Published : 23/11/2022 13:08 IST

అనుబంధాన్ని పెంచే ‘పిల్లో టాక్’!

భార్యాభర్తల మధ్య ఎంత పారదర్శకత ఉంటే వారి అనుబంధం అంత దృఢంగా ఉంటుందంటారు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అయితే సాధారణ సమయాల్లో ఇద్దరూ ఎన్ని విషయాల గురించి పిచ్చాపాటీగా మాట్లాడుకున్నా.. మనసు విప్పి మాట్లాడుకునేది మాత్రం పడకగదిలోనే! ఇలా ఏకాంత సమయంలో ప్రేమగా ఒకరినొకరు హత్తుకొని.. ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ రొమాంటిక్‌గా మాట్లాడుకోవడాన్నే ‘పిల్లో టాక్‌’ అంటారు. నిజానికి దీనివల్ల దాంపత్య బంధంలో బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

రోజంతా ఎన్ని పనులతో బిజీగా ఉన్నా, ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా.. రాత్రి పడకగదిలో దంపతుల మధ్య ఉండే అన్యోన్యత ఇలాంటి ప్రతికూలతలన్నింటినీ దూరం చేస్తుంది. ఇక ఈ సమయంలో ప్రేమగా, ఆప్యాయంగా ఇద్దరూ మాట్లాడుకునే మాటలు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుతాయి. ‘పిల్లో టాక్‌’గా పిలిచే ఈ రొమాంటిక్‌ సంభాషణ వల్ల ఆలుమగలు తమ అనురాగంలో ఆకాశపుటంచుల్ని తాకచ్చంటున్నారు నిపుణులు.

వారి మనసును చదివేయచ్చు!

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. దంపతులిద్దరూ ఒకరి గురించి మరొకరు ఎన్ని విషయాలు తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు బోలెడుంటాయి. అది వారి అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఫ్యాంటసీలు.. ఇలా ఏవైనా కావచ్చు.. సాధారణ సమయాల్లో వీటన్నింటి గురించి చర్చించేంత సమయం ఉండకపోవచ్చు.. సందర్భమూ రాకపోవచ్చు. కానీ రాత్రుళ్లు పడకగదిలో భార్యాభర్తల మధ్య ఉండే చనువు, ఆప్యాయత.. ఇలా వీటన్నింటి గురించి నిస్సంకోచంగా బయటపెట్టేందుకు పురికొల్పుతుంటుంది. ఇందుకు కారణం.. ఈ దగ్గరితనం వల్ల ఒకరిపై ఒకరికి ఏర్పడే నమ్మకమే అంటున్నారు నిపుణులు. ఇలా పడకగదిలో మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల.. భాగస్వామి మనసును చదివేయచ్చని చెబుతున్నారు. ఇలా వారి మనసులోని మాటను, కోరికను తెలుసుకొని వదిలేయడం కాకుండా.. దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తే.. ఇద్దరూ మరింత దగ్గరవ్వచ్చు.

ఆ కోరికలూ పెరుగుతాయట!

రోజంతా ఆఫీస్‌, ఇంటి పనులతో క్షణం తీరికుండదు.. మరోవైపు పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మనల్ని మనమే నిర్లక్ష్యం చేస్తుంటాం. కాస్త సమయం దొరికితేనే మహా భాగ్యం అనుకుంటాం. ఇలా ఇంతటి బిజీ షెడ్యూల్‌ వల్ల తలెత్తే ఒత్తిడి, ఆందోళనలు చాలామందికి అనుభవమే! ఇక వీటి వల్ల చాలామంది భార్యాభర్తలు లైంగిక జీవితానికి దూరమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి మానసిక సమస్యలు పిల్లో టాక్‌తో దూరమవుతాయంటున్నారు నిపుణులు. రాత్రుళ్లు పడకగదిలో భార్యాభర్తలిద్దరూ ఏకాంత సమయం గడపడం వల్ల.. ఇద్దరి శరీరాల్లో ‘ఆక్సిటోసిన్‌’ అనే లవ్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఫలితంగా మానసిక సమస్యలు దూరమై.. ప్రశాంతత దరిచేరుతుంది. ఇది ఇద్దరిలో రొమాంటిక్‌ ఆలోచనల్ని ప్రేరేపిస్తుందని, తద్వారా శృంగార కోరికల్ని పెంచుకొని లైంగిక జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే జంటలు రోజంతా ఎంత బిజీగా ఉన్నా.. రాత్రుళ్లు మాత్రం కాసేపు మనసు విప్పి ఏకాంతంగా మాట్లాడుకోవడం మంచిదంటున్నారు.

ఏం చెప్పినా ‘ఊఁ’ అనాల్సిందే!

దంపతులు ఎంత స్నేహంగా, సన్నిహితంగా ఉంటే వారి అనుబంధం అంత అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. అయితే ఈ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కొన్ని జంటల్లో కొంతమంది భాగస్వాములు తమ భర్త/భార్యతో అన్ని విషయాల్ని స్వేచ్ఛగా చర్చించలేకపోవచ్చు.. పైగా తమ కోరికలు, భవిష్యత్తు లక్ష్యాలు, కొత్త కొత్త ఆలోచనలు.. వంటివి పంచుకోవడానికీ నిరాకరిస్తుంటారు.. ఇందుకు కారణం.. వారు ఒప్పుకుంటారో, లేదో.. ఆ పని చేస్తారో, లేదోనన్న సందిగ్ధమే! ఇలా అనుబంధంలో కాస్త ఎడం ఉన్న భార్యాభర్తలు పడకగదిలో ఏకాంతంగా సమయం గడపడం, మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల వారి మధ్య దూరం తగ్గి.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారంటున్నారు నిపుణులు. తద్వారా అవతలి వ్యక్తి మనసులో ఉన్న కోరికేంటో తెలుసుకోవడానికి, దాన్ని నెరవేర్చడానికి ఆసక్తి చూపుతారంటున్నారు. కాబట్టి ఇలా ప్రతి విషయానికీ ‘ఊహూ’ అనే భాగస్వామితోనూ పిల్లో టాక్‌ వల్ల ‘ఊఁ’ అనిపించచ్చంటున్నారు.

వాటికి ఇది సమయం కాదు!

చాలామంది దంపతులకు రోజంతా తీరిక లేకపోయినా.. రాత్రి పడుకునే ముందు కాసేపు కలిసి గడిపేలా ప్లాన్‌ చేసుకుంటారు. ఈ క్రమంలో కొంతమంది దొరక్క దొరక్క దొరికిన ఈ సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. ఆఫీస్ గొడవలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఎప్పుడో జరిగిన విషయాలు.. వంటివి చర్చించుకుంటారు. నిజానికి దీనివల్ల ప్రశాంతంగా, అన్యోన్యంగా గడపాల్సిన సమయం కాస్తా వృథా అయిపోతుంది. ఇలాంటి విషయాల గురించి కలిసి ఇంటి పనులు చేసుకునేటప్పుడో వ్యాయామం చేస్తున్నప్పుడో కూడా మాట్లాడుకోవచ్చు. కాబట్టి వీటికి బదులు.. తమ పెళ్లినాటి జ్ఞాపకాలు, హనీమూన్‌ మధురానుభూతులు, ఇచ్చిపుచ్చుకున్న కానుకలు, ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మరిచిపోలేని సరదా సంఘటనలు.. వంటివన్నీ గుర్తుకుతెచ్చుకుంటే.. ఇద్దరి మధ్యా అనుబంధం మరింత దృఢమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని