Published : 10/12/2022 18:38 IST

ఇంట్లో కాలుష్యం.. తగ్గాలంటే..!

బయటి కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఇల్లే సురక్షితమైన ప్రదేశం అనుకుంటాం. ఈ క్రమంలోనే ఇంటి వాతావరణాన్ని సంరక్షించుకోవడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటాం. అయితే నిజానికి ఇల్లూ కాలుష్యానికి మినహాయింపేమీ కాదంటున్నారు నిపుణులు. ఇంట్లోని దుప్పట్లు, కార్పెట్లు, కర్టెన్లు, పెంపుడు జంతువులు, వంటగది వాయువులు, వాడుకునే ఉపకరణాలు, ఆఖరికి పెంచుకునే మొక్కలు కూడా కాలుష్య కారకాలే అని చెబుతున్నారు. తద్వారా దగ్గు, ఆస్తమా, అలర్జీలు, చర్మవ్యాధులు..  ఇలా వివిధ సమస్యలు తప్పవంటున్నారు. అందుకే వీటి పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. మరి, ఇంటి కాలుష్యాన్ని తగ్గించడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

అతిగా వాడొద్దు..

ఇల్లంతా సువాసనభరితంగా ఉండాలని కొందరు కృత్రిమ ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు వాడుతుంటారు. ఇవి బెంజీన్‌, హైడ్రోకార్బన్‌ వంటి వాటిని వాతావరణంలోకి విడుదల చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా కళ్లు, ముక్కు, గొంతుపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల పైనా ఈ రసాయనాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి.

కొన్ని మొక్కలకే..

కొందరు ఇంటి నిండా మొక్కలు పెంచేస్తుంటారు. మొక్కలు రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయనే విషయం మరవద్దు. తులసి లాంటి కొన్ని మొక్కలకే పరిమితం కావాలి. అందులోనూ కాలుష్యాన్ని అరికట్టే మొక్కలకు ప్రాధాన్యమివ్వాలి.

గాలి, వెలుతురు వస్తున్నాయా?

అవకాశం ఉన్నంతవరకు ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. సూర్యరశ్మి ఇంట్లో నేరుగా పడేలా చేయాలి. ఫలితంగా గదుల్లో తేమ, చమ్మ వంటి సమస్యలు తగ్గుతాయి. హానికారక వాయువులు బయటకు పోతాయి.

వీటితో..

వంట సోడా, వెనిగర్‌.. సహజ క్లెన్సర్లు. వెనిగర్‌ బయో క్లీనర్‌గా పని చేస్తుంది. ఇల్లు తుడిచే మిశ్రమంలో దీనిని కలపచ్చు. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే బూజు పడతాయి. దీన్ని నిర్మూలించడానికి చిన్న గిన్నెలో వెనిగర్‌ వేసి ఫ్రిజ్‌లో ఓ మూలన పెడితే చాలు.

చీమలు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు సహజంగానే కాలుష్య వాహకాలు. బయటి కాలుష్యాన్ని ఇల్లంతా వ్యాపింపజేస్తాయి. వీటిని అరికట్టడానికి వంట సోడా అక్కడక్కడా చల్లాలి.

వీటితో పాటు వంటగదిని, ఇంట్లో వాడే ఉపకరణాలు, కర్టెన్లు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అలాగే ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటి విషయంలోనూ పరిశుభ్రత పాటించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని