Published : 18/03/2023 17:29 IST

ఇంటికి ‘సెలబ్రిటీ’ టచ్.. ఇచ్చేయండిలా!

ఇంటిని తీర్చిదిద్దుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. ఈ క్రమంలో కొందరు తమ సొంత నైపుణ్యాలను ప్రయోగిస్తే.. మరికొందరు ఇతరుల స్ఫూర్తితో తమ ఇంటిని అలంకరించుకుంటారు. అయితే ‘హోమ్‌ టూర్స్‌’లో భాగంగా మన అభిమాన తారల ఇంటి వీడియోలు, ఫొటోలు చూసినప్పుడు.. మన ఇంటినీ అంతే విలాసవంతంగా అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో అనిపించడం సహజం. కానీ అందుకు బోలెడంత డబ్బు ఖర్చవుతుందని వెనకడుగు వేస్తాం. అయితే ఆ అవసరం లేకుండా.. బడ్జెట్‌లోనే ఇంటికి సెలబ్రిటీ టచ్‌ ఇవ్వచ్చంటున్నారు నిపుణులు. కొన్ని మార్పులు, చేర్పులతో ఇది సాధ్యమవుతుందంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

దాన్ని మించింది లేదు!

ఇంటి వాస్తుకైనా, ఆరోగ్యానికైనా.. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలంటారు నిపుణులు. చాలామంది సెలబ్రిటీ ఇళ్లలోనూ ఈ రెండూ పుష్కలంగా ఉండడం మనం గమనిస్తుంటాం. ఈ క్రమంలో వారు అమర్చుకునే పెద్ద పెద్ద కిటికీలు, స్లైడింగ్‌ డోర్‌ తరహా కిటికీలే కారణం. వీటిని తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనూ అమర్చుకోవచ్చు.. లేదంటే ఉన్న కిటికీలకే పారదర్శక విండో గ్లాస్‌లను ఏర్పాటుచేసుకోవచ్చు. ఇంట్లోకి వెలుతురు ఎక్కువగా రావడానికి కర్టెన్లూ కీలకమే! కాబట్టి లేత రంగుల్లో-పారదర్శకంగా ఉండే కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గదిలో అక్కడక్కడా అద్దాలు అమర్చుకుంటే.. గది పెద్దగా కనిపిస్తుంది.. దానిపై వెలుతురు పడి గది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

‘బయోఫిలిక్‌ డిజైన్‌’ మెరుపులు!

ఇంట్లో మొక్కలు ఏర్పాటుచేసుకోవడం ఇప్పుడు చాలామందికి అలవాటైంది. మరి, ఇదే గ్రీనరీతో ఇంటికి సెలబ్రిటీ టచ్‌ ఇవ్వాలంటే.. ‘బయోఫిలిక్‌ డిజైన్‌’తో ఇంటిని మెరిపించాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. చిన్న చిన్న కుండీల్లో కాకుండా.. ఇంట్లో ప్రత్యేకంగా ఓ మినీ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నమాట! ఈ క్రమంలో గోడలపై, గదుల్ని వేరు చేసే ఆర్చ్‌ల చుట్టూ, పార్టిషన్స్‌ దగ్గర, పడకగదిలో/హాల్‌లో ఒక గోడకు.. ఇలా మీకు నచ్చిన చోట పచ్చదనంతో హంగులద్దచ్చు. ఫలితంగా ఇంటికి కొత్త లుక్‌ వస్తుంది.. మరోవైపు ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకూ ఈ డిజైన్‌తో మేలు జరుగుతుంది.

చిన్నవాటితో పెద్ద మార్పు!

పెద్ద పెద్ద ఇంటి అలంకరణ వస్తువులుంటేనే ఇల్లు విలాసవంతంగా కనిపిస్తుందనుకుంటారు కొందరు. కానీ చిన్న వస్తువులతోనూ ఇంటిని లగ్జరీగా మార్చచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరు సెలబ్రిటీ ఇళ్లలోనూ మనం ఇది గమనించచ్చు. ఇంట్లో అక్కడక్కడా ఫ్లోటింగ్‌ షెల్ఫుల్లో.. ఆకర్షణీయమైన ఇంటీరియర్‌ వస్తువుల్ని ఏర్పాటుచేయడం మనం చూస్తుంటాం. ఈ తరహాలోనే మన ఇళ్లలోనూ గోడలకు అందంగా పెయింటింగ్‌ చేసిన ట్రేస్‌, ఇంటి మూలల్లో సెరామిక్‌ ఫ్లవర్వాజ్‌లు, చిన్న చిన్న షాండ్లియర్స్‌.. వంటివి ఇంటికి కొత్త కళ తీసుకొస్తాయి.

పర్యావరణహితం కోరి..!

ఈమధ్య చాలామంది తాము వేసే ప్రతి అడుగులోనూ పర్యావరణహితాన్నే కోరుకుంటున్నారు. తమ ఇంటి కోసం ఎంచుకునే అలంకరణ వస్తువులూ ఇందుకు మినహాయింపు కాదు. చాలామంది సెలబ్రిటీ ఇళ్లలో చూస్తే ఇలా తిరిగి ఉపయోగించుకునే వస్తువులతో తయారుచేసిన రీయూజబుల్‌/సస్టైనబుల్‌ ఇంటీరియర్స్‌ మనకు కనిపిస్తుంటాయి. వాటి గురించి వారు ప్రత్యేకంగా చెబుతూ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతుంటారు కూడా! అలాంటి వస్తువుల్ని ఎంచుకుంటే ఇంటికి సెలబ్రిటీ టచ్‌ ఇవ్వడంతో పాటు.. ఎకో-ఫ్రెండ్లీగానూ ఉంటుంది. ఈ క్రమంలో కర్టెన్లు, సోఫా-సోఫా కవర్లు, కేన్ ఫర్నిచర్‌, కార్పెట్స్‌, బెడ్‌షీట్స్‌.. ఇలా ఎందులోనైనా సస్టైనబిలిటీ ప్రదర్శించి ఇంటిని కొత్తగా, రిచ్‌గా డెకరేట్‌ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని