icon icon icon
icon icon icon

YSRCP Manifesto: బ్యాండేజ్‌ తీసేసిన సీఎం జగన్‌.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..

YSRCP Manifesto: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేశారు.

Updated : 27 Apr 2024 13:23 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఎట్టకేలకు నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ను తీసేశారు. గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13 సీఎం జగన్‌ నుదుటికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్యాండేజ్‌ సైజును పెంచుకుంటూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు సైతం పెద్ద సైజు బ్యాండేజ్‌తో రావడంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. వైఎస్‌ వివేకానంద కుమార్తె సైతం గాయంపై అన్ని రోజులు బ్యాండేజ్‌ ఉంటే సెప్టిక్‌ అవుతుందని చెప్పడం, మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ మొదలవడంతో బ్యాండేజీ తొలగించి ఈ రోజు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ‘ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం.. జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం’ అంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

రెండు పేజీలతో వైకాపా మేనిఫెస్టో..

తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌ వైకాపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కేవలం రెండు పేజీలతో, 9 ముఖ్యాంశాలతో కూడిన మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. ఏటా ప్రోగ్రెస్‌ రిపోర్టుతో ప్రజలకు వివరించాం. 58 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే చేరేలా చేశాం. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా’ అని అన్నారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: అమ్మ ఒడి రూ.15వేల నుంచి  రూ.17 వేలకు పెంపు; వైఎస్‌ఆర్‌ చేయూత కొనసాగింపు; వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కొనసాగింపు; మహిళలకు రూ.3లక్షల వరకూ సున్నా వడ్డీ; సామాజిక పింఛన్లను రెండు విడతల్లో రూ.3500 పెంపు; కల్యాణమస్తు, షాదీతోఫా కొనసాగింపు; అర్హులందరికీ ఇళ్ల పథకం కొనసాగింపు; రూ.2000 కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు; రైతుభరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలకు పెంపు; వైద్యం ఆరోగ్యశ్రీ విస్తరణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img