మళ్ళీ పోలియో కలకలం

భారత్‌ 2014లో పోలియోరహిత దేశంగా అవతరించింది. కొన్ని దేశాల్లో చాపకింద నీరులా పోలియో వ్యాప్తి చెందడం, అయిదేళ్ల లోపు పిల్లలు పూర్తిస్థాయిలో టీకాలు తీసుకోకపోవడం తదితర ఉదంతాలు చోటు చేసుకున్నాయి.

Published : 23 Apr 2024 01:12 IST

భారత్‌ 2014లో పోలియోరహిత దేశంగా అవతరించింది. కొన్ని దేశాల్లో చాపకింద నీరులా పోలియో వ్యాప్తి చెందడం, అయిదేళ్ల లోపు పిల్లలు పూర్తిస్థాయిలో టీకాలు తీసుకోకపోవడం తదితర ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ కమిటీ పోలియోను ‘ఆందోళనకర అత్యవసర ప్రజారోగ్య సమస్య’గా అభివర్ణించింది.

రికార్డుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పోలియో కనుమరుగైనా... 2023లో పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో పన్నెండు కేసులు నమోదయ్యాయి. ఆ దేశాల్లో ఇప్పటికీ పోలియో టీకా అంటే ప్రజలు విముఖత చూపుతున్నారు. పోలియో టీకాల కారణంగా తమ పిల్లలు సంతానరాహిత్యానికి లోనవుతారేమోనని అపోహపడుతున్నారు. పోలియో సిబ్బందిపై దాడులకూ తెగబడుతున్నారు. ఇవేకాకుండా, ఆ రెండు దేశాల్లో రాజకీయ అస్థిరత, వలసలు తదితర కారణాలతో ప్రజలు పోలియో టీకాలపై ఆసక్తి చూపడంలేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా పాకిస్థాన్‌ ఇటీవలే ఇంటింటికీ పోలియో టీకా అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది మొదలైన కొద్దిరోజులకే పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో పోలియో తీవ్రత అధికంగా ఉండే ప్రాంతానికి వెళ్తున్న ఆరోగ్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగింది. మరోవైపు, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో పోలియో వ్యాప్తిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పాక్‌లోని జాతీయ ఆరోగ్య సంస్థ వైరాలజీ విభాగం పరిశోధన పత్రం సూచించింది. లేకపోతే, రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు నమోదయ్యే ముప్పుందని హెచ్చరించింది. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో పోలియో వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించనంత వరకు, విశ్వవ్యాప్తంగా పోలియో వ్యాపించే ప్రమాదం పొంచి ఉంటుందని ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమం స్పష్టంచేసింది.

టీకాలపై విముఖత

ఆఫ్రికాలోని మలావీ దేశాన్ని 1992లోనే పోలియో రహిత దేశంగా ప్రకటించారు. 30 సంవత్సరాల తరవాత ఆ దేశంలో 2022లో పోలియో కేసు నమోదైంది. తరవాత మొజాంబిక్‌లోనూ పోలియో వ్యాధి నిర్ధారణ జరిగింది. దాంతో ఆఫ్రికా ఖండం మొత్తం ఉలిక్కిపడింది. ఆ దేశాలలో నమోదైన పోలియో కేసులో వైరస్‌ జన్యుక్రమం 2019లో పాకిస్థాన్‌లో నమోదైన వైరస్‌ తరహాకు చెందినదిగా గుర్తించారు. ఆఫ్రికా మలావీలోని చిన్నారి ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని తేలింది. ప్రభుత్వం సిఫారసు చేసిన టీకాల్లో కొన్నింటిని మాత్రమే తీసుకున్నట్లు తెలిపినా, ఆ చిన్నారికి సోకిన వైరస్‌ పాకిస్థాన్‌ నుంచి మలావీకి ఎలా చేరిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందని అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ దేశాలతో సరిహద్దులు పంచుకొనే భారత్‌ పోలియో వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది. మన దేశంలో పోలియో వ్యాధిపై తగిన పర్యవేక్షణ కొనసాగుతున్నా, పట్టణ ప్రాంతాల్లోని కొన్ని సామాజిక వర్గాల ప్రజలు టీకాలు వేయించుకునే విషయంలో వెనకంజ వేస్తున్నారు. విద్యావంతులైన తల్లిద్రండులు సైతం తమ పిల్లలకు సరైన సమయానికి టీకాలు వేయించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించేదే.

అవగాహన పెంపొందిస్తే...

ముప్పు తీవ్రత అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోని ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు, సంచార ప్రజల్లో పోలియో వంటి వ్యాధులు త్వరగా సంక్రమిస్తాయి. వీరికి టీకాలపై సరైన అవగాహన లేకపోవడం, భాష రాకపోవడం వల్ల టీకాలు వేసే ఆరోగ్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఆయా ప్రాంతాల్లోని స్థానిక అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ఆరోగ్య కార్యకర్తలకు అండగా నిలవాలి. పట్టణాల శివార్లలో నివసించే సంచార ప్రజలు తమ పిల్లలకు సంబంధించిన టీకాల నమోదు పట్టికలను తమ వద్ద ఉంచుకోరు. ఫలితంగా అలాంటి పిల్లలకు టీకాలు వేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య కార్యకర్తలు కోవిన్‌ యాప్‌ ద్వారా టీకాల వివరాలు నమోదుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా చేపట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలు, పట్టణాల్లో కొద్దికాలం నివసించి వెళ్ళిపోయే సంచార ప్రజల వివరాలు అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి కుటుంబాలకు చెందిన చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి జిల్లాలో తమ పరిధిలోని ముప్పు అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలకు టీకాలపై శాస్త్రీయ అవగాహన పెంపొందిస్తే పంపిణీ సులభతరం అవుతుంది. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో పోలియో కట్టడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో పోలియోరహిత దేశంగా కొనసాగేందుకు కృషి జరగాలి.

సిరిపురం శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.