Updated : 14/01/2022 15:53 IST

పండగ వేళ ఇవి ఎందుకు చేయాలంటే...

భోగభాగ్యాల భోగి.. సిరిసంపదల సంక్రాంతి.. వచ్చేసింది. తెలుగింట పెద్ద పండగైన సంక్రాంతి అంటేనే రంగుల ముంగిళ్లు, ముద్దులొలికే గొబ్బిళ్లు, బంధుమిత్రుల సందళ్లు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అయితే సంక్రాంతి పండగంటే ఇవే కాదు.. ఈ పండగలో మనం తెలుసుకోవాల్సిన మరెన్నో పద్ధతులు కూడా ఉన్నాయి.. అవన్నీ అటు పండక్కి చేయాల్సిన పనులుగా పెద్దలు చెప్పినా.. వాటికి సామాజికంగా, శాస్త్రీయపరంగా ఎంతో ప్రాధాన్యం ఉంది.. సంక్రాంతి వేళ ముఖ్యంగా చేయాల్సిన కొన్ని పనులు, వాటికి గల ప్రాధాన్యం కూడా తెలుసుకుందాం రండి..

వారికీ ఆనందాన్నిస్తూ..

సంక్రాంతి వేళ ముఖ్యంగా చేయాల్సిన పనుల్లో దానధర్మాల గురించి చెబుతారు పెద్దలు.. సంక్రాంతి అంటేనే పంట ఇంటికొచ్చే వేళ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ చేసుకునే పండగ.. అందుకే ఈ పండగ వేళ దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యం.. పంట ఇంటికొచ్చేవేళ ఇంట్లో కుటుంబ సభ్యులకే కాదు.. పనివాళ్లకు కూడా బట్టలు తేవడం ఇంతకుముందు కనిపించేది. అంతేకాదు.. కొత్తగా వచ్చిన ధాన్యం, ఇతర పంటలతో గాదెలన్నీ నిండి ఉండడంతో దానధర్మాలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపించేవారు. అందుకేనేమో.. సంక్రాంతి సమయంలో తప్పనిసరిగా దానధర్మాలు చేయాలని పెద్దలు చెప్పేవారు. పండగ హడావిడి మొదలుకాగానే హరిదాసు, గంగిరెద్దులవారు, పిట్టలదొర, కొమ్ముదాసర్లు, బుడబుక్కలోళ్లు.. ఇలా ఎంతోమంది వచ్చి దానధర్మాలు తీసుకొని వెళ్లేవారు. పండిన పంటను పూర్తిగా మనమే అనుభవించకుండా.. అందులోంచి పరాయివాళ్లకు కూడా దానం చేయాలని పెద్దలు ఈ సూత్రాన్ని పాటించేవాళ్లు. అలాగే కనుమ రోజు పెద్దలను తలచుకోవడం, సాయం చేసే జంతువులను, పనిముట్లను పూజించడం ద్వారా మనవాళ్లను, మనకు మేలు చేకూర్చే వారిని మర్చిపోకూడదనే సూత్రాన్ని మన పెద్దలు పాటించేవారు..

అహాన్ని వదిలేయాలి..

సంక్రాంతి రోజు మన దగ్గర తక్కువే అయినా దేశంలో చాలాచోట్ల కనిపించే సంప్రదాయం 'తిల్‌గుల్'. అంటే నువ్వులు, బెల్లంతో కలిపి చేసిన ముద్దలను అందరితో పంచుకోవడం అన్నమాట. కేవలం మనవారితోనే కాదు.. పరాయివారితోనూ స్నేహపూర్వకంగా మెలగడం అన్నది ఇందులో దాగిన పరమార్థం. ఈ నువ్వుల ఉండలను మనకు తెలిసినవారందరితో పంచుకోవాలి. అహాన్ని వదిలి వారితో మంచిమాటలు మాట్లాడుతూ నోరు తీపిచేయాలి. అలాగే ధనవంతులు, పేదవారు అన్న విభేదాలను పక్కన పెట్టి ఒకరితో ఒకరు ఈ నువ్వుల ఉండలను పంచుకోవాలి. అలాగే సంక్రాంతి వచ్చేది చలికాలంలో కాబట్టి నువ్వులు, బెల్లం మన శరీరాన్ని వెచ్చబడేలా చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇవి ఎందుకు చేయాలంటే..?

ఇంకా సంక్రాంతి వేళ పాటించాల్సిన పద్ధతుల్లో పతంగులు ఎగరవేయడం, సూర్య నమస్కారాలు, నదీస్నానాలు ఇలా ఎన్నో ఉన్నాయి.. వీటి వెనకా ఎన్నో శాస్త్రీయ కారణాలున్నాయి.. అవేంటంటే..

నదీస్నానం

చలికాలంలో శరీరంలో జీవక్రియలన్నీ నెమ్మదిస్తాయి. వీటిని తిరిగి వేగవంతం చేసి, శరీరానికి పునరుత్తేజం కలిగించేందుకు చల్లని నీరు బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ కాలంలో ఉదయాన్నే లేచి నదీ స్నానాలు చేయాలని పెద్దలు చెబుతుంటారు.

సూర్య నమస్కారాలు

చలికాలంలో సూర్యుడి కిరణాలు మన మీద చాలా తక్కువగా పడతాయి. దీనివల్ల ఈ కాలంలో విటమిన్ 'డి' తక్కువగా లభిస్తుంది. అందుకే అది ఎక్కువగా లభించే ఉదయపు ఎండలో సూర్యుడికి అర్ఘ్యం అర్పించడం, సూర్య నమస్కారాలు చేయడం తప్పనిసరిగా చెబుతారు పెద్దలు.

పతంగులు ఎగరేయడం

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి విశిష్టత. అంటే ప్రకృతిలో జరిగే ఓ మార్పును ఆహ్వానించడం అన్నమాట. చలికాలం పూర్తయ్యి.. వసంతానికి స్వాగతం పలకబోయే రోజులు ఇవి.. ఆ మార్పులను తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేస్తూ, ముందు ముందు వచ్చే ఎండలను తట్టుకునేలా చేయడానికే పతంగులు ఎగరేయడం ప్రారంభమైందట. వీటిని ఎగరేస్తూ ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల ఎండలకు తట్టుకునే శక్తిని శరీరం తిరిగి పొందుతుంది. అంతేకాదు.. విటమిన్ 'డి' కూడా అందుతుంది. ఆపై ప్రారంభమయ్యే వేసవికి ఇది ఉపయోగపడుతుంది కూడా..!

చూశారుగా.. సంక్రాంతి వేళ పాటించే పద్ధతులకు కొన్ని సామాజిక, శాస్త్రీయ కారణాలేంటో..! ఇవే కాదు.. కీటకాలకు ఆహారం కోసం పిండితో ముగ్గులు పెట్టడం, ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గించేలా గడపలకు పసుపు రాయడం, గొబ్బెమ్మల పేరుతో పేడను ఉపయోగించడం... ఇలా ఈ పండగ వేళ చేసే ప్రతి పనీ శాస్త్రీయ నేపథ్యంతో కూడుకున్నదే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని