Cruise Ship: ఒడ్డుకు చేరిన ‘స్పిరిట్‌ ఆఫ్‌ డిస్కవరీ’.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

గత వారం తుపానులో చిక్కుకుపోయిన ఓడ ‘స్పిరిట్‌ ఆఫ్‌ డిస్కవరీ’ (Spirit of Discovery) ఎట్టకేలకు ఒడ్డుకు చేరింది.  

Published : 08 Nov 2023 01:54 IST

Image: PortSaintJohn

లండన్‌: వాతావరణం అనుకూలించపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఓ యూకే (UK) నౌక ఎట్టకేలకు ఒడ్డుకు చేరింది. దాంతో అందులోని సుమారు వెయ్యి మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాగా క్రూజెస్‌కు చెందిన విలాసవంతమైన ఓడ ‘స్పిరిట్‌ ఆఫ్‌ డిస్కవరీ’ అక్టోబరు 24న సుమారు వెయ్యి మంది ప్రయాణికులతో 14 రోజుల విహారం నిమిత్తం కేనరీ ఐలాండ్స్‌కు బయలుదేరింది. అక్కడ వాతావరణం సరిగా లేదని గుర్తించిన ఓడ సిబ్బంది అనుకున్న సమయం కంటే ముందే తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆ ఓడ గత శనివారం మార్గం మధ్యలో ఉండగానే బే ఆఫ్‌ బిస్కే వద్ద తుపానులో చిక్కుకుంది. వాతావరణం అనుకూలించకపోవడం, సముద్రం కల్లోలంగా మారడంతో ఓ దశలో ఓడ మొత్తం ఎడమవైపునకు ఒరిగింది. దాంతో సుమారు 100 మంది గాయపడ్డారు. ఎక్కువ మందికి స్వల్ప గాయాలే అయినప్పటికీ ఐదుగురికి మాత్రం మెరుగైన చికిత్స అవసరమైందని క్రూజ్‌ కంపెనీ తెలిపింది. 

రాకెట్‌ దాడుల మధ్య నుంచి ప్రయాణికుల విమానం: భయానక వీడియో వైరల్‌

ఓడ తిరిగి వస్తుండగా వాతావరణం అనుకూలించక పోవడంతో అందులోని ప్రొపల్షన్‌ సేఫ్టీ సిస్టం యాక్టివేట్ అయ్యింది. ఈ చర్యతో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఓడను కదిలించకూడదని నౌకాయాన సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కుదుపు కారణంగా గాయపడిన వారికి ఓడలోని డైనింగ్‌ రూమ్‌నే తాత్కాలిక క్లినిక్‌గా మార్చి చికిత్స అందజేశారు. శని, ఆదివారాల తరువాత వాతావరణం అనుకూలంగా ఉండటంతో తిరిగి పోర్ట్స్‌మౌత్‌ దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఆ ఓడ మంగళవారం గమ్యం చేరినట్లు తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని