250 పరుగులే చేశాడు. ఆర్సీబీ తరఫున అతను ఒక్క అర్ధశతకం కూడా సాధించలేదు. బౌలింగ్‌లో పర్వాలేదు 25 వికెట్లు తీశాడు. ఇదే ఆటగాడు తర్వాత చెన్నైకి మారి చివరి మూడు సీజన్లలో అదరగొట్టాడు. 43 మ్యాచ్‌ల్లో 30కి పైగా సగటుతో 1252 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. చెన్నై అతణ్ని ఓపెనర్‌గా ఆడించింది. బౌలింగ్‌లో పెద్దగా ఉపయోగించుకోలేదు. 2018 ఐపీఎల్ ఫైనల్లో సెంచరీతో జట్టుకు కప్పు అందించిన ఘనత వాట్సన్ సొంతం. ఇక ఇదే జట్టులో గత రెండు సీజన్ల నుంచి అదరగొడుతున్న శివమ్ దూబె కూడా ఒకప్పుడు ఆర్సీబీ ఆటగాడే. ఆ జట్టుకు 15 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన దూబె 169 పరుగులే చేసి, 4 వికెట్లే తీశాడు. కానీ చెన్నై తరఫున గత సీజన్లో 418 పరుగులు చేసిన అతను.. ఈ సీజన్లో 6 మ్యాచ్‌ల్లోనే 242 పరుగులు సాధించాడు. స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ సైతం ఆర్సీబీలో ఉండగా పెద్దగా రాణించింది లేదు. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ తరఫున కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. స్పిన్నర్‌గానూ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇంకా క్వింటన్ డికాక్, బ్రెండన్ మెక్‌కలమ్.. ఇలా చాలామంది ఆటగాళ్లు వేరే జట్ల తరఫున సత్తా చాటి బెంగళూరు తరఫున మాత్రం విఫలమైన వాళ్లే.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని