Nikki Haley: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగిన నిక్కీ హేలీ

Nikki Haley: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు జరుగుతున్న అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ప్రకటించారు.

Published : 06 Mar 2024 21:50 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్య (USA) అధికార పీఠం కోసం జరగబోయే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రత్యర్థులుగా ఉండటం ఖాయమైపోయింది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) ప్రకటించారు. సౌత్‌ కరోలినాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నా క్యాంపెయిన్‌ను నిలిపివేయాల్సిన సమయం వచ్చింది. అమెరికన్లు తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నానని చెప్పేదాన్ని. నేను ఆ పని చేశా. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఇకపై అభ్యర్థిని కానప్పటికీ.. నమ్మిన అంశాలపై మాత్రం గళాన్ని వినిపించడం ఆపను’’ అని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు అభినందనలు తెలిపిన హేలీ..  అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. 

సౌత్ కరోలినా మాజీ గవర్నర్‌, యూఎన్‌ అంబాసిడర్‌ అయిన నిక్కీ హేలీ..  ట్రంప్‌ను సమర్థిస్తారా లేదా అనే అంశంపై మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, హేలీకి సన్నిహితంగా ఉండే వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడం మంచిదని కొందరు భావిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ను ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, మంగళవారం జరిగిన ‘సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల’ పోరులో హేలీ ఓడిపోయారు. రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. నేటి ఫలితాల తర్వాత ట్రంప్‌నకు 995 మంది మద్దతు ఉండగా.. హేలీ ఖాతాలో 89 మంది మాత్రమే ఉన్నారు. ట్రంప్‌తో పోలిస్తే భారీ వెనుకంజలో ఉన్న ఆమె.. పోటీని విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిక్కీ హేలీ తాజాగా ప్రకటన చేశారు. 

ప్రైమరీ ఎన్నికల్లో ఆయనకు పోటీగా.. హేలీ, వివేక్‌ రామస్వామితో పాటు డజను మందికి పైగా బరిలోకి దిగారు. అయితే, ప్రైమరీలు మొదలైన నాటినుంచే మాజీ అధ్యక్షుడు ఆధిక్యంలో కొనసాగారు. దీంతో ప్రధాన పోటీదారులు వరుసగా రేసు నుంచి వైదొలిగారు. చివరగా మిగిలిన హేలీ కూడా పోటీని విరమించుకునేందుకు సిద్ధమవడంతో అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ పోటీ ఖాయమైనట్లే. అటు డెమోక్రాట్ల తరఫున బైడెన్‌ ముందంజలోనే ఉన్నారు. అయితే, లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్‌ పొందడానికి ట్రంప్‌ ఈనెల 12 వరకు, బైడెన్‌ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని