నలభైల్లో పిల్లల్ని కనచ్చా?

నా వయసు 39 సంవత్సరాలు. పిల్లల్ని కనాలని ఉంది. కానీ, చాలామంది ఈ వయసులో పిల్లలేంటని నిరుత్సాహపరుస్తున్నారు. కొంతమంది నలభయ్యేళ్లలో కూడా పిల్లల్ని కనచ్చు.. ప్రయత్నించి చూడండని....

Published : 22 Apr 2023 12:33 IST

నా వయసు 39 సంవత్సరాలు. పిల్లల్ని కనాలని ఉంది. కానీ, చాలామంది ఈ వయసులో పిల్లలేంటని నిరుత్సాహపరుస్తున్నారు. కొంతమంది నలభయ్యేళ్లలో కూడా పిల్లల్ని కనచ్చు.. ప్రయత్నించి చూడండని సలహా ఇస్తున్నారు. అలాగే ఈ వయసులో పిల్లలు పుట్టినా వైకల్యం వస్తుందని భయపెడుతున్నవాళ్లూ ఉన్నారు. దయచేసి ఈ విషయంలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ వయసు 39 సంవత్సరాలని అంటున్నారు. ఈ వయసులో పిల్లల కోసం ప్రయత్నించవచ్చా? అని అడుగుతున్నారు. 40 సంవత్సరాల వరకు పిల్లల కోసం ప్రయత్నించవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ముందుగా మీరు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా మహిళల్లో అండాల సంఖ్య వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఇరవైల్లో ఉన్నప్పుడు లక్షల్లో, ముప్పైల్లో ఉన్నప్పుడు వేలల్లో, నలభైల్లోకి వచ్చేసరికి ఆ సంఖ్య వందలకు పడిపోతుంటుంది. పిల్లల్ని కనడానికి అండాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా ఎంతో ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ అండాల నాణ్యత కూడా తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. ఒకవేళ నాణ్యత లేని అండం ఫలదీకరణ చెందినప్పుడు పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు వస్తుంటాయి. డౌన్‌ సిండ్రోమ్‌, ఎడ్వర్డ్స్‌ సిండ్రోమ్‌ వంటివి ఇందులో భాగమే.

మీరు పిల్లల కోసం ప్రయత్నించవచ్చు. కానీ పై అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎల్లప్పుడూ డాక్టర్‌ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలి. వారు సూచించిన టెస్ట్‌లు, మందులను వాడుతుండాలి. ఒకవేళ గర్భం నిర్ధరణ అయినా కూడా కొన్ని జన్యుపరమైన టెస్ట్‌లు చేయించుకోవాలి. వీటి ద్వారా పిండం ఎదుగుదల ఎలా ఉంది? జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందా? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ అంశాలకు మానసికంగా సిద్ధమైనప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి సాధారణ చెకప్స్‌కు వెళితే మాత్రం సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సాధారణంగా గర్భం నిలబడాలంటే శారీరకంగా కూడా ఫిట్గా ఉండాలి. ప్రెగ్నెన్సీని తట్టుకునే శక్తి యుక్త వయసులో ఉన్నవిధంగా నలభైల్లో ఉండదు. కాబట్టి మీ ఫిట్‌నెస్‌ను కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు బీపీ, షుగర్‌ టెస్ట్‌లు కూడా చేయించుకోవాలి. ఇలా అన్ని రకాల పరీక్షలు చేయించుకుని ఎల్లప్పుడూ డాక్టర్‌ పర్యవేక్షణలో ఉంటే గర్భధారణలో సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని