ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్‌-5 కంపెనీల్లో 69 వేల మంది!

ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్‌-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది.

Published : 28 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అరుదు. అలాంటిది ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69 వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈవిషయం వెల్లడైంది. ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ (Infosys), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ (HCLTech), విప్రో (Wipro), టెక్‌ మహీంద్రా (Tech Mahindra) ఇటీవల త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఆయా సంస్థల లాభనష్టాలతో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించాయి. ఈ గణాంకాలను గమనిస్తే.. మొత్తంగా 69,167 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది. టీసీఎస్‌లో 13,249 మంది, విప్రోలో 24,516, ఇన్ఫీలో 25,994, టెక్‌ మహీంద్రాలో 6,945 మేర ఉద్యోగుల తగ్గుదల నమోదైంది. ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య 1,537 మేర పెరిగింది. అంటే టాప్‌-5 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఒక్క హెచ్‌సీఎల్‌లో మాత్రమే. ఈ పరిస్థితి ఉద్యోగార్థులను కలవరపెడుతోంది.

ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్‌ పిచాయ్‌

ఓవైపు ఉద్యోగుల సంఖ్య తగ్గిన వేళ.. మళ్లీ ఫ్రెషర్లను నియమించుకోవడంపై ఆయా కంపెనీలు దృష్టి సారిస్తుండడం ఊరట కల్పించే అంశం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ సుమారు 40 వేల మందిని, హెచ్‌సీఎల్‌ 10 వేల మంది, టెక్‌ మహీంద్రా 6 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. కేవలం క్యాంపస్‌ నుంచే కాకుండా ఆఫ్‌ క్యాంపస్‌ నుంచి ఫ్రెషర్లను నియమించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. ప్రస్తుతానికి కంపెనీలు మార్జిన్‌లను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాయని, వృద్ధి బాటలోకి రాగానే ఉద్యోగాల నియామకాలు ప్రారంభమవుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఏఐ సాంకేతికత కారణంగా అవసరం మేర మాత్రమే ఉద్యోగులను నియమించుకునే అవకాశమూ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు