రాకెట్‌ దాడుల మధ్య నుంచి ప్రయాణికుల విమానం: భయానక వీడియో వైరల్‌

Israel Hamas: భారీస్థాయిలో వైమానిక దాడులు జరుగుతోన్న సమయంలో ఓ ప్రయాణికుల విమానం ఇజ్రాయెల్ చేరుకుంది. ఆ పేలుళ్ల మధ్య నుంచే గమ్యస్థానం వైపు వెళ్లింది. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Published : 07 Nov 2023 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ గగనతలంలో ప్రయాణికుల విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ప్రయాణిస్తోన్న సమయంలో సరిగ్గా ఆ దగ్గర్లోనే ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్(Iron Dome) రాకెట్లను పేల్చివేసింది. కొద్దిగా అటూ ఇటూ అయినా ప్రయాణికుల ప్రాణాలు  గాల్లో కలిసేవే..! ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. (Israel Hamas conflict)

ఆ ప్రయాణికుల విమానం ఇజ్రాయెల్‌(Israel) నగరం టెల్‌అవీవ్‌లో దిగేందుకు వెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు రాకెట్లను ఎదుర్కొంటోంది. వాటిని పేల్చివేస్తోంది. వైరల్‌గా మారిన  దృశ్యాల్లో.. విమానానికి, భారీ పేలుళ్లకు పెద్దగా దూరం లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జార్జియా నుంచి వచ్చిన ఆ విమానం షెడ్యూల్ సమయం కంటే 15 నిమిషాలు ఆలస్యంగా టెల్‌అవీవ్‌లో ల్యాండ్ అయింది. భారీస్థాయిలో వైమానిక దాడులు జరుగుతోన్న సమయంలో అది ఇజ్రాయెల్ చేరుకుంది. ఈ ఘటనపై విమానాశ్రయం నుంచి కానీ, విమానయాన సంస్థ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.

సంక్షోభం వేళ ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత.. భారత్‌ నుంచి లక్ష మంది?

ఇదిలా ఉంటే.. అక్టోబర్  ఏడున హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి కి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హమాస్ ఏడువేలకు పైగా రాకెట్లను ప్రయోగించిందని సమాచారం. వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ (Iron dome Defence System)ను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తే రాడార్‌ వ్యవస్థ దాని ప్రయాణతీరును అంచనా వేస్తాయి. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్లను అడ్డుకుంటాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు