Ukraine Crisis: ఉక్రెయిన్‌ సైనికులకు అమెరికా శిక్షణ

రష్యా బలగాలను ఎదుర్కోవడంలో ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాతో అండగా నిలుస్తున్న అమెరికా ఇకపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సన్నద్ధమవుతోంది. అధిక సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు

Updated : 16 Apr 2022 08:21 IST

దిల్లీ: రష్యా బలగాలను ఎదుర్కోవడంలో ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాతో అండగా నిలుస్తున్న అమెరికా ఇకపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సన్నద్ధమవుతోంది. అధిక సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జెలెన్‌స్కీ సేనలకు పంపడంతో పాటు వాటి వినియోగంలో శిక్షణనివ్వాలనీ బైడెన్‌ సర్కారు నిర్ణయించింది. 80 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీలో భాగంగా 18 హోవిట్జర్లు (155ఎంఎం), 40 వేల ఆర్టిల్లరీ రౌండ్లు, మానవరహిత తీరరక్షక నౌకలు, 10 ఏఎన్‌/టీపీక్యూ-36 ఫిరంగి నిరోధక రాడార్లు, 500 జావెలిన్‌ క్షిపణులు, 300 స్విచ్‌బ్లేడ్‌లు, వందల సంఖ్యలో వాహనాలు, భారీమొత్తంలో మందుగుండు సామగ్రితో పాటు 11 ఎంఐ-17 హెలికాప్టర్లనూ ఉక్రెయిన్‌కు అమెరికా పంపించనుంది. వీటి సరఫరా మాత్రమే కాకుండా రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ అత్యాధునిక వ్యవస్థలను ఎలా ఉపయోగించాలో కూడా శిక్షణ ఇవ్వనుంది. ఎంపిక చేసిన ఉక్రెయిన్‌ సైనికులను తీసుకొచ్చి తాము వేగంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ కిర్బీ తాజాగా వెల్లడించారు. అనంతరం వారు స్వదేశానికి వెళ్లి సహచర సైనికులకు శిక్షణనిస్తారని తెలిపారు. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో రష్యా త్వరలో దాడులను ముమ్మరం చేయనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా తాజా నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని