Published : 14/05/2022 00:40 IST

అపరిచితుల్లా అవుతారు జాగ్రత్త!

రాహుల్‌కు వాళ్లమ్మ ప్రతి క్షణం వెన్నంటే ఉంటుంది. చదువుకునేటప్పుడు, తినేటప్పుడే కాకుండా స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు కూడా వాడికి నీడలా మారుతుంది. ఈ అతి పర్యవేక్షణ పిల్లలపై చెడు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

పిల్లల ఎదుగుదలలో పెద్దవాళ్ల పర్యవేక్షణ తప్పనిసరి. అయితే ప్రతిక్షణం వారి వెంటే ఉంటే అది వారిని వెంటాడినట్లుగా అనిపిస్తుంది. వారికి మంచి అలవాట్లు, క్రమశిక్షణ, చదువుపట్ల నిబద్ధత వంటివి చిన్నప్పటి నుంచి నేర్పాలి. అలాగని వారికి కనీస స్వేచ్ఛనివ్వకుండా పర్యవేక్షిస్తూ ఉంటే.. అది తీవ్రంగా బాధిస్తుంది. హోంవర్క్‌లో అవసరమైనప్పుడు సాయం చేయాలి. పాఠ్యాంశాల్లో అర్థమవనివి చెప్పగలగాలి. ప్రాజెక్ట్‌ వర్క్‌లో పక్కనే ఉండాలి. వారి హోంవర్క్‌ వారే పూర్తి చేసుకోగలగడాన్ని నేర్పితే చాలు. సందేహాలొస్తే తీర్చడానికి అమ్మానాన్నలు సిద్ధంగా ఉంటారని వాళ్లకు ధైర్యాన్ని ఇస్తే సరిపోతుంది. లేదంటే దేనికీ సొంత నిర్ణయాలు తీసుకోలేని స్థితికి వెళ్లిపోతారు. ఎప్పటికీ... ప్రతి చిన్న దానికీ ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతారు.

సామర్థ్యం.. ప్రతి విషయానికీ పిల్లలను సందేహిస్తూ పర్యవేక్షణ ఉంచితే వారిలో ఆత్మన్యూనత మొదలవుతుంది. వారు చేయగలిగిన పనులనూ పెద్దవాళ్లు తమ చేతుల్లోకి తీసుకుంటే పిల్లలు వారి సామర్థ్యాలను పెంచుకోలేరు. అనుక్షణం కన్నేసి ఉంచితే వారిలో రెండు రకాల వ్యక్తిత్వాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులు చూసేటప్పుడు ఒకలా, చూడనప్పుడు మరొకలా ప్రవర్తించడం అలవరుచుకుంటారు. అలాకాకుండా మార్కులు తక్కువ వచ్చినా, ఆటల్లో ఓడిపోయినా, ఏ విషయంలో అయినా వెనుకబడ్డా... మళ్లీ ప్రయత్నించమని ప్రోత్సహించాలి. అప్పుడే భవిష్యత్తులో విజేతలుగా నిలుస్తారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని