Putin: లైవ్‌లో మరో ‘పుతిన్‌’.. రష్యా అధినేత షాక్‌..!

Putin: లైవ్‌లో అచ్చం తనలాగే ఉన్న వ్యక్తిని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అసలేం జరిగిందంటే..!

Updated : 15 Dec 2023 14:44 IST

మాస్కో: రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin)కు ఓ అనూహ్య అనుభవం ఎదురైంది. మాస్కోలో వార్షిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన్ను.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రశ్నించారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆ ప్రశ్న అడిగింది అచ్చం పుతిన్‌ వలే ఉన్న మరో వ్యక్తి. లైవ్‌లో తన ‘డబుల్‌’ను చూడగానే రష్యా అధ్యక్షుడు అవాక్కయ్యారు. ఇంతకీ అదెలా సాధ్యమనుకుంటున్నారా? అదంతా కృత్రిమ మేధ మాయేనండి..!

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అచ్చం పుతిన్‌ పోలిన ఓ కృత్రిమ వ్యక్తిని సృష్టించారు. ఆ ‘ఏఐ పుతిన్‌’ విలేకరుల సమావేశంలో రష్యా అధ్యక్షుడితో మాట్లాడారు. ‘‘నేను సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ యూనివర్శిటీ విద్యార్థిని. మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని పోలిన వ్యక్తులు చాలా మంది ఉన్నారన్నది నిజమేనా? ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మన జీవితాలకు ఎలాంటి ముప్పు ఉందనుకుంటున్నారు?’’ అని ఆ పుతిన్‌ ‘డబుల్‌’ ప్రశ్నించారు.

మా లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి లేదు.. ఉక్రెయిన్‌పై తేల్చిచెప్పిన పుతిన్‌

ఆ ఏఐ మాయను చూసి ఒకింత ఆశ్చర్యపోయిన పుతిన్‌.. కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత రష్యా అధినేత మాట్లాడుతూ.. ‘‘నన్ను పోలిన తొలి వ్యక్తివి నువ్వే. నువ్వు నాలాగే ఉండొచ్చు. నాలాగే మాట్లాడొచ్చు. కానీ, అచ్చం నాలాగే ఉండే వ్యక్తి.. నాలాగే మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు. అది నేనే’’ అని అన్నారు. అయితే, అప్పటికే కొన్ని గంటల పాటు విలేకరుల సమావేశంలో ఉన్న పుతిన్‌.. ఈ ప్రశ్నతో ఒకింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

అచ్చం పుతిన్‌ను పోలిన వ్యక్తులు రష్యాలో చాలా మంది ఉన్నారని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. రష్యా అధ్యక్షుడి అనారోగ్యాన్ని దాచిపెట్టేందుకు.. చాలా బహిరంగ కార్యక్రమాల్లో ఆ నకిలీ పుతిన్‌లే పాల్గొంటారనే వదంతులున్నాయి. అయితే, వీటిని క్రెమ్లిన్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. గత 24 ఏళ్లుగా రష్యాను పాలిస్తూ.. మరోమారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన వార్షిక విలేకరుల సమావేశాలు నిర్వహించి.. దాదాపు నాలుగు గంటల సేపు మాట్లాడారు. ఈ సారి పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులూ తమ సమస్యలపై ఫోన్‌ ద్వారా అధ్యక్షుడిని ప్రశ్నించే అవకాశం కల్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని