Joe Biden: ‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. 

Published : 28 Apr 2024 00:02 IST

వాషింగ్టన్: త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు, తన వ్యక్తిగత జీవితం గురించి అమెరికా (USA) అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) పలు విషయాలను పంచుకున్నారు. అలాగే ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆ పరిస్థితికి గల కారణాన్ని వెల్లడించారు.

1972లో జరిగిన కారు ప్రమాదంలో జో బైడెన్‌ మొదటి భార్య, కుమార్తె మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయారట. ‘‘ఆ సమయంలో మద్యానికి అలవాటుపడ్డా. అప్పటివరకు ఆ ఆలవాటు లేదు. బ్రిడ్జి మీదకు వెళ్లి, దూకాలనే ఆలోచనలు వెంటాడేవి. కానీ అప్పుడు వెంటనే నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చేవారు’’ అని వెల్లడించారు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.   ఈ ప్రమాదం తర్వాత బైడెన్ ఒంటరిగా తన ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకున్నారు. కొద్దికాలానికి జిల్‌తో పరిచయం ఏర్పడింది.

కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం

1975లో వారిద్దరూ మొదటిసారి మీట్ అయ్యారు. అప్పుడు జో వయసు 33. సెనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 24 ఏళ్ల జిల్ ఫైనల్‌ ఇయర్ విద్యార్థిని. వారిద్దరి పరిచయానికి కారణమైంది మాత్రం జో(Joe Biden) సోదరుడు. ‘‘ఒకరోజు నా సోదరుడు ఫోన్‌ చేసి జిల్ గురించి చెప్పాడు. ఆమె చక్కగా ఉంటుంది. కానీ రాజకీయాలను ఇష్టపడదు’’ అని అన్నాడు. 1977లో జిల్‌, జో వివాహం జరిగింది.

ఇక ఇంటర్వ్యూలోనే మాజీ అధ్యక్షుడు, తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చకు సిద్ధమని బైడెన్‌ వెల్లడించారు. దానికి ట్రంప్‌ కూడా అంతే వేగంగా సమాధానం ఇచ్చారు. ‘‘ఎక్కడైనా, ఎప్పుడైనా ఓకే’’ అంటూ బదులిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య చర్చ కీలక పాత్ర పోషిస్తుంది. కీలక అంశాలపై వారి అభిప్రాయాలను ఓటర్లు గమనిస్తుంటారు. ఈనేపథ్యంలో అగ్ర రాజ్యానికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగితే.. ప్రపంచ దేశాలు కూడా ఓ కన్నేస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని